ఎరువులపై సిగ్నల్‌ దరువు | eruvulapai signal daruvu | Sakshi
Sakshi News home page

ఎరువులపై సిగ్నల్‌ దరువు

Published Sat, Sep 17 2016 1:49 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

eruvulapai signal daruvu

భీమవరం : ఎరువుల అమ్మకాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పోస్‌ విధానంతో రైతులు, వ్యాపారులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పోస్‌ యంత్రాలకు సక్రమంగా సిగ్నల్స్‌ అందకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా ఎరువుల కొరత నివారణ, ఆహార పదార్థాలపై విష ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విధానం అమలులోకి తీసుకువచ్చినా ప్రభుత్వ నిబంధనలతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎరువులు పొందాలంటే ఎరువుల డీలర్లు, సహకార ‡సంఘాల వద్ద పట్టాదార్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు నకళ్లను తీసుకువెళ్లి దానిలో నమోదుచేయించుకుని ఎరువులు పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పోస్‌ విధానంలో ఎంత ఎరువునైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
సరిగా పనిచేయని సిగ్నల్స్‌ 
రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు), ఎరువుల వ్యాపారుల వద్దకు ఆధార్‌ కార్డుతో వెళ్లాలి. దాని ద్వారా రైతుకు ఏ ఎరువు ఎంత మొత్తంలో కావాలో ఈ పోస్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దానిని పొందుపర్చి కొనుగోలు చేసిన ఎరువుల మొత్తానికి రశీదు ఇచ్చి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్‌ యంత్రాలకు సిగ్నల్స్‌ సరిగా అనుసంధానం కాకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. 
డీసీసీబీ, డీసీఎంఎస్‌ సమావేశాల్లో చర్చ
ఎరువుల విక్రయంలో ఈ పోస్‌ విధానం అమలు కారణంగా సహకార సంఘాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇటీవల జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ జనరల్‌ బాడీ సమావేశాల్లో సహకార సంఘాల ఉద్యోగులు, రైతులు ఏకరవు పెట్టారు. ఈ పోస్‌ విధానం వేగవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులు సొసైటీలపై అభాండాలు వేసే ప్రమాదముందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా చేతిలో సొమ్ము, ఎదురుగా ఎరువులున్నా పంట పొలాలకు వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ధ్వజమెత్తారు.
కొనుగోలులో కష్టాలు 
ఈ పోస్‌ విధానంలో ఎరువుల కంపెనీలు, డీలర్ల నుంచి సహకార సంఘాలు, వ్యాపారులు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఎరువుకు ఆయా కంపెనీల నుంచి ఎక్‌నాలేడ్జ్‌మెంట్‌ పొందాల్సి ఉంటుంది. ఎరువులు దిగుమతి చేసిన వాహనదారుడు తిరిగి వెళ్లి ఆయా కంపెనీలు, డీలర్లకు వారు దింపుకున్న మొత్తం వివరాలను తెలిపిన తరువాత వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే స్టాక్‌ రిజిస్టర్‌లో చూపిస్తుంది. అప్పటివరకు వ్యాపారులు ఎరువులు అమ్ముకునే అవకాశం లేదు. డీలర్లు, కంపెనీలు వెనువెంటనే ఆన్‌లైన్‌ చేయకపోవడంతో  స్టాక్‌ రిజిస్టర్‌లో చూపించకపోవడం వల్ల తమ వద్ద సరుకు ఉన్నా అమ్ముకునే వీలులేకుండా పోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఏప్రిల్‌ నుంచి సరికొత్త విధానం
ప్రస్తుతం రైతుల భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి రైతులు ఎరువులు కొనుగోలుకు వెళ్తే వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించి దానిలో వివరాల మేరకే ఎరువుల వ్యాపారులు, సొసైటీల్లో ఎరువులను విక్రయించాల్సి ఉంది. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరువులను అందించనున్నారు.  రైతులు ఏ ఎరువులు కొనుగోలు చేసినా పూర్తి ధరకే కొనాలి. అనంతరం ఆయా ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు. 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement