లింక్ చెరువులపై దృష్టి
లింక్ చెరువులపై దృష్టి
Published Sat, May 20 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. నాబార్డు ఆధ్వర్యంలో స్థానిక డీసీసీబీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ‘నీరే జీవనం’ శిక్షణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై నాబార్డు ప్రచురించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు 116 లింకు చెరువులను అభివృద్ధి చేయడంతోపాటు ఫీడర్ చానల్స్ మరమ్మతులు చేపట్టినట్టు వివరించారు. జిల్లాలో 8 అడుగుల లోతులో భూగర్భ జలాలు లభించాల్సి ఉండగా.. 70 అడుగులు లోతుకు వెళ్లినా కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ ధృక్పథంతో భూగర్భ జలాలను పెంపొందించే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 116 లింకు చెరువులు ఉన్నాయని, వాటిద్వారా జిల్లాలోని 550 చెరువుల్ని అనుసంధానించే ఫీడర్ చానల్స్ మరమ్మతులు చేయగలిగితే భూగర్భ జలాలను మరింత పెంపొందించే అవకాశం ఉందని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, చెరువు కుంటల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణ కోసం నాబార్డు చేపట్టిన నీరే జీవనం కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వాలంటే పూర్తిస్థాయి అవగాహనతో ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. నీటి రక్షణ చర్యలపై గ్రామస్థాయి ప్రణాళికను సిద్ధం చేశామని, ఆ సమాచారాన్ని నాబార్డు ద్వారా శిక్షణ పొందే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా అందిస్తామని చెప్పారు. భూగర్భ జలాలను పరిరక్షించుకోకపోతే 2050 నాటికి నీటికొరత తలెత్తి పశు, పక్ష్యాదులతోపాటు ప్రజలు సైతం ఇబ్బందిపడే ప్రమాదం ఉందన్నారు. నాబార్డు ఏజీఎం శ్రీరామప్రభు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు నాబార్డు సమగ్ర ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఇందిరా ప్రకాష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement