మాట్లాడుతున్న నారా లోకేష్
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
- మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు సంతాపసభలో నారా లోకేష్
కొత్తగూడెం: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోనేరు నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన కోనేరు నాగేశ్వరరావు సంతాపసభకు హాజరై.. కోనేరు చిత్రపటానికి నివాళి అర్పించి ప్రసంగించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు కోనేరు టీడీపీలో అంకితభావంతో సేవలందించారని కొనియాడారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పదవుల కోసం అనేకమంది పార్టీలు మారుతున్నప్పటికీ ఆయన చనిపోయేంతవరకు ఒకే పార్టీలో ఉండి సేవలందించడం అభినందనీయమన్నారు. కోనేరు క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని సూచించారు. పార్టీకి వెన్నంటి ఉండే కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే కోనేరు విగ్రహాన్ని ఏర్పాటుచేసి విగ్రహావిష్కరణకు ఏపీ సీఎం చంద్రబాబును తీసుకువస్తామని తెలిపారు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..: కోనేరు అనుచరులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో కోనేరు విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..: పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని గతంలో కోనేరు చెప్పారని గుర్తు చేశారు.
ఈ సంతాపసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సినీ నటుడు నందమూరి తారకరత్న, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, చేకూరి కాశయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మాళోతు రాందాస్ నాయక్, కోనేరు కుటుంబ సభ్యులు కోనేరు పూర్ణచందర్‌రావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నాయకులకు మరణం లేదు: మంత్రి తుమ్మల
నిరంతరం ప్రజా సేవకు అంకితమయ్యే నాయకులకు మరణం ఉండదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీనగర్ కాలనీలోని కోనేరు నాగేశ్వరరావు స్వగృహంలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి హాజరై..కోనేరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిజాయితీ, నిబద్దతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి కొనేరని కొనియాడారు. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని స్మరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.