జనగణన... వచ్చే ఏడాదే | Centre to begin population census in 2025, with Lok Sabha delimitation exercise set for 2028 | Sakshi
Sakshi News home page

జనగణన... వచ్చే ఏడాదే

Published Tue, Oct 29 2024 4:20 AM | Last Updated on Tue, Oct 29 2024 5:26 AM

Centre to begin population census in 2025, with Lok Sabha delimitation exercise set for 2028

2026 నాటికి పూర్తి..∙కేంద్రం నిర్ణయం! 

తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?

అడ్డంకిగా మారనున్న ఆర్టికల్‌ 82

కులగణనపై ఇప్పటికైతే అస్పష్టతే

జరిపి తీరాల్సిందేనంటున్న విపక్షాలు

న్యూఢిల్లీ: నాలుగేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు దేశ జనాభా గణన జరగనుంది. ‘‘2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి కావచ్చు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. 

కులగణన చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా ఉంటుందా అన్న కీలక అంశంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్‌ జనరల్, జనగణన కమిషనర్‌ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. 

జనగణనలో మత, సామాజిక వర్గీకరణతో పాటు, జనరల్, ఎస్సీ, ఎస్టీ గణనే గాక జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ఉప విభాగాల సర్వేలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనగణనను సరైన సమయంలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గత ఆగస్టులో చెప్పడం తెలిసిందే. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా డిజిటల్‌గా జరుగుతుందని ఆయన వెల్లడించారు.

మారిపోనున్న జనగణన సైకిల్‌: భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్య్రానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్‌లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన సైకిల్‌ కూడా మారనుంది. 

ఇకపై 2025–35, 2035–45... ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ డిప్యుటేషన్‌ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.

కులగణన జరపాల్సిందేనన్న కాంగ్రెస్‌: కులగణనకు కేంద్రం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాగూర్‌ విమర్శించారు. మోదీ సర్కారు రాజకీయ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడతాయా, లేదా మౌనంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.

లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమో!
జనాభా లెక్కల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఉత్తరాదితో పోలిస్తే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం తెలిసిందే. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్‌ వ్యవస్థీకరణ జరిగే పోంలో తమ లోక్‌సభ స్థానాల్లో బాగా కోత పడే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది.

 ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆ రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్‌ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది. 

ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్‌ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ క్రతువును మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement