
కోనేరు అంతిమయాత్ర దృశ్యం
- భారీగా హాజరైన ప్రజలు, అభిమానులు
- ప్రభుత్వం తరఫున నివాళులర్పించిన జేసీ దివ్య
- అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు జలగం, సండ్ర
కొత్తగూడెం: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కోనేరు నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి. కొత్తగూడెం మండలం పెనగడపలోగల ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలు అభిమానులు, ప్రజల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో కోనేరు స్వగృహంలో తొలుత ఆయన మృతదేహంపై కొత్తగూడెం ఆర్డీఓ ఎం.వీ.రవీంద్రనా«థ్ జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కోనేరు భౌతిక కాయంతో అంతిమయాత్ర పోలీసు కవాతు, మేళ తాళాలతో ప్రారంభమైంది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర ఎం.జీ.రోడ్, బస్టాండ్, పోస్టాఫీస్, హెడ్డాఫీస్, రామవరంల మీదుగా పెనగడపలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. అడుగడుగునా పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ దేవరాజన్ దివ్య ఆదేశాల మేరకు కొత్తగూడెం ఆర్డీఓ ఎం.వి.రవీంద్రనా«ద్ అంత్యక్రియల నిర్వహణ ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ క్షేత్రానికి కోనేరు భౌతిక కాయం చేరుకున్న అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ దివ్య ప్రభుత్వం తరఫున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసులు గౌరవ సూచికంగా గాలిలోకి మూడు పర్యాయాలు కాల్పులు జరుపగా కోనేరు పెద్ద కుమారుడు కోనేరు పూర్ణచందర్‌రావు ఆయన చితికి నిప్పంటించారు. ఈ అంతిమ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, తహసీల్దార్ అశోక చక్రవర్తి, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, కోనేరు చిన్న కుమారుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), కుమార్తె వల్లూరిపల్లి ఉషారాణి, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు.