
ఇంటింటికీ వ్యవసాయ పథకాలు
అనంతపురం టౌన్: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గ్రామాల్లోని ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత మహిళా సంఘాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో ‘వ్యవసాయాభివృద్ధి–మహిళా సంఘాల పాత్ర’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని తెలుగు భాషలో మహిళా సమాఖ్యలకు పంపుతామన్నారు. వీటిపై గ్రామ, మండల సమాఖ్య సమావేశాల్లో చర్చించి రైతులకు సమాచారం అందించాలన్నారు. ‘మన విత్తన కేంద్రం’ ద్వారా విత్తన సేకరణ మహిళా సంఘాలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే కొన్ని మండలాల్లో జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా నవధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష లోపు రుణాలను బ్యాంకర్లు ఇవ్వాలని, దీనిపై రైతులకు సరైన అవగాహన లేదన్నారు. రుణ అర్హత కార్డులు, వ్యవసాయ సాగు ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒకటి బ్యాంకుకు ఇస్తే రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు తదితర వస్తువులు లభించే ‘వన్ స్టాప్ షాప్’ను నిర్వహించేందుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని కోరారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ మహిళా సంఘాలపై నమ్మకంతో ఈ–క్రాప్ నమోదును అప్పగిస్తే అద్భుతంగా చేశారన్నారు. వ్యవసాయ అధికారులు మండల స్థాయి సమావేశాలకు వెళ్లి తమ శాఖలో అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జేసీ–2 వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, పీఎం నరసయ్య, డీపీఎం రామ్మోహన్, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ, సభ్యులు, వ్యవసాయ, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.