- పెద్దపల్లిలోకి ధర్మారం
- కరీంనగర్‌లోనే బెజ్జంకి
- ముస్తాబాద్‌పై పునరాలోచన
సా...గుతున్న కసరత్తు!
Published Sun, Aug 21 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన కసరత్తు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్‌లో ఉన్న అన్ని మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి వస్తున్నాయా? లేదా? ఒకే రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు రెండేసి జిల్లాల్లో కొనసాగుతున్నాయా? కొత్తగా ఏర్పాటు చేయబోయే రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో పొందుపర్చారా? లేదా? అనే అంశాలపై వివరాలు తెప్పించుకున్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు తిరిగి జిల్లా అధికార యంత్రాంగానికి నిరంతరం సూచనలిస్తూనే ఉన్నారు. తెల్లవారితే నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి రావడంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేశారు. స్వల్ప మార్పులు మినహా ముసాయిదా జాబితాలో పెద్దగా మార్పులేమీ చేయలేదని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకు కేటాయించిన ధర్మారం మండలాన్ని తాజాగా పెద్దపల్లి జిల్లాకు మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ధర్మారం మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇదే డివిజన్‌లో ఉన్న వెల్గటూర్ మండలాన్ని మాత్రం జగిత్యాల జిల్లాకే కేటాయించినట్లు తెలిసింది. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలాన్ని ముసాయిదాలో సిద్దిపేటకు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపైనా పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. ఈ మండలాన్ని సైతం కరీంనగర్‌లో కొనసాగించడమే మేలనే భావనతో ఉన్నారు. అట్లాగే బెజ్జంకి మండలంలోని కొన్ని గ్రామాలను సిద్దిపేట జిల్లాలో కలుపుతారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ మండలాన్ని పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించనున్నారు. మండలాల కేటాయింపుల్లో మార్పులు చేర్పుల అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదని, సోమవారం ఉదయానికి జిల్లాల పునర్విభజన ప్రక్రియకు తుదిరూపు వస్తుందని జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement