తాగరన్నా.. తాగి ఊగరన్నా!
♦ మందు కల్లు తాగాలని పల్లెల్లో దండోరా
♦ ఆరోగ్యం బాగవుతుందంటూ కల్లు వ్యాపారుల ప్రచారం
♦ మళ్లీ ‘మత్తు’లోకి జారుకుంటున్న జనం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దుకాణంలకు పాత కల్లు (మందు కల్లు) మల్లొచ్చింది. మాపటీల నిదుర పట్టనోళ్లు.. బెత్తలి బెత్తలి జేసేటోళ్లు.. తలకాయ తిరిగేటొల్లొచ్చి కల్లు తాగితే మంచిగైతరు. దుకాణానికొచ్చి కల్లు తాగండహో...’ మెదక్ జిల్లాలోని పల్లెల్లో కల్లు దుకాణదారులు వేయిస్తున్న దండోరా ఇదీ! అంతుబట్టని బెత్తలి (హిస్టీరియా) రోగానికి మందు కల్లు దివ్యౌషధం అనే ప్రచారం జరుగుతోంది. కల్లు తాగితే కళ్లు తిరగడం పోతుందని, హిస్టీరియా దగ్గరకే రాదని దుకాణదారులు గ్రా మాల్లో దండోరా వేయిస్తున్నారు. ఇటీవల కృత్రిమ కల్లుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి.. ఆల్ఫ్రోజోలం, డైజోఫాం వంటి మత్తు మందులను కలపకుండా కట్టడి చేసింది. దీంతో జిల్లాలో ఈ కల్లుతాగే అలవాటున్నవారు మత్తు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. కొందరు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మత్తు కల్లు జనానికి అందుబాటులోకి వచ్చింది.
వైద్యుల శ్రమ వృథా..
పల్లెల్లో మళ్లీ మందు కల్లు కోరలు చాచడంతో వైద్యుల శ్రమంతా బూడిదలో పోసినట్లైంది. కల్లు బాధితులకు జిల్లా వైద్యులు అతి కష్టమ్మీద సాధారణ స్థితికి తీసుకొచ్చారు. వందల సంఖ్యలో రోగులకు వైద్యం చేసి పంపారు. ఇంకొద్ది రోజులు కల్తీకల్లు నివారించి ఉంటే వీరంతా ‘కల్లు బానిసత్వం’ నుంచి బయట పడేవాళ్లు. కానీ ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి రావడంతో మత్తు బారిన పడుతున్నారు. కడుపు నిండా మందు కల్లు తాగి కంటి నిండా నిద్రపోతున్నారు.
మూమూళ్ల మత్తులో అధికారులు
కల్లులో కలిపే మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం జిల్లాలో ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లోని ఔషధ తయారీ పరిశ్రమల నుంచి వీటిని అక్రమంగా సేకరించి, జహీరాబాద్ చెక్ పోస్టు మీదుగా జిల్లాకు తరలిస్తున్నారు. ఈ నిషేధిత పదార్థాల రవాణాను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.