పుష్కర వాహిని.. పుణ్యవేణి | Eye feast worships at Puskara ghats | Sakshi
Sakshi News home page

పుష్కర వాహిని.. పుణ్యవేణి

Published Sat, Aug 20 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

పుష్కర వాహిని.. పుణ్యవేణి

పుష్కర వాహిని.. పుణ్యవేణి

సాక్షి, అమరావతి/ గుంటూరు : శ్రావణ శోభతో పుష్కర కృష్ణమ్మ శుక్రవారం కళకళలాడింది. మహిళలు పుష్కర స్నానా లు చేసి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఎనిమిదో రోజు అమరావతి మినహా మిగిలిన ఘాట్లలో భక్తుల రద్దీ కొద్దిమేర తగ్గింది. తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌లో సుమారు 10వేల మంది భక్తులతో కలిసి చినజీయర్‌ స్వామి పుష్కర స్నానం చేశారు. అనంతరం శుక్రవారం రాత్రి కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న పొందుగల, దైద, సత్రశాల, కృష్ణవేణి, అణుపు ఘాట్‌లను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తాళ్ళాయపాలెం పుష్కరఘాట్‌ వద్ద పడవలో తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 21న గురజాల నియోజకవర్గంలోని ఘాట్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నట్లు సమాచారం.
 
అమరావతిలో కొనసాగిన రద్దీ..
అమరావతిలో పుష్కర భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. పుష్కరాల ఎనిమిదో రోజూ రద్దీ కొనసాగింది. ఘాట్లన్నీ భక్తులతో కళకళలాడాయి. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేకంగా సారె పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమరావతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఎక్కువమంది భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో శుక్రవారం మధ్యాహ్నానికి 29,38,611 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క అమరావతిలోనే 13,53,594 మంది స్నానాలు చేసినట్టు చెబుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే లక్షా 25 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్‌లను పరిశీలిస్తూ ఘాట్‌ ఇన్‌చార్జిలు, పోలీసులు, దేవదాయ శాఖ, ఆర్టీసీ, రైల్వే అధికారుల సమన్వయంతో భక్తుల సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న అత్యధికంగా 3,22,500 మంది భక్తులు అమరావతికి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమరావతిలోని ధ్యానబుద్ద ఘాట్‌లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
 
అమరావతిలోనే అధికారుల మకాం..
అమరావతిలో జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఇన్‌చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావుతో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఇక్కడే మకాం వేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్‌ బాధ్యతను జెడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, డీపీవో శ్రీదేవిలకు అప్పజెప్పారు. శానిటేషన్‌ పర్యవేక్షణ బాధ్యతను గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నాగలక్ష్మికి శుక్రవారం నుంచి అదనపు బాధ్యతగా అప్పగించారు. మత్స్యశాఖ డీడీ బలరాం, డీఎంహెచ్‌ఓ పద్మజ, ధ్యానబుద్ధ ఘాట్‌ ఇన్‌ర్జి సబ్‌కలెక్టర్‌ హిమాంశుక్లా, అమరేశ్వర ఘాట్‌ ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ కృత్రికా బాత్రా, రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
  • అమరావతి పుష్కర ఘాట్‌లు, పరిస ర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా లేకపోవడంతో గుంటూరు నగరపాలక సంస్థ నుంచి 200మంది పారిశుధ్య కార్మికులను శుక్రవారం అక్కడకు పంపారు. 
  • ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు పుష్కర నగర్‌ల వద్ద బస్సులు దిగి ఉచిత బస్సులు ఎక్కాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చట్టిబిడ్డలతో వెళ్లేవారు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు అవస్థల పాలవుతున్నారు. ఆర్టీసీ బస్సులను నేరుగా పుష్కర ఘాట్‌ల వరకు వెళ్లేలా జిల్లా ఉన్నతాధికారలు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
  •  పుష్కర స్నానాలకు వెళ్తూ జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది యాత్రికులు గాయాలపాలయ్యారు.
  • శావల్యాపురం మండలం వైకల్లు గ్రా మానికి చెందిన 12మంది భక్తులు ఆటోలో వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. 
  • గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పది మంది ఆటోలో సత్రశాల పుష్కరఘాట్‌లో స్నానాలు చేసి వస్తుండగా రెంటచింతల మండలం గోలి గ్రామం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
  • తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర ఘాట్‌ వద్ద పనుల్లో నాణ్యత లేక అనేక చోట్ల టైల్స్‌ ఊడిపోయాయి.
  • ఎండ తీవ్రత కొనసాగుతుండటంతో మధ్యాహ్నం వేళ భక్తుల తాకిడి కనిపించటం లేదు. ప్రయాణాలు చేసేందుకు ప్రజలు సాహసం చేయటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement