
అనుమానాస్పదస్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి
♦ భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు
♦ మృతురాలు మెదక్ జిల్లా సంగారెడ్డి
పెద్దేముల్ : ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటశీను కథనం మేరకు.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన పొట్టుపల్లి మంజుల (34), అదే గ్రామానికి చెందిన మహేష్‌లు ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ సమయంలో ప్రేమించుకుని 2015 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. పటాన్‌చెరువు ఎక్సైజ్ పొలీస్ స్టేషన్‌లో ఇద్దరూ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలోని భూ కైలాస్ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి బైక్‌పై బయలు దేరారు.
ఏమైందో తెలియదు కానీ.. తెల్లవారుఝామున 4 నుంచి 5గంటల మధ్య పెద్దేముల్ మండల గాజీపూర్ గ్రామ సమీపంలో తాండూరు - సంగారెడ్డి రహదారిపై మంజుల, మహేష్‌లు పడి ఉన్నారు. ఉదయం గాజీపూర్ గ్రామానికి చెందిన పలువురు వాకింగ్ వెళుతుండగా విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. మంజుల అప్పటికే మృతిచెందగా.. స్పృహ కోల్పోయి ఉన్న మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా.. మంజుల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోయినా.. ముక్క నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా.. అమ్మాయి తండ్రి నర్సిములు మాత్రం తమ కుమార్తెను అల్లుడు మహేష్‌తో పాటు ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి అంజమ్మ, తమ్ముడు ప్రదీప్, బావ మల్లేశంలు కలసి హత్య చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.