గాంధీ ఆస్పత్రి: శవాలను మార్చేసి పోస్టుమార్టం నిర్వహించి ఆనక చేసిన తప్పిదాన్ని తెలుసుకుని సదరు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా బతిమాలుతున్నా పోస్టుమార్టం చేయకుండా తిప్పించి, ఇప్పుడు తప్పు చేసి మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ మృతుని బంధువులు వారితో వాగ్వాదానికి దిగారు. గాంధీ మార్చురీలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే..మహబూబ్‌నగర్‌కు చెందిన ఎండీ గౌస్ కొద్దిరోజుల క్రితం ఇంట్లో కాలుజారి పడి తీవ్రంగా గాయపడ్డాడు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను నాలుగు రోజుల క్రితం మృతిచెందాడు. మెడికో లీగల్ కేసు కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి బాక్స్ నంబర్ 18లో భధ్రపరిచారు. హహబూబ్‌నగర్ పోలీసులు వచ్చి పంచనామా చేస్తేనే పోస్టుమార్టం చేస్తామనడంతో గౌస్ కుటుంబసభ్యులు నాలుగురోజులుగా మార్చురీ వద్దే పడిగాపులు పడుతున్నారు. ఇదిలా ఉండగా గాంధీనగర్ ఠాణా పరిధిలో సోమవారం లభించిన గుర్తుతెలియని మృతదేహాన్ని మార్చురీలోని బాక్స్ నంబర్ 16లో ఉంచారు. రికార్డులో మాత్రం బాక్స్ నంబర్ 18గా నమోదు చేశారు. మంగళవారం ఉదయం గాంధీనగర్ పోలీసులు పంచనామా చేసి నివేదిక ఇవ్వడంతో 18వ నెంబర్ బాక్స్‌లోని గౌస్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
ఆ తర్వాత తప్పును గుర్తించిన మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం చేసేశాం మృతదేహం తీసుకెళ్లాలని గౌస్ కుటుంబ సభ్యులకు సూచించారు. నాలుగు రోజులుగా తిప్పించి పోలీసులు రాకుండానే పోస్టుమార్టం నిర్వహించడం వెనుక ఎదో మతలబు ఉందన్న అనుమానంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో మార్చురీ సిబ్బంది, పోలీసులు, వైద్యులు నచ్చజెప్పడంతో గౌస్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు.