Hindupuram MLA Balakrishna
-
బాలయ్యా.. చిత్తశుద్ధి లేని రాజకీయాలేలా?
సాక్షి, శ్రీ సత్యసాయి: ఆయన టాలీవుడ్లో సీనియర్ మోస్ట్ హీరోలలో ఒకరు. వెండితెరపై కనిపిస్తే.. అభిమానులు పూనకాలు వచ్చినట్లు విజిల్స్ వేసి.. నినాదాలు చేస్తారు. పైగా సినిమాల్లో చాలా హుందాగా.. ప్రజల సమస్యలన్నీ చిటికేసినంత ఈజీగా పరిష్కరించేస్తారు. కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఆ జనం వైపే ఎందుకనో చూడరు!. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని పెద్ద తప్పే చేశామంటూ హిందూపురం ప్రజలు చెంపలేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే రెండుసార్లు గెలిపించినా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసింది శూన్యం. సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరోగా దిగజారుతున్న నందమూరి బాలకృష్ణ పొలిటికల్ తీరుపై హిందూపురం ప్రజానాడీ ఆధారంగా.. తండ్రి బాటలో.. అంటూ సినీ నటుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. రాజకీయాల్లోకి వచ్చారు. అందుకేనేమో తండ్రి సెంటిమెంట్‌తో హిందూపురం నుంచే పోటీ చేసి వరుసగా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీ-కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం.. నందమూరి ఫ్యామిలీకి అచ్చొచ్చిన నేల. తెలుగుదేశం పార్టీ పెట్టాక నందమూరి తారకరామారావు వరుసగా మూడుసార్లు(1985 నుంచి ) ఘన విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత.. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో తనయుడు నందమూరి హరికృష్ణ హిందూపురం నుంచి గెలిచారు. ఇప్పుడు రెండుసార్లు బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందారు. అక్కడ ఎన్టీఆర్‌పై ప్రజలకు ఉన్న అభిమానం.. నటసింహకు బాగానే కలిసొచ్చింది. కానీ, బాలయ్య మాత్రం ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి పెట్టడంలేదు. చుట్టంచూపుగా రాకట.. పోకట.. రెండుసార్లు గెలిపించినా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగానే వస్తూ ఉండటం ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తనను ఆదరించిన ప్రజలపై బాలకృష్ణ చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులను హిందూపురంలో ఉంచి పాలించారు బాలకృష్ణ. చంద్రబాబు హయాంలో హిందూపురంపై సర్వాధికారాలు ఆ ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులకు అప్పగించటంతో భారీస్థాయిలో అవినీతి జరిగింది. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేయటమే కాదు.. కాంట్రాక్టర్లతో పాటు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచీ డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో బాలకృష్ణ పీఏలపై వినిపించాయి. 2019 ఎన్నికల్లో గెలిచాక పీఏల వ్యవస్థకు గుడ్ బై చెప్పి.. బాలకృష్ణ పత్తా లేకుండా పోయారు. చుట్టం చూపుగా మాత్రమే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఎప్పుడో ఓసారి పర్యటిస్తున్నారు. బాలయ్యా.. మరి ఆ బాట ఏమైంది? 150 రోజుల కిందట( గత ఏడాది ఆగస్టు 17, 18 తేదీల్లో) తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చివరిసారిగా తన నియోజకవర్గానికి వచ్చారు. సిన్మా షూటింగ్ లో బిజీగా ఉండి.. విదేశాలకు సైతం వెళ్లిన ఆయన.. ఆపై ఆ సినిమా ప్రమోషన్ కోసం తెగ తిరిగారు. ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్తున్నారే గాని ప్రజలతో ఎక్కడా మమేకం కావడంలేదు. వారి సమస్యలను తెలుసుకునేందుకుగానీ, వాటి పరిష్కారం దిశగా ప్రయత్నించటం చేసింది లేదు. దివంతగత ఎన్టీఆర్ గెలిచినా.. అధికారంలో లేకున్నా.. హిందూపురం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారట. మరి ఆయన వారసుడిగా సినిమాల టైంలో ఉపన్యాసాలు దంచే బాలయ్య.. రాజకీయాల్లో మాత్రం ఆయన బాటలో ఎందుకు వెళ్లడం లేదంటూ నిలదీస్తున్నారు అక్కడి ప్రజలు. ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలని... తెలియకపోతే నేర్చుకోవాలని నియోజకవర్గ ప్రజలు, స్థానిక టీడీపీ కార్యకర్తలు భయంభయంగానే ఆఫ్ ది రికార్డులో బాలయ్యకు సూచిస్తున్నారు. నిలదీసినప్పుడు మాత్రమే హిందూపురంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారని, ప్రజాసేవ చేయాలన్న కమిట్ మెంట్ బాలయ్యలో లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ప్రజల కంటే సినిమాలే ముఖ్యమనుకుంటే... రాజకీయాలు వదిలేయవచ్చు కదా అని కొందరు బాలయ్యకి సూచిస్తున్నారు కూడా. ఎన్టీఆర్ మీద అభిమానమే బాలయ్యను గెలిపిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో తగిన రియాక్షన్ బాలయ్యకు తగలవచ్చనే చర్చ జోరుగా నడుస్తోంది అక్కడ. -
ఆయనకి బాబు మాటే బంగారు బాట: మంత్రి కన్నబాబు
-
బాలయ్య కనిపించట్లేదు!
నాటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలకృష్ణ వరకూ నందమూరి వంశాన్ని ఆదరిస్తూనే ఉన్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా బాలయ్యబాబుకు పట్టం కట్టారు. అయితే గత ఐదేళ్లూ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోని బాలయ్య.. ఇప్పుడు కూడా ప్రజల బాగోగులు విస్మరించారు. సినిమా షూటింగ్‌లంటూ ఆయన విదేశాలలో పర్యటిస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక ‘పురం’ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఖరికి ఆయన అసెంబ్లీ సమావేశాలకూ డుమ్మా కొట్టడంతో ‘పురం’ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. – హిందూపురం విజయోత్సవానికే పరిమితం హిందూపురం జిల్లాలోనే రెండో అతిపెద్ద పట్టణం. జిల్లా కేంద్రం అయ్యే అవకాశమున్న ప్రాంతం. కానీ ఇక్కడ సౌకర్యాలు మండలస్థాయికి మించి లేవు. జిల్లా కేంద్రం తర్వాత వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన హిందూపురం నియోజకవర్గంలో జనాభా, ప్రాంతాలు పెరిగాయే తప్ప... ఆ మేరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఐదేళ్లు చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య విజయోత్సవం నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ప్రమాణం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లిన బాలయ్య... కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. బాలకృష్ణ ఇటు ప్రజల్లో లేక ... అటు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో హిందూపురం సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేవారే కరువయ్యారు. ఫలితంగా ఇక్కడి జనం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. భూమి పూజలు, రోడ్‌షోలకే పరిమితం గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం వైపు కన్నెతి చూడటమే మానేశారు. గెలిచిన రెండోరోజు తన తండ్రి వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ , వసుంధర దంపతులు ఒకసారి వచ్చి ఊరేగింపు నిర్వహించి ఆ తర్వాత ఇటువైపునకు రాలేకపోయారు. గతంలో 2014లో గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి 20 సార్లలోపే ఆయన పర్యటించారు. వచ్చినప్పుడల్లా రెండు లేదా మూడు రోజుల రూట్‌మ్యాప్‌తో మూడు మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డు షోలు చేసి చేతులు దులుపుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఓ ఇంటిలో గృహ ప్రవేశం చేసి తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించారు. ఆయన భార్య వసుంధర కూడా గత ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించిన ఆమె తిరిగి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వచ్చారు. తీరని తాగునీటి వ్యథ ! ఎన్నికల కోడ్ కూస్తోందని గొల్లపల్లి తాగునీటి పైప్‌లైన్ పూర్తికాకనే ప్రారంభించారు. గత ఎన్నికల వేళ హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. కేంద్ర నిధులు రూ.194 కోట్లతో తాగునీటి పైప్‌లైన్ నిర్మించి రెండేళ్లలోపే నీళ్లు ఇస్తామని కొళాయి తిప్పితే నీళ్లు వచ్చేస్తాయన్నారు. నేటికీ పూర్తిస్థాయి పనులు కాలేదు. హడవుడిగా పనులు పూర్తికాకనే మేళాపురం క్రాస్ దగ్గర ఫైలాన్ ప్రారంభించారు. నేటికీ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లతో రూ. 6 నుంచి రూ.10 వరకు ఖర్చుచేసి తాగునీరు కోనుగోలు చేసే పరిస్థితి ఉంది. పేరుకే ప్రభుత్వాస్పత్రి హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి జిల్లాస్థాయి ఆ స్పత్రిగా అప్‌గ్రేడ్ అయిందేకానీ అక్కడ ఆస్థాయికి అనుగుణంగా వైద్య సదుపాయలు అందటంలేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మాతశిశు కేంద్రానికి వైద్యులు, సిబ్బంది కరవుతో కేరఫ్ రెఫరల్ ఆస్పత్రిగా మారింది. కేవలం ఇద్దరు గైనకాలాజిస్ట్లతో వైద్యసేవలు అందించలేక చాలామందిని అనంతపురానికి రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి వైద్యశాఖ మంత్రి శ్రీనివాసరావులు హిందూపురం ఆస్పత్రికి మహర్ధశ అని గొప్పగా చెప్పినా ఇక్కడ సాధారణ సేవలు కూడా కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగానే అంబేడ్కర్ భవన్ పనులు దళితుల విద్య కోసం సుందరంగా అంబేడ్కర్ భవన్ రూ.1.50 కోట్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పి ఏళ్లు పూర్తయినా ఆ పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత ప్రభుత్వ హయంలో కేవలం రూ.50 లక్షలు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయిలో నిర్మాణకావాలంటే ఇంకా రూ.కోటి నిధులు వెచ్చించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో బాలకృష్ణ పూర్తికాని భవనానికి కింద భాగంలో రంగులు కొట్టించి పూర్తయిందని ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకున్నారు. పీఏల చేతుల్లోనే... గతంలో తాను గెలిస్తే హిం దూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని చెప్పిన బాలయ్య నియోజకవర్గ పాలన అంతా పీఏలకు అప్పగించి సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారు. దీంతో నియోజకవర్గ పెత్తనం ఆయన పీఏల చేతుల్లోకి మారిపోయింది. నియోజకవర్గంలో వరుసగా ఒకటి రెండు మూడు అన్న రీతిలో పీఏలు మారుతూ వారే షాడో ఎమ్మెల్యేలుగా చలమణి అయి అందినకాడికి దండుకున్నారు. ఇలా బాలకృష్ణ పాలనంతా పీఏలతోనే ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పూర్తిగా సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారు. కొనసా... గుతున్న నిర్మాణం పాత కాయగూరల మార్కెట్‌ను 2016లో అర్ధాంతరంగా కూల్చివేసి ఆ స్థానంలో మల్టీ కాంప్లెక్స్ త్రీఫ్లోర్ భవనాలు నిర్మిస్తామని చివరకు 2017లో రూ.23 కోట్లతో గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా ఈ నిర్మాణ పనులు సాగుతునే ఉన్నాయి. నేటికీ పూర్తికాలేదు. రోడ్లు వేస్తామని పత్తాలేరు అసెంబ్లీ ఎన్నికల ముందు హడవుడిగా రోడ్లు వేస్తామని కాలనీలోని వీధి రహదారి అంతా త్రవ్వేసి కంకర వేశారు. తర్వాత రోడ్లు, డ్రైనేజీలు వేయలేదు. ఈ పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రతిరోజూ ఈదారిలోని కంకరపై నడవలేకపోతున్నాం. మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి. స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ లేరు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు లేరు. హిందూపురం ప్రజల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. –నాగరాజు, డీఆర్ కాలనీ, హిందూపురం నిలిచిపోయి సుందరీకరణ పనులు సూరప్పకట్ట సుందరీకరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. సూరప్పచెరువును మరో ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ గుప్పించారు. ఎన్నికల ముందు హడావుడిగా చెరువును శుభ్రంచేసి అందులోకి బెవనహళ్లిలోని చెరువునీటిని ఈచెరువులోకి మళ్లింపజేసి హంద్రీనీవా నుంచి నీటిని తెచ్చాశామని కలరింగ్ ఇచ్చారు. నీటికొలను, అందులో బోటింగ్, పార్కులు, సుందీకరణ అని రంగుల సినిమా ట్రైలర్ చూపించారు. ఆ పనులు అక్కడితోనే నిలిచిపోయాయి. సమస్యలు ఎవరికి చెప్పాలి? ఎన్నికల సమయంలో చెరువు నుంచి పట్టణంలోని సూరప్పకుంటకు నీళ్లు తీసుకెళ్లడానికి రోడ్డు పక్కన మట్టిని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో రోడ్లు నాశనం అయ్యాయి. రాత్రిపూట భయం భయంగా ఆ రోడ్డుపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నియోజకవర్గంలో లేకపోవడంతో సమస్యలు ఎవరితో చెప్పకోవాలో అర్థం కావడం లేదు. – మల్లేష్, బేవనహళ్లి, హిందూపురం ఎమ్మెల్యే .. ఎన్నికలప్పుడే వచ్చారు మా గ్రామంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి ఉంది. ఇక గ్రామంలో రో డ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సయయంలో తప్ప తర్వాత గ్రామాల వైపు వచ్చిందిలేదు. హిందూపురం వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం ఉండదు. – జగన్యాదవ్, చిన్నగుడ్డంపల్లి -
దగ్గరికెళితే దబిడిదిబిడే
సాక్షి, హిందూపురం: ఆయన సినీహీరో...లెజెండ్...అలా అని అభిమానంతో దగ్గరకువెళ్తే చెంపఛెళ్లుమంటుంది. ఉత్సాహంగా సెల్ఫీకోసం ప్రయత్నిస్తే సెల్‌ఫోన్ పగిలిపోతుంది. ఆయన చేతికి, కాలికి ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ ముద్ర పడుతుంది. ఇక కాస్త దూరంగా ఉంటే వినలేని భాష సినిమా డైలాగుల్లా మార్మోగుతుంది. ఇదీ మన ఎమ్మెల్యే బాలకృష్ణ అలియాస్ బలయ్య వ్యవహార తీరు. అందుకే ఓటు వేసిన పాపానికి హిందూపురం వాసులంతా ఆయన బానిసల్లా బతికేస్తున్నారు. వచ్చినప్పుడల్లా తలో దెబ్బ వేసినా... మా బాబేనంటూ బయట సర్దుకుపోతున్నా...లోలోన తమకిలాంటి శాస్తి జరగాల్సిందేనని తమనుతామే తిట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన తరుణంలో మరెంతమందిపై ఆయన హస్త, పాదముద్రలు పడతాయోనని భయాందోళన చెందుతున్నారు. చివరకు సొంత పార్టీలోని సీనియర్ నేతలైనా బాలయ్య కనిపించగానే కాస్త దూరం జరుగుతున్నారు. బాలకృష్ణ చేసిన సన్మానాల్లో మచ్చునకు కొన్ని ఇలా.. 2014లో హిందూపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగిన బాలకృష్ణ...కారుటాప్‌పై కూర్చుని ప్రచారం చేస్తూ ఓ కార్యకర్తను కాలితో తన్నాడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. 2017 అక్టోబరు 3న హిందూపురంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపాల్టీలోని 20వ వార్డు బోయపేటలో వెళ్తున్న సమయంలో మారుతి అనే అభిమాని ఎమ్మెల్యే బాలకృష్ణ పక్క నుంచి అతృతగా ముందువెళ్ల బోయాడు..అంతే బాలకృష్ణ టెంపర్ లేచింది. మారుతి చెంప చెళ్లుమనిపించేశాడు. ఈ సంఘటనలో అక్కడివారంతా విస్తుపోయారు. ఆ కార్యకర్తల కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత బాలకృష్ణ పక్కన నడిచేందుకు కూడా నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు. 2017 ఆగస్టులో నిర్వహించిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓహోటల్ వద్దకు వచ్చిన అభిమానులు బాలకృష్ణను గజమాలతో సన్మానించడానికి ప్రయత్నించారు. అభిమానులమధ్య తోపులాట జరిగింది. అంతే బాలకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానులను దుషిస్తూ ఒకరిపై చేయికూడా చేసుకున్నాడు. అభిమానంతో దండవేస్తామని వస్తే కొడతారేంటి అని అభిమానులే విమర్శలు గుప్పించారు. 2017 సెప్టెంబరు 30న విజయవాడలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలోనూ వాయిస్ ఇవ్వాలని కోరిన మీడియాను బయటకు పోండి అంటూ చిర్రుబుర్రులాడారు. అలాగే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా మీరు మారరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 మార్చి 3న ఖమ్మం జిల్లాలో విసృత్తంగా ప్రచారంలో భాగంగా మిట్టపల్లి గ్రామానికి వెళ్లిన బాలకృష్ణ కాన్వాయ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. దీంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోతూ వాహనం నుంచి కింది దిగి అక్కడున్న వారిపై చేయి కూడా చూసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేని అభిమానులు టీడీపీ ఫ్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే బాలయ్య బాధితులు ఎందరో ఉన్నారు. అయినా ఆయన పద్ధతి మారదు..అహం తొలగదు. అన్నట్లు మళ్లీ ఇపుడు ఎన్నికల ప్రచారం కోసం బాలయ్య హిందూపురం వస్తున్నారు. ఇప్పుడెంత మందిని కొడతాడో...మరెంతమదిని తిట్టిపోస్తాడోనన్న భయం ఆపార్టీ కార్యకర్తల్లో నెలకొంది. -
పార్టీ మారినవారు రాజీనామా చేస్తారు
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రెండురకాలుగా స్పందించారు. వారు రాజీనామా చేస్తారని తొలుత పేర్కొన్న ఆయన ఆ తర్వాత మాటమార్చుతూ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసమే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ మారిన వారిని రాజీనామా చేసి తిరిగి గెలవాలన్న విపక్షం డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ.. వారు రాజీ నామా చేస్తారని చెప్పారు. అయితే పక్కనున్న నేతలు చెవిలో గుసగుసలాడడం తో బాలకృష్ణ సర్దుకుని ఎందుకు రాజీనామా చేయాలని విలేకరుల్ని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదని చెప్పిన ఆయన అలాంటి వారిని నెత్తినెక్కించుకోనని పరోక్షంగా చెప్పారు. సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో వారినే పిలిచానని, ఎవరిని పిలవాలో తనకు తెలుసన్నారు. తన పక్కన గ్లామర్ ఉన్నవాళ్లు ఉన్నారని, వారి తోనే ప్రయాణిస్తానన్నారు. ఎవరినీ నెత్తినెక్కిం చుకోనని, అలాంటి వాళ్లను పిలవనని చిరంజీవి గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానన్నారు. కాగా, లేపాక్షి నంది ఉత్సవాలను యునెస్కో సంస్థ పరిధిలోకి చేర్చడానికి కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపినట్టు బాలకృష్ణ తెలిపారు. -
బాలయ్యను నిలదీసిన మహిళలు
హిందూపురం: ఉపాధి పనులు లేక పిల్లలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నామని తమకు ఉపాధి చూపించాలని అనంతపురం మహిళలు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టను నిలదీశారు. శుక్రవారం పట్టణంలో రహదారి నిర్మాణ భూమిపూజలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మహిళలు తాము కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ఉపాధి పనులు కల్పించాలని చుట్టుముట్టారు. ఒక్కసారిగా మహిళలందరూ చుట్టుముట్టడంతో ఏమి చెప్పాలో కాసేపు ఆయనకు అర్థం కాలేదు. తేరుకున్న అనంతరం తనదైన శైలిలో రెండు నెలల తర్వాత మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. రెండు నెలల తర్వాత అంటే అప్పటికి ఉపాధి పనులు ఆగిపోతాయి కదా మరి ఉపాధి ఎలా కల్పిస్తారని మహిళలు వాపోయారు. -
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ
* లొకేషన్ మార్చి అరకులోయలో షూటింగ్ చేస్తున్నా * సినీనటుడు బాలకృష్ణ అరకులోయ : హూదూద్ తుఫాన్ ప్రభావంతో ధ్వంసమైన ఆంధ్ర ఊటి అరకులోయలోని అభిమానులను కలవాలనే ఎస్ఎల్వి బ్యానర్‌పై తాను హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ లొకేషన్ మార్పు చేసి అరకులోయలోయకు వచ్చినట్టు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృ ష్ణ అన్నారు. మండలంలో కొండచరియలు విరిగిపడి తల్లిదుండ్రులు, పిల్లలను పోగొట్టుకొని నందివలస పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం సేవలపై ఆరాతీశారు. ఉచితంగా ఇస్తున్న నిత్యావసర వస్తువులు అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌తో జీవనోపాధి కోల్పొయిన వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఏజెన్సీలో పోడుసాగుతో పాటు కాఫీ, మిరియాలు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు నేలమట్టమయ్యాయన్నారు. నందివలస పాఠశాలలో పిల్లలతో ముచ్చటించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన కాఫీ తోటలు పరిశీలించారు. బాలకృ ష్ణతో ఫొటోలు తీయించుకునేందుకు గిరిజన మహిళలు ఆసక్తి చూపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, వైస్‌ఎంపీపీ పొద్దు అమ్మన్న, సర్పంచ్ కొర్రా సన్యాసి, ఎంపీటీసీ అభిమాన్ పాల్గొన్నారు. యండపల్లివలసలో స్వచ్ఛభారత్ తెలుగుదేశం హయాంలో జన్మభూమి, క్లీన్,గ్రీన్ వంటి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ యండపల్లివలసలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అక్కడే పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రేస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారన్నారు. పద్మాపురం పంచాయతీ పరిధిలోని వృద్ధులకు పింఛన్లు పంపీణి చేశారు. బాలకృష్ణకు మహిళలు హారతిచ్చి ఘనస్వాగతం పలికారు. సర్పంచ్, ఉపసర్పంచ్లు గజమాలతో ఆయనను సన్మానించారు.