విధికే ‘కన్ను’కుట్టింది! | eye lost Six year old boy | Sakshi
Sakshi News home page

విధికే ‘కన్ను’కుట్టింది!

Published Fri, Jul 22 2016 5:26 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

విధికే ‘కన్ను’కుట్టింది! - Sakshi

విధికే ‘కన్ను’కుట్టింది!

* చూపు కోల్పోయిన ఆరేళ్ల బాలుడు
* పెన్సిల్ తగిలి ఎడమ కన్ను.. టీచర్ బెత్తం తగిలి కుడి కన్ను
* ఏపీలోని ఒంగోలులో ఘటన

ఒంగోలు: ఆరేళ్ల వయసులోనే ఆ బాలునిపై విధికి కన్ను కుట్టింది. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పెన్సిల్ తగిలి గతంలో ఒక కంటి చూపు పోగా, ఇప్పుడు స్కూల్ టీచర్ ఆగ్రహానికి మరో కంటి చూపునూ కోల్పోయి అంధుడిగా మారాడు. తన బిడ్డకు చూపు తెప్పించేందుకు ఆదుకోవాలంటూ ఆ బాలుని తండ్రి జిల్లా కలెక్టర్‌ను కలసి విన్నవించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం చోటుచే సుకుంది.

కంభం మండలం రావిపాడుకు చెందిన కాళ్ల గోపాల్ కుమారుడు మోహనరంగ(6) స్థానిక ఆల్ఫా పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గతంలో పాఠశాలలో ఆడుకుంటూ ఉండగా తోటి విద్యార్థి చేతిలో పెన్సిల్  పొరపాటున  రంగ ఎడమ కంటిలో గుచ్చుకుంది. దీంతో ఆ కంటిచూపు పోయింది. తాజాగా ఈ నెల 13న పాఠశాలలో బాబుపై ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు బెత్తం ప్రయోగించింది. అది కుడికంటిపై తగిలిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

వెంటనే హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి చూపు వచ్చే అవకాశం లేదని, అయినప్పటికీఈ నెల 28న మరోమారు వైద్య పరీక్షలకు తీసుకురావాలని సూచించారంటూ కలెక్టర్ సుజాతశర్మకు బాలుడి తండ్రి విన్నవించుకున్నాడు. చిన్నారిని చూసిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. ఆ టీచర్ ఎవరు, యాజమాన్యం ఏం చేస్తోంది అంటూ ఆగ్రహించారు. వెంటనే సంబంధిత వ్యవహారంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని  డీఈవోను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement