బాలయ్యా.. చిత్తశుద్ధి లేని రాజకీయాలేలా? | Actor Nandamuri Balakrishna Forget Hindupur MLA Position | Sakshi
Sakshi News home page

హిందూపురం: బాలయ్యా.. చిత్తశుద్ధి లేని రాజకీయాలేలా?

Published Sun, Jan 22 2023 5:16 PM | Last Updated on Sun, Jan 22 2023 6:13 PM

Actor Nandamuri Balakrishna Forget Hindupur MLA Position - Sakshi

సాక్షి, శ్రీ సత్యసాయి: ఆయన టాలీవుడ్‌లో సీనియర్‌ మోస్ట్‌ హీరోలలో ఒకరు. వెండితెరపై కనిపిస్తే.. అభిమానులు పూనకాలు వచ్చినట్లు విజిల్స్‌ వేసి.. నినాదాలు చేస్తారు. పైగా సినిమాల్లో చాలా హుందాగా.. ప్రజల సమస్యలన్నీ చిటికేసినంత ఈజీగా పరిష్కరించేస్తారు. కానీ, రియల్‌ లైఫ్‌లో మాత్రం ఆ జనం వైపే ఎందుకనో చూడరు!.  ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని పెద్ద తప్పే చేశామంటూ హిందూపురం ప్రజలు చెంపలేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే రెండుసార్లు గెలిపించినా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసింది శూన్యం. సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరోగా దిగజారుతున్న నందమూరి బాలకృష్ణ పొలిటికల్‌ తీరుపై హిందూపురం ప్రజానాడీ ఆధారంగా..

తండ్రి బాటలో.. అంటూ సినీ నటుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. రాజకీయాల్లోకి వచ్చారు. అందుకేనేమో తండ్రి సెంటిమెంట్‌తో హిందూపురం నుంచే పోటీ చేసి వరుసగా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీ-కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం.. నందమూరి ఫ్యామిలీకి అచ్చొచ్చిన నేల. తెలుగుదేశం పార్టీ పెట్టాక నందమూరి తారకరామారావు వరుసగా మూడుసార్లు(1985 నుంచి ) ఘన విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత.. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో తనయుడు నందమూరి హరికృష్ణ హిందూపురం నుంచి గెలిచారు. ఇప్పుడు రెండుసార్లు బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందారు. అక్కడ ఎన్టీఆర్‌పై ప్రజలకు ఉన్న అభిమానం.. నటసింహకు బాగానే కలిసొచ్చింది. కానీ, బాలయ్య మాత్రం ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి పెట్టడంలేదు. 

చుట్టంచూపుగా రాకట.. పోకట..
రెండుసార్లు గెలిపించినా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగానే వస్తూ ఉండటం ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తనను ఆదరించిన ప్రజలపై బాలకృష్ణ చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులను హిందూపురంలో ఉంచి పాలించారు బాలకృష్ణ. చంద్రబాబు హయాంలో హిందూపురంపై  సర్వాధికారాలు ఆ ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులకు అప్పగించటంతో భారీస్థాయిలో అవినీతి జరిగింది. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేయటమే కాదు.. కాంట్రాక్టర్లతో పాటు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచీ డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో బాలకృష్ణ పీఏలపై వినిపించాయి. 2019 ఎన్నికల్లో గెలిచాక పీఏల వ్యవస్థకు గుడ్ బై చెప్పి..  బాలకృష్ణ పత్తా లేకుండా పోయారు. చుట్టం చూపుగా మాత్రమే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఎప్పుడో ఓసారి పర్యటిస్తున్నారు. 

బాలయ్యా.. మరి ఆ బాట ఏమైంది?
150 రోజుల కిందట( గత ఏడాది ఆగస్టు 17, 18 తేదీల్లో) తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చివరిసారిగా తన నియోజకవర్గానికి వచ్చారు. సిన్మా షూటింగ్ లో బిజీగా ఉండి.. విదేశాలకు సైతం వెళ్లిన ఆయన.. ఆపై ఆ సినిమా ప్రమోషన్ కోసం తెగ తిరిగారు. ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్తున్నారే గాని ప్రజలతో ఎక్కడా మమేకం కావడంలేదు. వారి సమస్యలను తెలుసుకునేందుకుగానీ, వాటి పరిష్కారం దిశగా ప్రయత్నించటం చేసింది లేదు. దివంతగత ఎన్టీఆర్ గెలిచినా.. అధికారంలో లేకున్నా.. హిందూపురం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారట. మరి ఆయన వారసుడిగా సినిమాల టైంలో ఉపన్యాసాలు దంచే బాలయ్య.. రాజకీయాల్లో మాత్రం ఆయన బాటలో ఎందుకు వెళ్లడం లేదంటూ నిలదీస్తున్నారు అక్కడి ప్రజలు. 

ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలని... తెలియకపోతే నేర్చుకోవాలని నియోజకవర్గ ప్రజలు, స్థానిక టీడీపీ కార్యకర్తలు భయంభయంగానే ఆఫ్‌ ది రికార్డులో బాలయ్యకు సూచిస్తున్నారు. నిలదీసినప్పుడు మాత్రమే హిందూపురంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారని, ప్రజాసేవ చేయాలన్న కమిట్ మెంట్ బాలయ్యలో లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ప్రజల కంటే సినిమాలే ముఖ్యమనుకుంటే... రాజకీయాలు వదిలేయవచ్చు కదా అని కొందరు బాలయ్యకి సూచిస్తున్నారు కూడా.  ఎన్టీఆర్‌ మీద అభిమానమే బాలయ్యను గెలిపిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో తగిన రియాక్షన్‌ బాలయ్యకు తగలవచ్చనే చర్చ జోరుగా నడుస్తోంది అక్కడ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement