విజిలెన్స్ అధికారినంటూ టోకరా
* సినీ ఫక్కీలో దోపిడీ
* 25 కాసుల బంగారు ఆభరణాలు చోరీ
తూర్పుచోడవరం (నల్లజర్ల) : విజిలెన్స్ అధికారినంటూ ఓ ఆగంతకుడు సినీ ఫక్కీలో రేషన్ డీలర్ నుంచి 25 కాసుల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు దోచుకుపోయాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నల్లజర్ల మండలం తూర్పుచోడవరంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..
తూర్పుచోడవరంలో పసల దశావతారమ్మకు చెందిన 18వ నంబరు రేషన్ దుకాణాన్ని ఆమె కుమార్తె ఆలపాటి స్వరాజ్యలక్ష్మి నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీస్ గుర్తు ఉన్న బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు తాను విజిలెన్స్ శాఖ అధికారినంటూ డిపోను తనిఖీ చేయాలని నమ్మబలికాడు. రిజిస్టర్లు పరిశీలించి 2 బస్తాలు బియ్యం ఎక్కువగా ఉన్నాయని, రూ.లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పడుతుందని భయపెట్టాడు.
తనతో పాటు మూడు బృందాలు అనంతపల్లి, చోడవరం, గుండేపల్లిలో తనిఖీలు చేస్తున్నాయని, ముగ్గురిని అ రెస్ట్ చేశారని చెప్పాడు. దీంతో కంగారు పడిన దశావతారమ్మ, స్వరాజలక్ష్మి తమ వద్ద ఉన్న రూ.3 వేలను అతడికి ఇచ్చారు. నగదు తీసుకుని తిరిగి వెళుతున్న ఆగంతుడి కన్ను మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలపై పడింది.
మభ్యపెట్టి.. కాజేసి..
తాను వెళ్లిన తర్వాతపై అధికారులు వస్తారని, వంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ఫైన్ ఎక్కువ వేస్తారని మహిళలను ఆగంతకుడు భయపెట్టాడు. ఆభరణాలను తీసి దాచుకోమని సలహా కూడా ఇచ్చాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన తల్లీకూతుళ్లు వారి వంటిపై ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలను తీసి బీరువాలో దాచేందుకు వెళుతుండగా.. అధికారుల వద్ద చెకింగ్ మెషిన్ ఉంటుందని, ఇంట్లో దాస్తే సులభంగా కనిపెడతారని కంగారు పెట్టాడు.
పెరట్లోని నీళ్ల కుండీ పక్కన దాచుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో కంగారు పడిన తల్లీకూతుళ్లు ఆభరణాలను నీళ్ల కుండీ పక్కన పెట్టి ఆగంతకుడు కాఫీ అడగటంతో వంట గదిలోకి వెళ్లారు. ఈలోపు స్వరాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ ఇంటికి వచ్చారు. అతనికి విషయం చెప్పి కాఫీ బదులు కూల్‌డ్రింక్స్ తీసుకురమ్మని పంపాడు. సత్యనారాయణ తిరిగి వచ్చే లోపు పెరట్లో దాచిన బంగారు ఆభరణాలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు.
అధికారులు అనంతపల్లిలో ఉన్నారు తీసుకువద్దాం అంటూ కూల్‌డ్రింక్స్‌తో వచ్చిన సత్యనారాయణను తన బైక్‌పై తీసుకువెళ్లాడు. అధికారులు రాలేదని నమ్మబలికి ఊరి చివర సత్యనారాయణను వదలి ఉడాయిం చాడు. సత్యనారాయణ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గాని మోసం విషయం తెలియలేదు. బాధితులు అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాయక్ బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.