నిర్మాణానికి 950 ఎకరాల భూమి గుర్తింపు
పది రోజుల్లో ఏఏఐ ప్రీ ఫీజిబులిటీ అధ్యయనం
వరంగల్ తరహాలో భారీ విమానాశ్రయ నిర్మాణం
పెద్ద విమానాలు సైతం దిగేలా రన్‌వే
రాష్ట్రంలో మూడో విమానాశ్రయానికి వేగంగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ పనులు ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలో మూడో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను కూడా కొలిక్కి తేవటానికి చర్యలు ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత మూడో విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించాయి.
ఇది కూడా రాష్ట్రంలో కీలక విమానాశ్రయంగా మారుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ తరహాలో దీన్ని కూడా వేయి ఎకరాల్లో నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది.
పది రోజుల్లో సర్వేకు ఏఏఐ బృందం
విమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి గత పదేళ్ల వాతావరణ (మెటియోరాలాజికల్) నివేదికలు, విండ్‌రోజ్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఏఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు మరో పదిరోజుల్లో ఏఏఐ సాంకేతిక బృందం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతోంది.
అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ కూడా పెద్ద రన్‌వే..
వరంగల్‌లో దాదాపు 2,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. కొత్తగూడెంలో కూడా అలాంటి భారీ రన్‌వేను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా, భారీ విమానాలు దిగగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది.
950 ఎకరాల భూమి గుర్తింపు
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగులో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్‌్రస్టిప్స్‌ను పునరుద్ధరించటంతోపాటు మరో మూడు చోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించాలన్నది ప్రతిపాదన. వీటిల్లో తొలుత వరంగల్ శివారులోని మూమునూరు పాత ఎయిర్‌్రస్టిప్ ఉన్న స్థలంలో ఎయిర్‌బస్ వంటి భారీ విమానాలు కూడా దిగగలిగే రన్‌వేతో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇప్పుడు దానితోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ తొలుత చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా.. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో నిర్మించాలని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భావిస్తోంది. గతంలో విమానాశ్రయం కోసం పాల్వంచ సమీపంలో గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు.
రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఏఏఐ.. ఆ స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమరి్పంచింది. ఆ ప్రాంతంలో గుట్టలుండటంతోపాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఏఐ అధికారులతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.
ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఏఐ సమ్మతించటంతో జిల్లా కలెక్టర్‌కు ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు మూడు మండలాల పరిధిలోకి వచ్చే 950 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండల పరిధిలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు.
ఎన్నో ఉపయోగాలు
కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న మా ప్రతిపాదనకు అంగీకరించిన కేంద్రం.. అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సమ్మతించింది. బొగ్గు గనుల కేంద్రం, సిమెంటు పరిశ్రమల నిలయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం.. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్నందున రెండు రాష్ట్రాల అనుసంధానం తేలికవుతుంది.
ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 300 కి.మీ. దూరంలో ఉన్నందున ఎలాంటి నిబంధనలు అడ్డు రావు. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవాలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు ఇది దోహదపడుతుంది.– తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment