పేరేచర్లలో కేజీ గంజాయి పట్టివేత
-
ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు
పేరేచర్ల : మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్లలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జి.సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని పేరేచర్ల నరసరావుపేట రోడ్డులోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో తంగస్వామి పెరియాస్వామి అనే వ్యక్తి ఒక సంచిలో గంజాయిని తరలిస్తుండగా దాడి చేసి, అతని నుంచి సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సత్తెనపల్లి ఎక్సైజ్ సీఐ ఎం.రమేష్, ఎస్‌ఐలు ప్రసన్నలక్ష్మి, రవికుమార్ పాల్గొన్నారు. వీఆర్వో వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
-
రూ.1.50 లక్షల ఖైనీ, గుట్కాల స్వాధీనం
సత్తెనపల్లి: నిషేధిత ఖైనీ, గుట్కాల నిల్వలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదుట ఎల్.హనుమంతరావు అనే వ్యాపారికి చెందిన గోదాములో నిషేధిత ఖైనీ, గుట్కాలు పెద్ద మొత్తంలో ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ పీఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు 20 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఖైనీ, గుట్కాల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.