నాటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలకృష్ణ వరకూ నందమూరి వంశాన్ని ఆదరిస్తూనే ఉన్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా బాలయ్యబాబుకు పట్టం కట్టారు. అయితే గత ఐదేళ్లూ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోని బాలయ్య.. ఇప్పుడు కూడా ప్రజల బాగోగులు విస్మరించారు. సినిమా షూటింగ్‌లంటూ ఆయన విదేశాలలో పర్యటిస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక ‘పురం’ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఖరికి ఆయన అసెంబ్లీ సమావేశాలకూ డుమ్మా కొట్టడంతో ‘పురం’ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. – హిందూపురం
విజయోత్సవానికే పరిమితం
హిందూపురం జిల్లాలోనే రెండో అతిపెద్ద పట్టణం. జిల్లా కేంద్రం అయ్యే అవకాశమున్న ప్రాంతం. కానీ ఇక్కడ సౌకర్యాలు మండలస్థాయికి మించి లేవు. జిల్లా కేంద్రం తర్వాత వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన హిందూపురం నియోజకవర్గంలో జనాభా, ప్రాంతాలు పెరిగాయే తప్ప... ఆ మేరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఐదేళ్లు చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య విజయోత్సవం నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ప్రమాణం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లిన బాలయ్య... కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. బాలకృష్ణ ఇటు ప్రజల్లో లేక ... అటు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో హిందూపురం సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేవారే కరువయ్యారు. ఫలితంగా ఇక్కడి జనం సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
భూమి పూజలు, రోడ్‌షోలకే పరిమితం
గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం వైపు కన్నెతి చూడటమే మానేశారు. గెలిచిన రెండోరోజు తన తండ్రి వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ , వసుంధర దంపతులు ఒకసారి వచ్చి ఊరేగింపు నిర్వహించి ఆ తర్వాత ఇటువైపునకు రాలేకపోయారు. గతంలో 2014లో గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి 20 సార్లలోపే ఆయన పర్యటించారు. వచ్చినప్పుడల్లా రెండు లేదా మూడు రోజుల రూట్‌మ్యాప్‌తో మూడు మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డు షోలు చేసి చేతులు దులుపుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఓ ఇంటిలో గృహ ప్రవేశం చేసి తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించారు. ఆయన భార్య వసుంధర కూడా గత ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించిన ఆమె తిరిగి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వచ్చారు.
తీరని తాగునీటి వ్యథ !
ఎన్నికల కోడ్ కూస్తోందని గొల్లపల్లి తాగునీటి పైప్‌లైన్ పూర్తికాకనే ప్రారంభించారు. గత ఎన్నికల వేళ హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. కేంద్ర నిధులు రూ.194 కోట్లతో తాగునీటి పైప్‌లైన్ నిర్మించి రెండేళ్లలోపే నీళ్లు ఇస్తామని కొళాయి తిప్పితే నీళ్లు వచ్చేస్తాయన్నారు. నేటికీ పూర్తిస్థాయి పనులు కాలేదు. హడవుడిగా పనులు పూర్తికాకనే మేళాపురం క్రాస్ దగ్గర ఫైలాన్ ప్రారంభించారు. నేటికీ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లతో రూ. 6 నుంచి రూ.10 వరకు ఖర్చుచేసి తాగునీరు కోనుగోలు చేసే పరిస్థితి ఉంది.
పేరుకే ప్రభుత్వాస్పత్రి
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి జిల్లాస్థాయి ఆ స్పత్రిగా అప్‌గ్రేడ్ అయిందేకానీ అక్కడ ఆస్థాయికి అనుగుణంగా వైద్య సదుపాయలు అందటంలేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మాతశిశు కేంద్రానికి వైద్యులు, సిబ్బంది కరవుతో కేరఫ్ రెఫరల్ ఆస్పత్రిగా మారింది. కేవలం ఇద్దరు గైనకాలాజిస్ట్‌లతో వైద్యసేవలు అందించలేక చాలామందిని అనంతపురానికి రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి వైద్యశాఖ మంత్రి శ్రీనివాసరావులు హిందూపురం ఆస్పత్రికి మహర్ధశ అని గొప్పగా చెప్పినా ఇక్కడ సాధారణ సేవలు కూడా కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసంపూర్తిగానే అంబేడ్కర్ భవన్ పనులు
దళితుల విద్య కోసం సుందరంగా అంబేడ్కర్ భవన్ రూ.1.50 కోట్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పి ఏళ్లు పూర్తయినా ఆ పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత ప్రభుత్వ హయంలో కేవలం రూ.50 లక్షలు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయిలో నిర్మాణకావాలంటే ఇంకా రూ.కోటి నిధులు వెచ్చించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో బాలకృష్ణ పూర్తికాని భవనానికి కింద భాగంలో రంగులు కొట్టించి పూర్తయిందని ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకున్నారు.
పీఏల చేతుల్లోనే...
గతంలో తాను గెలిస్తే హిం దూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని చెప్పిన బాలయ్య నియోజకవర్గ పాలన అంతా పీఏలకు అప్పగించి సినిమా షూటింగ్‌లకే పరిమితం అయ్యారు. దీంతో నియోజకవర్గ పెత్తనం ఆయన పీఏల చేతుల్లోకి మారిపోయింది. నియోజకవర్గంలో వరుసగా ఒకటి రెండు మూడు అన్న రీతిలో పీఏలు మారుతూ వారే షాడో ఎమ్మెల్యేలుగా చలమణి అయి అందినకాడికి దండుకున్నారు. ఇలా బాలకృష్ణ పాలనంతా పీఏలతోనే ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పూర్తిగా సినిమా షూటింగ్‌లకే పరిమితం అయ్యారు.
కొనసా... గుతున్న నిర్మాణం
పాత కాయగూరల మార్కెట్‌ను 2016లో అర్ధాంతరంగా కూల్చివేసి ఆ స్థానంలో మల్టీ కాంప్లెక్స్ త్రీఫ్లోర్ భవనాలు నిర్మిస్తామని చివరకు 2017లో రూ.23 కోట్లతో గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా ఈ నిర్మాణ పనులు సాగుతునే ఉన్నాయి. నేటికీ పూర్తికాలేదు.
రోడ్లు వేస్తామని పత్తాలేరు
అసెంబ్లీ ఎన్నికల ముందు హడవుడిగా రోడ్లు వేస్తామని కాలనీలోని వీధి రహదారి అంతా త్రవ్వేసి కంకర వేశారు. తర్వాత రోడ్లు, డ్రైనేజీలు వేయలేదు. ఈ పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రతిరోజూ ఈదారిలోని కంకరపై నడవలేకపోతున్నాం. మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి. స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ లేరు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు లేరు. హిందూపురం ప్రజల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. –నాగరాజు, డీఆర్ కాలనీ, హిందూపురం
నిలిచిపోయి సుందరీకరణ పనులు
సూరప్పకట్ట సుందరీకరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. సూరప్పచెరువును మరో ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ గుప్పించారు. ఎన్నికల ముందు హడావుడిగా చెరువును శుభ్రంచేసి అందులోకి బెవనహళ్లిలోని చెరువునీటిని ఈచెరువులోకి మళ్లింపజేసి హంద్రీనీవా నుంచి నీటిని తెచ్చాశామని కలరింగ్ ఇచ్చారు. నీటికొలను, అందులో బోటింగ్, పార్కులు, సుందీకరణ అని రంగుల సినిమా ట్రైలర్ చూపించారు. ఆ పనులు అక్కడితోనే నిలిచిపోయాయి.
సమస్యలు ఎవరికి చెప్పాలి?
ఎన్నికల సమయంలో చెరువు నుంచి పట్టణంలోని సూరప్పకుంటకు నీళ్లు తీసుకెళ్లడానికి రోడ్డు పక్కన మట్టిని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో రోడ్లు నాశనం అయ్యాయి. రాత్రిపూట భయం భయంగా ఆ రోడ్డుపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నియోజకవర్గంలో లేకపోవడంతో సమస్యలు ఎవరితో చెప్పకోవాలో అర్థం కావడం లేదు. – మల్లేష్, బేవనహళ్లి, హిందూపురం
ఎమ్మెల్యే .. ఎన్నికలప్పుడే వచ్చారు
మా గ్రామంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి ఉంది. ఇక గ్రామంలో రో డ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సయయంలో తప్ప తర్వాత గ్రామాల వైపు వచ్చిందిలేదు. హిందూపురం వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం ఉండదు. – జగన్‌యాదవ్, చిన్నగుడ్డంపల్లి
Comments
Please login to add a commentAdd a comment