జిల్లాకు వచ్చిన సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ బృందం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఒక్కో అధికారుల బృందం ఒక్కో అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి.? ప్రతికూల పరిస్థితులేంటి.? అనే దానిపై క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, గాలివాటం, కావాల్సిన స్థలం, రన్‌వే ఏర్పాటుకు మట్టి నమునాల సేకరణ, పెద్దపెద్ద భవనాలు, విద్యుత్ టవర్ల తొలగింపు, తదితర అంశాలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ (నేల దర్యాప్తు సలహాదారు) బృందం సభ్యులు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే నమూనాల సేకరణకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే మట్టి నమూనాలను సేకరిస్తామని బృందం సభ్యులు తెలిపారు.
ఒక్కో బృందం.. ఒక్కో అంశంపై పరిశీలన
జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం 2014లో భూమి సర్వే చేపట్టింది. అప్పట్లో ఐదు రోజుల పాటు సర్వే చేసిన అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 1,562 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మూడేళ్ల వరకు విమానాశ్రయ ఏర్పాటులో ఎలాంటి కదలిక లేదు. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇందులో ఆదిలాబాద్ కూడా ఉండడంతో విమానాశ్రయ ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే 2019 ఆగస్టులో ఎయిర్‌పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం జిల్లాకు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. విమానాశ్రయానికి కావాల్సిన స్థలం, బౌండ్రీలు, గుట్టలు, విద్యుత్ టవర్లు, పెద్ద భవనాలు, ట్రాఫిక్, వ్యాపార అభివృద్ధి అవకాశాలు, తదితర వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
నేటి నుంచి మట్టి నమూనాల సేకరణ
విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా రన్‌వే స్థలంలో ఉన్న మట్టిని పరిశీలించేందుకు నేల దర్యాప్తు సలహాదారు (సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్) బృందం సభ్యులు జిల్లాకు వచ్చారు. విమానాశ్రయ స్థలంలో ఉన్న మట్టి రన్‌వేకు అనుకూలంగా ఉందా.? లేదా.. అనేది తేల్చేందుకు మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే మంగళవారం వరకు ఏఏఐ నుంచి మట్టి నమూనాల సేకరణకు అనుమతి రాకపోవడంతో బృందం సభ్యులు అక్కడే టెంట్ వేసుకొని ఉన్నారు. అనుమతి రాగానే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతామని, తద్వారా ఇక్కడున్న మట్టిని దృష్టిలో ఉంచుకొని రన్‌వే ఏ విధంగా డిజైన్ చేయొచ్చనే ఐడియా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకు అనుమతి వస్తే సాయంత్రం నుంచి మట్టి నమూనాలు సేకరించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు.
త్వరలో మరో బృందం?
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు పరిస్థితులన్నీ అనుకూలించడంతో త్వరలో మరో అధికారుల బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఇక్కడి సాంకేతిక అంశాలపై ఆ బృందం పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఎలాంటి విద్యుత్ టవర్లు ఉండకూడదు. అయితే రన్‌వే స్థలానికి కొద్ది రూపంలో అనుకుంట గ్రామ శివారులో విద్యుత్ టవర్లు ఉన్నాయి. వాటిని తీసి కొత్త చోట ఏర్పాటు చేయడమా.? లేక విమానాశ్రయ డిజైన్‌ను మార్చడమా.? అనే దానిపై ఆ బృందం ఆరా తీయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు భూమి స్వాధీనం, విమానాశ్రయం చుట్టు పక్కల అనుకూలతలను పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది.
మట్టి నమూనాలు సేకరిస్తారు
విమానాశ్రయ ఏర్పాటు విషయమై జిల్లాకు వచ్చిన అధికారుల బృందాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన సాయిల్ ఇన్వెస్టిగేషన్ బృందం రన్‌వే ఏర్పాటు కోసం మట్టి నమూనాలు సేకరించనుంది. ఇందుకు సభ్యులకు లోకేషన్, ఇక్కడి పరిస్థితులు, స్థలం, బౌండ్రీలు తదితర విషయాలను వివరించాం. రాబోయే రోజుల్లో మరిన్నీ పరిశీలనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. – సురేశ్ రాథోడ్, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment