– 2న గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకలు
– హిందూ–ముస్లింలు శాంతియుతంగా మెలగాలి
– ఐక్యతా స్ఫూర్తితో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి
– శాంతి ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెస్టెంబర్ 2న వినాయక నిమజ్జనం, బక్రీదు వేడుకలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి సూచించారు. íహిందూ–ముస్లింలు ఐక్యతా స్ఫూర్తితో కర్నూలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. బుధవారం జమ్మిచెట్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు హిందూ–ముస్లింలు భాయి భాయి నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ శాంతి హితోపదేశం చేసి శాంతి కపోతాలు, బెలూన్లను ఎగుర వేశారు.
అనంతరం ర్యాలీ చిత్తారి వీధి జంక‌్షన్, కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ మీదుగా పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, కొండారెడ్డి బురుజు, తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ–ముస్లింలు సోదరులుగా మెలుగుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి ర్యాలీలో అడిషనల్ ఎస్పీలు షేక్ షాక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీ రమణామూర్తి, సీఐలు ములకన్న, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, కృష్ణయ్య, బి.శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఆర్‌ఐలు రంగముని, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు, గణేష్ కేంద్ర మహోత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు.
నిమజ్జనానికి సుంకేసుల నీరు వస్తుంది
సెప్టెంబర్ 2న కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2వ తేదీ ఉదయంలోపు కర్నూలుకు చేరే విధంగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. నీటి కొరత ఉన్నందున కేసీలో నీరు ముందుకు వెళ్లకుండా ఇసుక బస్తాలు, అడ్డుగోడలు ఏర్పాట్లు చేయాలన్నారు.
నిమజ్జనం సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, లైటింగ్ సదుపాయం, నగరంలో పారిశుద్ధ్య పనులు, తాగు నీరు, వైద్య శిబిరాలు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌లు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, డీఎస్‌పీ రమణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామిరెడ్డి, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కిష్టన్న, బాలసుబ్రమణ్యం, సందడి సుధాకర్, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు.