అందరూ ఆతిథ్యం ఇవ్వాలి
రామవరప్పాడు :
రాబోయే కృష్ణా పుష్కరాల్లో నగరంలోని ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను సందరంగా తీర్చిదిద్దామన్నారు. కృష్ణా, గోదావరి నధుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమం ఏర్పాటు చేసుకోగలిగామని పేర్కొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు పరిశీలన
ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు ఆ రోడ్డుపై కాన్వాయ్‌లో ప్రయాణించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముస్లింల సంక్షేమానికి కృషి : మంత్రి పల్లె
విజయవాడ (వన్‌టౌన్) :
ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వించిపేటలోని ముసాఫిర్‌ఖానా ప్రాంగణంలో నూతనంగా చేపట్టిన షాదీఖానా భవన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తొలుగ జరిగిన సభలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేస్తోందని చెప్పారు. రంజాన్ తోఫా పేరుతో ప్రతి పేద ముస్లిం ఇంట పండుగ వాతావరణం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు 12 శాతం మంది ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. సభకు ముస్లిం మహిళలు అంతగా హాజరుకాకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించారు.