Published
Sun, Jul 17 2016 6:09 PM
| Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
ప్రతీ ఇల్లు హరితవనం కావాలి..
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
13.56 లక్షల మొక్కలు నాటిన పోలీసులు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ప్రతీ ఇల్లు ఒక హరితవనం కావాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణ శివారులోని సీసీఐ కాలనీ జీఎస్ ఎస్టేట్‌లో హరితహారం నిర్వహించారు. 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఎస్పీకి కాలనీ చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల 56 వేల మొక్కలు నాటామని, రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అన్నారు. కాలనీలోని ప్రతీ ఇంట్లో పది మొక్కలు నాటాలని సూచించారు.
ఆదివారం ఒకే రోజు లక్షా 6 వేల మొక్కలు నాటామన్నారు. పోలీసులు మొక్కలు నాటడంతోపాటు గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ రోజు లక్ష మొక్కలు నాటే ప్రణాళిక పెట్టుకున్నామని తెలిపారు. జనమైత్రి పోలీసు అధికారులకు స్థానిక యువకులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఏఎస్సై జి.అప్పారావు, కాలనీవాసులు బి.కిషన్‌రావు, ఉత్తూరు సందీప్, వి.గంగాధర్, రాజేందర్ శర్మ, శేషగిరి, భాస్కరాచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.