
‘ఖేడ్’పై కుస్తీ!
♦ పునర్విభజనపై ముమ్మర కసరత్తు
♦ స్థానికంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
♦ సంగారెడ్డిలోనే ఉంచుతూ అధికారుల ప్రతిపాదనలు
♦ ఆమోదం కాకపోవచ్చంటున్న ఉన్నత స్థాయి వర్గాలు
♦ భౌగోళిక స్వరూపం.. మెదక్‌వైపే మొగ్గు
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మమ్మురంగా సాగుతోంది. దసరా నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పునర్విభజనకు తుది మెరుగులు దిద్దుతోంది. మంగళవారం కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జిల్లా స్థాయి అధికారులతో, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల సూపరింటెండెంట్లతోనూ వేర్వేరుగా సమావేశమాయ్యారు. ఉద్యోగుల లభ్యత, ప్రాంతాల పంపకాలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాపై పూర్తి స్పష్టత సాధించిన అధికారులు.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల పునర్విభజనపైనే మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రధానంగా నారాయణఖేడ్ నియోజకవర్గంపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. భౌగోళిక స్వరూపం, పునర్విభజనలోని 60 కిలోమీటర్ల లోబడిన పరిధి నింబధనల ఆధారంగా నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోకి వస్తుంది. తొలుత అధికారులు మెదక్ జిల్లాలోనే కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానికంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బహిరంగంగానే తన వాదన అధికారులకు, మంత్రి హరీశ్‌రావుకు వివరించారు.
రవాణా పరంగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌కే సౌకర్యా లు మెరుగ్గా ఉన్నాయి. నియోజకవర్గ వాసులు ఏ పనులకైనా సంగారెడ్డి, హైదరాబాద్ లేదా బీదర్‌కు వెళ్తారు. కానీ మెదక్‌కు అసలే వెళ్లరు. వలసవెళ్లినవారిలో మెజార్టీ వాసులు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచుతూ మరో ప్రతిపాదనను సీసీఎల్‌ఏకు పంపారు.
అధికారులైతే ప్రతిపాదనలు పంపారు కానీ దీనికి తుది ఆమోదం లభిస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం నుంచి సంగారెడ్డి 85 కిలోమీటర్లు, అదే మెదక్ జిల్లా కేంద్రం 56 కిలో మీటర్ల దూరమే వస్తుంది. ఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలోని చివరి గ్రామం దెగుల్‌వాడీ నుంచి సంగారెడ్డి 129 కిలోమీటర్లు కాగా దెగుల్‌వాడీ నుంచి మెదక్ 88 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది. మరో ప్రధానమై అంశం ఏమిటంటే నారాయణఖేడ్ ప్రజలు సంగారెడ్డికి రావాలంటే ఆందోల్ నియోజకవర్గ కేంద్రం మీదుగా రావాలి. ప్రస్తుత ప్రతిపాదనలతో అందోల్ నియోజకవ ర్గం మునిపల్లి, రేగోడు మండలాలు మినహా మెదక్ జిల్లాలోకి వెళ్తుంది. అంటే నారాయణఖేడ్ వాసులు మెదక్ జిల్లా దాటి సంగారెడ్డిలోకి ప్రవేశించాలి.
మరో వైపు అందోల్ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా తమను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాబూమోహన్ కూడా అధికారులను, మంత్రిని కలిసి తమ ప్రజల అభిప్రాయాన్ని వారికి వివరించారు. పైగా అందోల్ నియోజకవర్గ కేంద్రం సంగారెడ్డికి 30 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. దగ్గరగా ఉన్న అందోల్ నియోజకవర్గాన్ని పక్కనపెట్టి దూరంగా ఉన్న నారాయణఖేడ్‌ను కలపటం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు నోటిఫికేషన్ వెలువడిన తరువాత అందోల్ ప్రజలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అదే జరిగితే పునర్విభజనలో శాస్త్రీయత లోటు స్పష్టంగా బయటపడుతుందని, దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కుస్తీ పడుతోంది.