developement
-
ఆర్టీసీపై ఆంధ్రజ్యోతి చిల్లర రాతలు
-
ఏపీ ప్రభుత్వ కృషికి అవార్డుతో జాతీయ స్థాయిలో గుర్తింపు
-
సికింద్రాబాద్, నాంపల్లి: మాకొద్దీ స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి అంశం మరోసారి వెనక్కి వెళ్లింది. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు సరికదా కనీసం ఆసక్తి కూడా చూపకపోవడం గమనార్హం. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను విమానాశ్రయం తరహాలో పునరభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా నానుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్ఎస్డీసీ) రెండుసార్లు, గతంలో దక్షిణమధ్య రైల్వే రెండుసార్లు ఇన్వెస్టర్లను ఆహ్వానించాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. మొదట్లో కొన్ని కన్సార్టియంలు ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ బిడ్డింగ్ దశలో వెనుకంజ వేశాయి. ఇటీవల ఐఆర్ఎస్డీసీ మరోసారి బిడ్డింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఇన్వెస్టర్లు, కన్సార్టీయంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు రైల్వేస్టేషన్ల పునరభివృద్ధిలో కూడా ఇలాంటి అనాసక్తి వ్యక్తం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను పెండింగ్ జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు. ఎందుకీ అనాసక్తి. ►రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్ల రీడెవలప్మెంట్ ముందుకు వచి్చంది. ఐఆర్ఎస్డీసీ సైతం అదే లక్ష్యంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లను ‘డిజైనింగ్, బిల్డింగ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్’ అనే పద్ధతిలో ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ►దక్షిణమధ్య రైల్వేలో మొదటి దశలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్ల రీ డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడి సంస్థలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం లభిస్తుంది. పైగా రైల్వే సొంతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదు. ►కింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను 45 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత నిర్మాణాలతో సహా స్టేషన్లను రైల్వేకు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఈ లీజు కాలపరిమితికి బడా కన్సార్టియంలు విముఖతను వ్యక్తం చేశాయి. లీజు గడువును పెంచాలని కోరాయి. కానీ రైల్వేశాఖ అంగీకరించకపోవడంతో రీ డెవలప్మెంట్ వాయిదా పడింది. ఇప్పుడు కోవిడ్... ►మొదట్లో లీజు గడువు తక్కువగా ఉందనే కారణంతో ఇన్వెస్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంచుమించు గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. ►ఒక్క ఢిల్లీ రైల్వేస్టేషన్ల రీడెవలప్మెంట్ మాత్ర మే పట్టాలెక్కింది. మిగతా చోట్ల అటకెక్కింది. ►సాధారణంగా 7 నుంచి 12 మంది ఇన్వెస్టర్లు లేదా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తే అనూహ్యమైన స్పందన ఉన్నట్లుగా భావిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు 2 నుంచి 3 సంస్థల కంటే ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. మూడంచెల్లో నిర్మాణం... ఐఆర్ఎస్డీసీ ప్రతిపాదించినట్లుగా స్టేషన్లను పునరభివృద్ధి చేస్తే ఇప్పుడు ఉన్న స్టేషన్‌కు ఏ మాత్రం విఘాతం కలగకుండా కింద మూడు వరుసల్లో పార్కింగ్, పైన మూడు వరుసల్లో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన డోమ్ ఆకారంలో పై కప్పు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది పూర్తిగా ఎయిర్‌పోర్టు తరహాలో కనిపిస్తుంది. -
కరీంనగర్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : గంగుల
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా బుధవారం తెలంగాణచౌక్, ఐబీచౌరస్తా, నాఖా చౌరస్తాల జంక్షన్ సుందరీకరణ పనులకు గీతాభవన్ చౌరస్తా వద్ద మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి భూమిపూజ చేశారు. కమలాకర్ మాట్లాడుతూ.. మూడు జంక్షన్ల అభివృద్ధికి రూ.50లక్షలు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను కూడ అభివృద్ధి చేస్తున్నామని, ప్రధాన రహదారుల్లో డివైడర్లు నిర్మించి లైటింగ్ సిస్టమ్ అమర్చి, మధ్యలో మొక్కలు పెంచి అందంగా తయారు చేశామని తెలిపారు. ఇప్పటికే కమాన్, కోర్టు, మంచిర్యాలచౌరస్తా జంక్షన్లను సుందరీకరణ చేశామని తెలిపారు. మిగిలిన తెలంగాణ తల్లి జంక్షన్‌ను త్వరలో సుందరీకరిస్తామని చేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, కార్పొరేటర్ వాల రమణరావు, తదితరులు ఉన్నారు. పనులు వేగంగా పూర్తిచేయాలి కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్మార్ట్‌సిటీ పనులు, పట్టణ ప్రగతి, హరితహారంపై కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి, సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. స్మార్ట్‌సిటీ 1,2,3 ప్యాకేజీల్లో రూ.290 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాజా టాకీస్ నుంచి బొమ్మ వెంకన్న ఇంటి వరకు చేపట్టిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ చౌక్ నుంచి గాంధీ రోడ్డు వరకు రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు. స్లాటర్ హౌస్ వేరే చోటికి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెలిపారు. పార్కుల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయని, వేగం చేయాలని కోరారు. హరితహారంలో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల రోడ్ల మధ్య డివైడర్లలో కోనకార్పస్ మొక్కలు నాటాలని సూచించారు. పుట్‌పాత్ ఆక్రమణపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. డిప్యూటీమేయర్ స్వరూపారాణి, ఎస్ఈ కృష్ణరావు, ఈఈ రామన్, డీసీపీ సుభాశ్, ఏసీపీ శ్రీనివాస్, స్మార్ట్‌సిటీ టీం లీడర్ జగదీశ్, తదితరులు ఉన్నారు. చదవండి: నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి -
యాదాద్రిలో వేసవిలోనూ హరితమయ శోభ..
సాక్షి, యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధితో పాటు కొండకు దిగువన ఉన్న ప్రాంతాలు హరితమయంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని మొక్కలతో యాదాద్రి కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఆ పచ్చదనంతో శోభను చూసి ఆనందపడుతున్నారు. వేసవిలోనూ.. రంగురంగుల పూల మొక్కలు.. ఆకర్షించే గ్రీనరీ.. పది అడుగుల మొక్కలు క్షేత్రానికి వచ్చే భక్తులను ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదంలోకి తీసుకెళ్తున్నాయి. మండుతున్న ఎండలకు భక్తులు, స్థానికులు ఈ పచ్చని అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. ఈ మొక్కల సంరక్షణకు నిత్యం కూలీలు శ్రమిస్తున్నారు. -
బాలయ్య కనిపించట్లేదు!
నాటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలకృష్ణ వరకూ నందమూరి వంశాన్ని ఆదరిస్తూనే ఉన్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా బాలయ్యబాబుకు పట్టం కట్టారు. అయితే గత ఐదేళ్లూ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోని బాలయ్య.. ఇప్పుడు కూడా ప్రజల బాగోగులు విస్మరించారు. సినిమా షూటింగ్‌లంటూ ఆయన విదేశాలలో పర్యటిస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక ‘పురం’ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఖరికి ఆయన అసెంబ్లీ సమావేశాలకూ డుమ్మా కొట్టడంతో ‘పురం’ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. – హిందూపురం విజయోత్సవానికే పరిమితం హిందూపురం జిల్లాలోనే రెండో అతిపెద్ద పట్టణం. జిల్లా కేంద్రం అయ్యే అవకాశమున్న ప్రాంతం. కానీ ఇక్కడ సౌకర్యాలు మండలస్థాయికి మించి లేవు. జిల్లా కేంద్రం తర్వాత వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన హిందూపురం నియోజకవర్గంలో జనాభా, ప్రాంతాలు పెరిగాయే తప్ప... ఆ మేరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఐదేళ్లు చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య విజయోత్సవం నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ప్రమాణం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లిన బాలయ్య... కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. బాలకృష్ణ ఇటు ప్రజల్లో లేక ... అటు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో హిందూపురం సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేవారే కరువయ్యారు. ఫలితంగా ఇక్కడి జనం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. భూమి పూజలు, రోడ్‌షోలకే పరిమితం గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం వైపు కన్నెతి చూడటమే మానేశారు. గెలిచిన రెండోరోజు తన తండ్రి వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ , వసుంధర దంపతులు ఒకసారి వచ్చి ఊరేగింపు నిర్వహించి ఆ తర్వాత ఇటువైపునకు రాలేకపోయారు. గతంలో 2014లో గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి 20 సార్లలోపే ఆయన పర్యటించారు. వచ్చినప్పుడల్లా రెండు లేదా మూడు రోజుల రూట్‌మ్యాప్‌తో మూడు మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డు షోలు చేసి చేతులు దులుపుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఓ ఇంటిలో గృహ ప్రవేశం చేసి తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించారు. ఆయన భార్య వసుంధర కూడా గత ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించిన ఆమె తిరిగి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వచ్చారు. తీరని తాగునీటి వ్యథ ! ఎన్నికల కోడ్ కూస్తోందని గొల్లపల్లి తాగునీటి పైప్‌లైన్ పూర్తికాకనే ప్రారంభించారు. గత ఎన్నికల వేళ హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. కేంద్ర నిధులు రూ.194 కోట్లతో తాగునీటి పైప్‌లైన్ నిర్మించి రెండేళ్లలోపే నీళ్లు ఇస్తామని కొళాయి తిప్పితే నీళ్లు వచ్చేస్తాయన్నారు. నేటికీ పూర్తిస్థాయి పనులు కాలేదు. హడవుడిగా పనులు పూర్తికాకనే మేళాపురం క్రాస్ దగ్గర ఫైలాన్ ప్రారంభించారు. నేటికీ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లతో రూ. 6 నుంచి రూ.10 వరకు ఖర్చుచేసి తాగునీరు కోనుగోలు చేసే పరిస్థితి ఉంది. పేరుకే ప్రభుత్వాస్పత్రి హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి జిల్లాస్థాయి ఆ స్పత్రిగా అప్‌గ్రేడ్ అయిందేకానీ అక్కడ ఆస్థాయికి అనుగుణంగా వైద్య సదుపాయలు అందటంలేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మాతశిశు కేంద్రానికి వైద్యులు, సిబ్బంది కరవుతో కేరఫ్ రెఫరల్ ఆస్పత్రిగా మారింది. కేవలం ఇద్దరు గైనకాలాజిస్ట్లతో వైద్యసేవలు అందించలేక చాలామందిని అనంతపురానికి రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి వైద్యశాఖ మంత్రి శ్రీనివాసరావులు హిందూపురం ఆస్పత్రికి మహర్ధశ అని గొప్పగా చెప్పినా ఇక్కడ సాధారణ సేవలు కూడా కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగానే అంబేడ్కర్ భవన్ పనులు దళితుల విద్య కోసం సుందరంగా అంబేడ్కర్ భవన్ రూ.1.50 కోట్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పి ఏళ్లు పూర్తయినా ఆ పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత ప్రభుత్వ హయంలో కేవలం రూ.50 లక్షలు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయిలో నిర్మాణకావాలంటే ఇంకా రూ.కోటి నిధులు వెచ్చించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో బాలకృష్ణ పూర్తికాని భవనానికి కింద భాగంలో రంగులు కొట్టించి పూర్తయిందని ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకున్నారు. పీఏల చేతుల్లోనే... గతంలో తాను గెలిస్తే హిం దూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని చెప్పిన బాలయ్య నియోజకవర్గ పాలన అంతా పీఏలకు అప్పగించి సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారు. దీంతో నియోజకవర్గ పెత్తనం ఆయన పీఏల చేతుల్లోకి మారిపోయింది. నియోజకవర్గంలో వరుసగా ఒకటి రెండు మూడు అన్న రీతిలో పీఏలు మారుతూ వారే షాడో ఎమ్మెల్యేలుగా చలమణి అయి అందినకాడికి దండుకున్నారు. ఇలా బాలకృష్ణ పాలనంతా పీఏలతోనే ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పూర్తిగా సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారు. కొనసా... గుతున్న నిర్మాణం పాత కాయగూరల మార్కెట్‌ను 2016లో అర్ధాంతరంగా కూల్చివేసి ఆ స్థానంలో మల్టీ కాంప్లెక్స్ త్రీఫ్లోర్ భవనాలు నిర్మిస్తామని చివరకు 2017లో రూ.23 కోట్లతో గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా ఈ నిర్మాణ పనులు సాగుతునే ఉన్నాయి. నేటికీ పూర్తికాలేదు. రోడ్లు వేస్తామని పత్తాలేరు అసెంబ్లీ ఎన్నికల ముందు హడవుడిగా రోడ్లు వేస్తామని కాలనీలోని వీధి రహదారి అంతా త్రవ్వేసి కంకర వేశారు. తర్వాత రోడ్లు, డ్రైనేజీలు వేయలేదు. ఈ పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రతిరోజూ ఈదారిలోని కంకరపై నడవలేకపోతున్నాం. మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి. స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ లేరు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు లేరు. హిందూపురం ప్రజల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. –నాగరాజు, డీఆర్ కాలనీ, హిందూపురం నిలిచిపోయి సుందరీకరణ పనులు సూరప్పకట్ట సుందరీకరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. సూరప్పచెరువును మరో ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ గుప్పించారు. ఎన్నికల ముందు హడావుడిగా చెరువును శుభ్రంచేసి అందులోకి బెవనహళ్లిలోని చెరువునీటిని ఈచెరువులోకి మళ్లింపజేసి హంద్రీనీవా నుంచి నీటిని తెచ్చాశామని కలరింగ్ ఇచ్చారు. నీటికొలను, అందులో బోటింగ్, పార్కులు, సుందీకరణ అని రంగుల సినిమా ట్రైలర్ చూపించారు. ఆ పనులు అక్కడితోనే నిలిచిపోయాయి. సమస్యలు ఎవరికి చెప్పాలి? ఎన్నికల సమయంలో చెరువు నుంచి పట్టణంలోని సూరప్పకుంటకు నీళ్లు తీసుకెళ్లడానికి రోడ్డు పక్కన మట్టిని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో రోడ్లు నాశనం అయ్యాయి. రాత్రిపూట భయం భయంగా ఆ రోడ్డుపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నియోజకవర్గంలో లేకపోవడంతో సమస్యలు ఎవరితో చెప్పకోవాలో అర్థం కావడం లేదు. – మల్లేష్, బేవనహళ్లి, హిందూపురం ఎమ్మెల్యే .. ఎన్నికలప్పుడే వచ్చారు మా గ్రామంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి ఉంది. ఇక గ్రామంలో రో డ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సయయంలో తప్ప తర్వాత గ్రామాల వైపు వచ్చిందిలేదు. హిందూపురం వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం ఉండదు. – జగన్యాదవ్, చిన్నగుడ్డంపల్లి -
ఆదిలాబాద్‌లో ప్రగతి బాట ఏది.?
సాక్షి, ఆదిలాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవ డం.. ఆదివాసీల కోసం ఇది చేస్తాం.. అది చేస్తామని హామీలివ్వడం ప్రజాప్రతినిధులకు, అధికారులకు పరిపాటే.. చివరికొచ్చి ప్రగతి బాటకు ఎదురుచూపే మిగులు తోంది. చేతికొచ్చిన వాటిని అమలుపర్చిన ఆదివాసీలకు మేలు జరుగుతుంది. ఉన్నవాటిని ఉంచిన వారికి లాభం చేకూరుతుం ది. ఆదివాసీలు అందరిని అక్కున చేర్చుకుం టారని, అమాయక జనాలను వల్లే వేసే అధి కార యంత్రాంగం జిల్లాలో వారి సంక్షేమాని కి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రధానాస్పత్రి ఏదీ.? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2008 కంటే ముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏపీవీవీపీ ఆధీనంలో పనిచేసింది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆదిలాబాద్‌లో రిమ్స్ వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి రిమ్స్‌గా మారిపోయి సుమారు 11 ఏళ్లు అవుతుంది. అప్పట్లోనే జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, లేని పక్షంలో ఉట్నూర్ తరలిస్తామని చెప్పారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. మంచిర్యాల కొత్త జిల్లా కావడంతో ఇక అక్కడి ఏరియా ఆస్పత్రే జిల్లా ప్రధాన ఆస్పత్రిగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా నానుతూనే ఉంది. ఉట్నూర్ ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచి జిల్లా ప్రధాన ఆస్పత్రిగా దానిని రూపాంతరం చేసిన పక్షంలో ఆదివాసీలకు సమీపంలోనే మెరుగైన వైద్యం లభించే పరిస్థితి ఉంటుంది. వైద్య పోస్టులు, ఏఎన్ఎంల పోస్టులు అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ రిమ్స్‌లో గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన ఆర్వి కర్ణన్ ఐటీడీఏ వార్డును ఏర్పాటు చేశారు. ప్రధానంగా రిమ్స్‌లో వైద్యసేవల కోసం గిరిజనులు అధికంగా రావడం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రత్యేక వార్డులను అప్పట్లో దూరదృష్టితో ఆలోచించి అప్పటి ఐటీడీఏ పీఓ ఏర్పాటు చేశారు. ఆ వార్డులో ఆదివాసీల కోసం అన్ని ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు ఆ వార్డునే తొలగించారు. ఆ వార్డును ఎందుకు తొలగించారనేది కూడా ఆస్పత్రిలో చెప్పేవారే లేరు. ఈ పరిస్థితుల్లో వారికి సరైన వైద్య చికిత్స ఎలా అందుతుందనేదే ప్రశ్న. మరోపక్క రక్తహీనతతో సతమతమయ్యే ఆదివాసీలకు ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో బ్లడ్ బ్యాంకుల్లో సత్వరం రక్తం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. సీజనల్ వ్యాధుల సమయంలో సరైన వైద్య చికిత్స లభిస్తే వారికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు. విద్యపరంగా ప్రతిపాదనలు... గిరిజనులకు విద్య అవకాశాల పరంగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేసినప్పటికి మోక్షం రూపం దాల్చడం లేదు. ప్రాథమిక పాఠశాలలను దిశా మోడల్ స్కూల్ పథకంలో భాగంగా ఇంగ్లిష్ మీడియంగా ఆ స్కూళ్లను మార్చాలనే ప్రతిపాదన పూర్తిస్థాయిలో మోక్షం లభించడంలేదు. టీటీసీ, ఏఎన్ఎం శిక్షణ కేంద్రాలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను పరిచయం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివే గిరిజనుల కోసం సరైన కోచింగ్ సెంటర్లు జిల్లాలో అందుబాటులో లేవు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కార్పొరేట్ కళాశాలల్లో చదువుకొనే పరిస్థితులు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వారికి చదువుల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే దూరదృష్టిలో వ్యవహరించాల్సిన పరిస్థితి. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు మంజూరైన గిరిజన యూనివర్సిటీని ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు తన్నుకపోయారు. అధ్వానంగా రోడ్లు... ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దురావస్థతే. ఒకవైపు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో గిరిజనుల అభివృద్ధికి సరైన ప్రణాళికలు లేవు. ఒకవేళ నిధులు మంజూరు జరిగినా అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడంలేదు. 2017–18లో రూ.97 కోట్లతో ఏజెన్సీ మండలాల్లో పలుచోట్ల 57 రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అవి ఇప్పటికీ టెండర్ దశలోనే ఉండడం గమనార్హం. ఒకవైపు సరైన రోడ్డు మార్గాలు లేక భారీ వర్షాల కారణంగా ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరోపక్క రూ.25 కోట్లతో ఐటీడీఏ పరిధిలోని ఆరు మండలాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఈ నిధులు గిరిజనసంక్షేమ శాఖ నుంచి మంజూరయ్యాయి. -
గిరిజన చరిత్ర డిజిటలీకరణ
సాక్షి, ఆసిఫాబాద్: కేంద్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే మిగిలింది. దేశ వ్యాప్తంగా వెనకబడిన కుమురంభీం జిల్లా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అస్ప్రిరేషనల్ జిల్లాలో కుమురం భీం జిల్లా ఒకటిగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన సాంస్కృతిని డిజిటలీకరణ చేస్తామని పేర్కొనడం జిల్లాలో గిరిజనుల కొంత ఊరట కలిగే అంశం. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ 2019–20 దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల పరంగా తెలంగాణకు పెద్దగా నిధుల కేటాయింపులేవు. అందులోనూ జిల్లాలకు ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఈ వా ర్షిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు పథకాల్లో జిల్లా ప్రజలకు అనాది నుంచి ఆదివాసీ, గిరిజనులు ఎంతో చరిత్ర కలిగినప్పటికీ వారిపై పరిశోధన, చరిత్ర అందరికీ అందుబాటులో లేదు. అయితే ఈ బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సంస్కృతి, నృత్యం, ఆచారాలు, చరిత్రను డిజటలీకరణ చేయనున్నారు. చరిత్రను పుస్తకాల్లో కాక ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి భద్ర పర్చనున్నారు. దీంతో జిల్లాలో పోరాట యోధుడు కుమురం భీం చరిత్ర, జంగుబాయి, గిరిజన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు, గుస్సాడీ నృత్యాలు, తుడం వాయిద్యాలు, ఇతర సంప్రదాయాలకు సంబందించిన నృత్యాలతో పాటు హైమన్ డార్ఫ్ పరిశోధనలు, జోడే ఘాట్ లాంటి ప్రదేశాలు జిల్లాలో గిరిజన చరిత్ర డిజిటలీకరణ లో చోటు దక్కే అవకాశం ఉంది. రైతులకు మరింత భారం ఇక పెట్రోల్ డిజీల్ ధరలు పెరగడంతో రైతులకు, వాహనదారులకు మరింత భారం కానుంది. లీటరు పెట్రోల్, డిజిల్ కు రూ.1 చొప్పున సెస్ విధిస్తుండడంతో వ్యవసాయంలో ట్రాక్టర్లు, జనరేటర్లు, ఇతర సాగు చేసే యంత్రాల వినియోగంలో ఆర్థిక భారం పడనుంది. అయితే రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు కొంత లబ్ధితో పాటు చిరు దాన్యాల సాగు కోసం పప్పు దాన్యాల విప్లవం కోసం ప్రోత్సాహాకాలు అందిస్తే స్థానిక రైతులు పత్తి నుంచి పప్పుదాన్యాల పంటల వైపు మళ్లే అవకాశం ఉంది. గ్యాస్ సడ్సిడీతో మహిళలకు ఊరట పేదింటి మహిళకు కట్టెల పొయ్యి వాడే వారికి కొంత ఊరట కలగనుంది. దేశ వ్యాప్తంగా అందరికీ గ్యాస్ పొయ్యిలను సబ్సిడీ పై ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. ఇప్పటికే జిల్లాలో ఆరు గ్యాస్ ఎజెన్సీల పరిధిలో లక్ష వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 10వేల మంది వరకు గ్యాస్ క¯ð క్షన్లు వరకు పొందాల్సి ఉంది. గిరిజన గూడెల్లో ఉండే మహిళలు ఇంకా కట్టెల పొయ్యిల మీదనే వంట చేస్తున్నారు. వీరికి లబ్ధి చేకూరనుంది. మహిళ సంఘాలకు ‘ముద్ర’ ఇప్పటి వరకు వివిధ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఇచ్చే ముద్ర రుణాలను ఇక నుంచి మహిళా సంఘాల సభ్యలకు ఇవ్వనున్నారు. ఒక మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల వరకు ముద్ర రుణాలను ఇవ్వనున్నారు. జిల్లాలో 7425 మహిళా సంఘాలు ఉండగా ఇందులో 80వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. అలాగే జన్‌ధన్ బ్యాంకు ఖాతా ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్ డ్రాప్ట్ నగదు తీసుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా మహిళా సమ్మిళిత శిశు అభివృద్ధి పథకం కోసం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.27వేల కోట్లు కేటాయించారు. అంతేకాక మహిళా సంక్షేమం అమలు చేసేందుకు ‘నారి తూ నారాయణీ’ అనే కమిటీ ఏర్పాటు కూడా చేయననున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి దేశ వ్యాప్తంగా కోటి మంది యువతకు వృత్తిలో నైపుణ్యతను సాధించేందుకు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజనతో నైపుణ్యం కలిగించనున్నారు. జిల్లాలో దాదాపు 20వేల మంది యువత నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. ఈ పథకం అమల్లోకి వస్తే జిల్లాలోని యువతకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంతేకాక ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ పథకం కింద ఇంటర్నెట్ సేవల పథకం ప్రారంభం కానుంది. రూ.45లక్షల లోపు ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఇంటి రుణం పై ఆదాయపు రాయితీ రూ.1.5 మేర కొత్తగా కలగనుంది. దేశవ్యాప్తగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, సాగుతోపాటు ప్రతి నివాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని 300పైగా ఆవాసాలకు సౌకర్యం కలగనుంది. దీంతో గ్రామస్తులు కొంత ఊరట చెందుతున్నారు. -
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి, మక్తల్: ఒకప్పుడు వీధుల్లో వర్షం వస్తే చాలు గుంతలుమయంగా, రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి పందు లు సంచరిస్తూండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారుమారై అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది మక్తల్ పట్టణం. నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డి ప్రతేక్యంగా చొరవ తీసుకొని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారు. గతేడాది ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అధికారుల పర్యవేక్షణలో గడుపులోపే పనులు చేయాలని ఆదేశాలు ఉండటంతో త్వరతిగతిన పనులు చేయించా రు. పట్టణంలో 5 ఎంపీటీసీ పరిధిలోని 18 వార్డు లో పనులు పూర్తిచేశారు. అదేవిధంగా మిగతా కాలనీల్లో సైతం నిధులు మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధిలో కుంటుపడిన ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిల్లో మక్తల్‌కు ప్రా ధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇవే కాకుండ మం డంలోని గ్రామాలకు రూ.3కోట్ల నిధులు మంజూ రు చేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగాయి. -
అభివృద్ధి బాటలో ఆర్మూర్
సాక్షి, ఆర్మూర్: కాశ్మీర్–కన్యాకుమారిని కలిపే 44వ జాతీయ రహదారి, నిజామాబాద్–జగదల్పూర్ వరకు గల 63వ జాతీయ రహదారుల కూడలిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాకు ఆయువు పట్టుగా ఉంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఆర్మూర్ ప్రాంతంలో ఇటీవల పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే మార్గంలో భాగంగా రైల్వే స్టేషన్ సైతం ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగుతోంది. వ్యవసాయమే కాదు రాజకీయ చైతన్యం కూడా ఇక్కడ అధికంగానే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఆర్మూర్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గం అభివృద్ధికి మునుపెన్నడూ మంజూరు కానన్ని నిధులు మంజూరు చేయించారు. చేపట్టిన పనులు.. అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ ముందుంది. హేమాహేమీలైన నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గణాంకాల ప్రకారం రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు దశాబ్దాల నుంచి నెరవేరని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలను పూర్తి చేయించారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, ఆలూర్ బైపాస్‌రోడ్డు, నందిపేట బైపాస్ రోడ్డు, నందిపేట మండలం ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రజ లతాగునీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ పనులు చేపట్టడం ఆయన హయాంలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చాకచక్యంగా నిధులు రాబట్టుకుంటూ జీవోల జీవన్రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. పరిష్కారం కాని సమస్యలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన భూనిర్వాసితులకు సమైక్య పాలనలో అందాల్సిన నష్ట పరిహారం పూర్తిగా అందలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా వీరి సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశపడ్డ బాధితులకు మొండి చేయే ఎదురవుతోంది. మరో వైపు నియోజకవర్గం పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు కేటాయించినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గ స్వరూపం.. ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలతో 1952కు పూర్వమే ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009 నియోజకవర్గ పునర్విభజన కంటే ముందు ఆర్మూర్ నియోజకవర్గంలో 12 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజనలో ఆర్మూర్ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్మూర్ మండలంతో పాటు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలం, డిచ్పల్లి నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలాలను కలిపి ఆర్మూర్ నియోజకవర్గంగా మార్చారు. ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు కేవలం మూడు మండలాలతో జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గంగా ఆర్మూర్ రూపాంతరం చెందింది. భౌగోళికంగా మూడు మండలాలు పక్కపక్కనే ఉన్నా మూడు మండలాల గ్రామాలను కలుపుతూ అనువైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఈ నియోజకవర్గం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. మండలంలోని సుర్భిర్యాల్, కోమన్‌పల్లి, మగ్గిడి, ఖానాపూర్, అమ్దాపూర్, మంథని, దేగాం, ఆలూర్, మచ్చర్ల, మిర్ధాపల్లి, రాంపూర్లతో పాటు నందిపేట్ మండలంలోని నందిపేట్, అయిలాపూర్, వెల్మల్, కమ్ఠం, ఆంధ్రనగర్తో పాటు శివారు గ్రామాలు రైతు ఫారం, ఎన్టీఆర్ నగర్, జోదిపేట్, ఇంద్రనగర్, వెంకటేశ్వర కాలనీలు డిచ్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉండేవి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఒకే విధంగా ఉండేది కాదు. నియోజకవర్గ పునర్విభజనలో మూడు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలను పూర్తి స్థాయిలో ఏకం చేయడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన రైతు కుటుంబం వెంకట రాజన్న, రాజబాయి దంపతుల పెద్ద కుమారుడైన ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన చదువును కొనసాగిస్తూ ఇటీవల ఎల్ఎల్ఎం పరీక్షలు సైతం రాశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తన మేనమామ, మాజీ ఎంపీపీ యాల్ల రాములు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితంగా ఉంటూ 2001 నుంచి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. 2008 నాటి ఎర్రజొన్నల ఉద్యమంలో ఆయన ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతులకు రావాల్సిన రూ.11 కోట్ల బకాయిలను ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు సైతం పెద్దపీఠ వేస్తున్నారు. 2014 పోల్ గ్రాఫ్ మొత్తం ఓటర్లు 1,82,790 పోలైన ఓట్లు 1,34,575 జీవన్‌రెడ్డి 66,712 సురేశ్‌రెడ్డి 53,251 మెజారిటీ 13,461 2018 ఓటర్ల జాబితా.. మొత్తం ఓటర్లు 1,70,732 పురుషులు 80,325 మహిళలు 90,402 ఇతరులు 5 పోలింగ్ కేంద్రాలు 211 ప్రభావితం చేసే కులాలు: మున్నూరుకాపు, ఖత్రి, గురడి కాపు, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు -
నగరం తూర్పుకు నగిషీలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తూర్పు భాగానికి నగిషీలు దిద్దే పనికి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నడుం బిగించింది. ‘లుక్ ఈస్ట్’ పేరిట రాజధాని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మాదాపూర్‌లో శిల్పారామం తరహాలో ఉప్పల్‌లో మినీ శిల్పారామం నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ పక్కనే ఐదెకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ మినీ శిల్పారామం కోసం కేటాయించింది. పల్లె అందాలు కళ్లకు కట్టేట్టు చూపడంతో పాటు ఆయా కులవృత్తుల తీరును భావితరాలకు తెలియజేసేలా శిల్పాలు ఏర్పాటు చేసే దిశగా పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. కళాకారుల కోసం ప్రత్యేక ఆడిటోరియం నిర్మిస్తోంది. వరంగల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో మినీ శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనికితోడు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.623 కోట్ల వ్యయంతో భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో లే అవుట్లు.. రియల్ ఎస్టేట్ జోరున్న ప్రాంతాల్లో అసైన్డ్ భూములను గుర్తించిన హెచ్ఎండీఏ.. వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ పథకంలో భాగంగా మేడిపల్లిలోని 360 ఎకరాల అసైన్డ్ భూముల్లో, ప్రతాపసింగారంలో 200 ఎకరాలను లే–అవుట్ చేయాలని భావించింది. మేడిపల్లి సర్వే నంబర్ 63లోని 360 ఎకరాల అసైన్డ్ భూములను తమకు అప్పగించాలని హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా గుత్తేదారులను ఎంపిక చేసి త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేశారు.మాస్టర్ ప్లాన్ 2031కు అనుగుణంగా సొంత నిధులతోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ లే–అవుట్లుగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, గ్రీనరీ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. లే–అవుట్ పూర్తయ్యాక భూములు అప్పగించిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను నష్టపరిహారంగా అందజేస్తారు. రైతులు ఆ ప్లాట్లను అమ్ముకోవచ్చు. లేదంటే ఉంచుకోవచ్చు. యజమానులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లను హెచ్ఎండీఏ ఈ–వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటుంది. 12 ఏళ్ల క్రితమే ఉప్పల్ భగాయత్‌లో ల్యాండ్‌పూలింగ్‌కు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. అయితే ఆ భూములో కొన్ని వివాదాలు తలెత్తడంతో గతేడాది ఆగస్టులో ప్లాట్ల పత్రాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టుతో ఆయా గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. మౌలిక వసతుల కల్పన.. అటు వరంగల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. బీబీనగర్, పోచంపల్లి మండల కేంద్రాల్లోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.15 కోట్లు కేటాయించింది. ఘట్‌కేసర్‌ను అర్బన్ నోడ్ కింద అభివృద్ధి చేయడంలో భాగంగా గ్రామగ్రామానికీ మూడు, నాలుగు కిలోమీటర్ల రేడియస్‌లో అన్ని రోడ్లూ అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. భువనగిరి మున్సిపాల్టీలో సెంట్రల్ మీడియన్ నిర్మాణం, నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర పనులు కోసం రూ.15 కోట్లు మంజూరు చేసి పనుల వేగం పెంచింది. -
అలసిన తెలంగాణ ఆకాంక్షలు
విశ్లేషణ ఎన్నికల్లో గెలిచాక ఇకపై ఉద్యమ పార్టీ కాదు అని తెరాస ప్రకటన వెలువడిన క్షణం నుంచే తెలంగాణ ప్రజల వాంఛలకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. కలాలు తలవంచాయి. కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యమయ్యాయి. మూడున్నరేళ్ల కాలంలో ‘తెలంగాణ’ ఎంత వెలిగిందో తేటతెల్లంగా మాట్లాడుకోలేకపోయాం. ఎవరు, ఏది మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. ప్రతిపక్షం అని నిందించడం మామూలైంది. లేదా ఎవరో ఒకరితో ఖండింపచేయడం ఆనవాయితీగా మారింది. ఉద్యోగాలు, అన్ని రంగాలలో వాటా, తెలంగాణ ఆత్మగౌరవ భావన, విద్య, భాష, సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగాలలో జరిగిన అవమానం, అన్యాయం ఉద్యమానికి ముఖ్య కారణాలు. ఐతే రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాం క్షల్ని పక్కన పెట్టి తెరాస అధినాయకుల అభీష్టాల కోసం, ప్రయోజనాల కోసమే పాలన ఆరంభమైంది. నేడూ అదే కొనసాగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇప్పుడిక తెరాస ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించారు. అన్ని బూర్జువా పార్టీలలాగే ఎన్నికల పార్టీ అనే సంకేతం ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడే ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావలసింది. అందుకు వ్యతిరేకంగా పోరాటం జరగవలసి ఉంది. మావోయిస్టు ఎజండా మా ఎజండా అని ప్రకటించిన అధినాయకుల ప్రకటన ఆంతర్యాన్ని బట్టబయలు చేయవలసి ఉంది. కాని ఎందుచేతనో దాని గురించి ఆలోచించలేదు. అదిగో! అప్పటి నుండే తెలంగాణ ప్రజల వాంఛలకు, బతుకులకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. ఇరవై శాతం పాలక వర్గాల ప్రయోజనాల ముందు ఎనభై శాతం ప్రజల మత సాంస్కృతిక సాహిత్య చరిత్రలు దిగదుడుపు అయ్యాయి. ఎక్కడా, ఏ రూపంలోనూ ఆలనలో, పాలనలో తెలంగాణ మాటలేదు. అంతా అధినాయకుల కీర్తనే. తెలంగాణ ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వందకోట్లతో తెలుగుకు తారాజువ్వల వెలుగులు అద్దారు. ఆనాటి ఉద్యమ భావనలకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధం. ఇప్పుడు ‘పులగం పెడుతానన్న దొర సొట్ట గిన్నె కూడ లాక్కుపోయిండన్న’ చందంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు బాగోలేవు. అందుకే పాత నానుడులు, జాతీయాలు, సామెతల వాడుక మెల్లి మెల్లిగా మొదలైంది. ఒక కొత్త విచారధార వారి పదాల్లో తొంగి చూస్తోంది. మాకు మా అసలు తెలంగాణ, కోరిన తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణ ఆత్మరహిత తెలంగాణ. ప్రజల అస్తిత్వం, కాంతి లేని రోల్డు గోల్డు తెలంగాణ వచ్చింది. వచ్చింది పాలకవర్గాల తెలంగాణే. ఇది ప్రజలు ఊహించని పరిణామం. మరోసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేర ఏర్పడిన పార్టీ, ప్రభుత్వం చేతిలో ఓడినట్లుగానే లెక్కిస్తున్నారు. ‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’ అన్నట్టు కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి ‘నియ్యత్ లేని నిప్పులే’ కానీ చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. ‘రోశాల పాటగాడికి వేశాలు మెండు’ అనే సామెత నిజం అయ్యిందని జనం బాధపడుతున్నారు. ఆనాడు పాటలు పాడిన, ఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడు తనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించిపోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. ఇప్పుడు, తెలంగాణ ఆత్మ, నాలుగు కోట్ల ప్రజల గుండెలను తట్టి లేపుతున్నది. ఉమ్మడి పాలనలో ‘మిస్’ అయిన సన్మానం, ప్రతి శాలువ తనకే కావాలని సర్కారీ కవులు కంకణబద్ధులయ్యారు. ఈ మూడున్నరేళ్ళలో కవుల మతలబు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘నాలిక మీద ప్రేమ. నాభి కాడ కోపం’ కలిగిన పాలకుల అసలు స్వభావం అర్థం చేసుకున్నారు. ‘తొండకు దొరతనమిస్తే ప్రహరి గోడ మీద సవారి చేసింద’నే నానుడిని, ‘ఊసరవెల్లి అసలు రంగు మోసమే’ అని తేటతెల్లంగా గ్రహించారు. తెలంగాణలో జరగవలసినవి తక్కువ జరిగాయి. జరగకూడనివి అతి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి మధ్య సమతౌల్యం లేని కారణంగా తెలంగాణలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అశాంతి గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ, ఏ పంథా అయినా మరోసారి ‘తెలంగాణకు సై’ అంటుందో వారికే ఇక్కడ భవిష్యత్తు ఉంది. ఎన్నికలు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల పూర్తి కాని ఆకాం క్షలే ప్రధానం. ఇప్పుడు అధికారం కోసం రాజకీయాలు ఆపి పరిపూర్ణ తెలంగాణ కోసం పోరాడాలి. జైళ్ల కైనా వారు వెళ్లగలగాలి. ‘నూతిలో తుపాకి గుండేసి తూటు చూపియ్యి అన్నాడట’ వెనకటికో దొరగారు. ఆనాటికది సామెత! నేడు ప్రజలు తమ గుండెలు విప్పి చూపి అన్నీ తూటులే అని అంటున్నారు. తెలంగాణలో బంగారం అంతా ఎక్కడ ఎక్కువగా కుప్ప కూడుతున్నదో కళ్లు విప్పి చూస్తున్నారు. మొలిచే కొమ్ములను వంచడానికి మార్గం వెదుకుతున్నారు. చల్లబడిన సిద్ధాంతాలను పెనం మీద కాదు, అగ్గి కొలిమిని రాజేసి పరీక్షిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం గతం కాదు. అది రేపులో కదలాడుతున్నది. ‘గురిజెత్తు ఆశయం, గురి చూసి కొట్టే అమ్ముల పొది’లా ఉంది పరిస్థితి. తెలంగాణ ఎన్నడూ పాలకులకు సింహస్వప్నమే. అసలు సిసలు తెలంగాణ సాధన కోసం ఉద్యమం కొనసాగింపు దిశగా కదులుతుందా? తిరుమల రావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
మాది వజ్ర సంకల్పం
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకెళ్తాం.. కాంగ్రెస్‌ది శిఖండి పాత్ర.. విలన్ నంబర్ వన్ ► అభివృద్ధిని అడ్డుకునేందుకే కేసులేస్తున్నారు ► ప్రతి పథకానికీ.. కార్యక్రమానికీ కేసులా? ► ఇప్పటికే 196 కేసులు.. లక్షలాది మంది ఉసురు పోసుకుంటున్నారు ► కేసులేస్తే ఓట్లు పడతాయా? వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? ► ఇంతకాలం సీఎం హోదాలో గంభీరంగా ఉన్నా ► ఇక ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ వైఖరిని చౌరస్తాలో ఎండగడతా ► మళ్లీ పాత కేసీఆర్‌ను చూస్తారని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కేసుల పురాణం మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పిశాచిలా, భూతంలా తయారైందని నిప్పులు చెరిగారు. కొత్త రాష్ట్రాన్ని గొంతు నులిమేసేందుకు విషపూరిత వైఖరిని అవలంబిస్తోందని, తెలంగాణకు అప్పుడూ ఇప్పుడూ విలన్ నంబర్ వన్ కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. కేసుల రూపంలో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ఆ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను అభ్యుదయ రాష్ట్రంగా మార్చే దృష్టి నుంచి తమను మరల్చలేరని.. ఉక్కు, వజ్ర సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం వల్లే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టులతోపాటు వివిధ కార్యక్రమాలపై 196 కేసులు వేశారని చెప్పారు. ఒక జాతీయ పార్టీ ఇంత దివాలాకోరు రాజకీయం చేయటమేంటని ప్రశ్నించారు. ‘సాగునీరు, తాగునీరు, కరెంటు, అర్ధాకలితో అలమటించే కాంట్రాక్టు కార్మికుల పొట్ట నింపే కార్యక్రమాలను సైతం చిల్లర మల్లర రాజకీయాలకు వాడుకుంటారా? పనికిమాలిన రాజకీయ లబ్ధికి వాడుకుంటారా? ఇంత నీచాతినీచంగా దిగజారిందా మీ పార్టీ..’అని ప్రశ్నించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఫలితాలు, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు.. వేటినీ వదలకుండా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందంటే.. తెల్లారే పిల్ వేయాలనే దుర్మార్గ సంస్కృతిని అనుసరిస్తోందన్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తూ పిల్ వేసి వారి ఉసురుపోసుకునే రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఇంతకాలం సీఎం హోదాలో ఉన్నందున గంభీరంగా వ్యవహరించానని, ఇకపై ఊరుకునేది లేదని.. త్వరలోనే రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజల మధ్యలో చౌరస్తాలో ఎండగడతానని, మళ్లీ పాత కేసీఆర్‌ను చూస్తారని అన్నారు. ప్రజలే వారికి సరైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. రెగ్యులరైజేషన్ కాదు.. అబ్జార్ప్షన్ వాస్తవానికి మేం కాంట్రాక్టు విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయలేదు. సంస్థలో విలీనం చేసుకున్నం. రాత్రనక, పగలనక కష్టపడే విద్యుత్ సిబ్బందిని గురించి కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా కోర్టు మానవతా దృక్పథంతో వ్యవహరించింది. కోర్టు స్ఫూర్తిని అభినందిస్తున్నా. వారికి గౌరవమైన వేతనం ఇవ్వమని చెప్పింది. దోపిడీ వ్యవస్థ కాంట్రాక్టర్లు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పటివరకు సంస్థ వీరికి నేరుగా జీతాలు చెల్లించలేదు. కాంట్రాక్టర్లు 15 శాతం కమీషన్ తీసుకొని.. నిర్బంధంగా ఉద్యోగుల జీతాల్లోనూ కోత పెట్టి దోపిడీకి గురి చేశారు. ఇప్పుడు ఆర్టిజాన్ పేరుతో విద్యుత్ సంస్థలే వీరికి జీతాలు చెల్లిస్తాయి. విద్యుత్ సంస్థల్లో రాత్రింబవళ్లు కష్టపడి కాంట్రాక్టర్ల దోపిడీ కింద నలిగిపోతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలోకి తీసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని న్యాయస్థానం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. స్కిల్డ్ విద్యుత్ సిబ్బందికి రూ.21,784 ఇవ్వాలని బోర్డు ప్రతిపాదిస్తే.. హైకోర్టు రూ.22 వేలు ఇవ్వాలని సూచించింది. ఇలాగే అన్ని కేటగిరీలకు హైకోర్టు చేసిన సూచనలను గౌరవించి.. అంతకంటే ఒక రూ.వెయ్యి ఎక్కువే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేతనాల పెంపుతో విద్యుత్ సంస్థలపై రూ.28.70 కోట్ల అదనపు భారం పడుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం కుదరదని గతంలో ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందుకే రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి గౌరవిస్తాం. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వాళ్లకు ఏ శిక్ష వేయాలో ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ చేస్తున్న ఈ దివాళాకోరు రాజకీయాల వల్ల రాష్ట్రంలో లక్ష కుటుంబాల వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు అయితే ఏకంగా గాంధీభవన్ ముందే ధర్నాలు చేశారు. అయినా బుద్ధి మార్చుకోకుండా కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నరు. మేం లక్ష కుటుంబాలకు మంచి చేస్తే రాజకీయ నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. హోంగార్డులను కూడా త్వరలోనే జనహితకు పిలిపించి మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తా. కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలో ఆ లక్ష కుటుంబాలు ఆలోచించాలి. కాంట్రాక్టు ఉద్యోగుల కడుపు నింపుతం. రెగ్యులరైజ్ చేస్తే కోర్టులు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నం. అన్ని శాఖలను సమీక్షించి ఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులున్నరో లెక్కగట్టి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తాం. విద్యుత్ ఉద్యోగుల విషయంలో కోర్టు తుది తీర్పు తర్వాత ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రధాన వాటాదారుగా ఉన్న కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. చట్టాలను పరిశీలిస్తున్నం. న్యాయమూర్తులు కూడా చీవాట్లు పెట్టారు.. కష్టపడి 15, 16 ఏళ్లు అనేక అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలను భరించి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి తెలంగాణ సాధించున్నం. అందుకే ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఆశాభంగానికి గురైన కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ చేపడుతున్న పటిష్ట కార్యక్రమాలు, ప్రజాప్రయోజన కార్యక్రమాలు నచ్చడం లేదు. అర్ధాకలితో అల్లాడుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల మా సానుకూల వైఖరిపై వారికి కన్నుకుట్టి, పుట్టగతులు లేకుండా పోతాయనే దుగ్దతో కేసులు వేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 196 కేసులు వేశారు. ఒక్క సాగునీటి రంగంపైనే 164 కేసులు వేశారు. ప్రభుత్వం ఉత్తర్వులు తీయాలె.. కాంగ్రెస్ పార్టీ కేసులు వేయాలె.. అనే రీతిలో సాగుతోంది. కాంగ్రెస్‌ది దివాళాకోరు రాజకీయ విధానం. సానుకూల వైఖరి లేకుండా కేవలం చిల్లర మల్లర రాజకీయాల కోసం నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలిస్తే కేసులు, సింగరేణి డిపెండెంట్ల మీద కేసులు, మిషన్ భగీరథ మీద కేసులు, హైదరాబాద్ అభివృద్ధి మీద కేసులు.. ఇలా అన్నీ కాంగ్రెస్ వాళ్లే వేస్తున్నారు. 20 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరు కేసులు వేశారు. అన్నీ వీగిపోయాయి. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయమూర్తులు కూడా చీవాట్లు పెట్టారు. బహిరంగంగా కామెంట్లు చేశారు. దీంతో ఏమీ చేయలేక గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రాజెక్టులపై కేసులేస్తే ఓట్లు పడుతాయా..? వీళ్లు తెలంగాణ బిడ్డలేనా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీళ్లు కావాలంటే ఎంత ఆరాటం కావాలె. వాస్తవానికి హోంగార్డులను కూడా రెగ్యులరైజ్ చేయాలనుకున్నం. కానీ, కాంగ్రెస్ వాళ్లు సింగరేణి డిపెండెంట్లపై కోర్టుకెళ్లంగనే మేం ఆలోచనలో పడ్డం. మీ మొహానికి ఎప్పుడన్న అంత పరిహారం ఇచ్చిండ్రా? జూన్‌కల్లా కాళేశ్వరం నుంచి నీళ్లిస్తమంటే కాంగ్రెసోళ్ల గుండెలు అవిసిపోతున్నాయి. కాళ్ల కింద భూమి కదులుతోంది. అందుకే 119 కేసులు వేసిండ్రు. మీ మొహానికి ఎప్పుడైనా ఎకరానికి రూ.6 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు పరిహారం ఇచ్చిండ్రా? నిర్వాసితుల ఇళ్లకు రూ.5.04 లక్షలు ఇచ్చిండ్రా? ఏదో 75 వేలు ఇచ్చి, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకునేటోళ్లు వాళ్లు. జీవో నం.123 మీద కూడా కేసు వేసిండు. చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందినా మళ్లీ కేసు వేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొండపోచమ్మ సాగర్ ఉంది. దానికి 4,400 ఎకరాల భూమి అవసరం. అయితే ఈ సాగర్ నిర్మిస్తే మునిగిపోయే గ్రామాలు నా గజ్వేల్ నియోజకవర్గంలోకే వస్తాయి. నేను వాళ్లను పిలిపించి మాట్లాడితే నాపై గౌరవంతో వాళ్లు ఒప్పుకొని 4,200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఇంకో 200 ఎకరాలు కాంగ్రెసోళ్లవే ఉన్నవి. వాళ్ల కార్యకర్తలు, ఆఫీసు బేరర్లు, ఎంపీపీలే ఉన్నరు. వాళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నరు. మీదీ ఓ రాజకీయ పార్టీనేనా? ఇంత దివాళా తీసిండ్రా? ఇంత భ్రష్టు పట్టిండ్రా? ఇసుకపై పదేళ్లలో రూ.50 కోట్ల ఆదాయం తేలేదు.. అంత అసహనం ఎందుకు? చొక్కా చించుకోవడం ఎందుకు? చాలా టైం ఉంది కదా? ఎప్పుడో 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు? అంత మిడిసిపాటు, అంత కథ ఎందుకు? మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. సిగ్గు లేకుండా అన్ని పార్టీలను, సమైక్యవాద పార్టీలను కూడా కలుపుకుని అచ్చంపేటలో మహాకూటమి పెట్టిండ్రు. ఏమయింది. 20కి 20 కౌన్సిలర్లు టీఆర్ఎస్సే గెలిచింది. సిద్ధాంతాల్లేవు, సిగ్గుల్లేవు. పాలేరులో కూడా అట్టనే చేసిండ్రు. మా తుమ్మల నాగేశ్వరరావు 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిండు. ప్రజలు ఇంత చేస్తున్నా మీకు అర్థం కావట్లేదా? మాట్లాడేటప్పుడు సిగ్గుండాలె. పదేళ్లలో ఇసుకపై రూ.50 కోట్లు ఆదాయం తేలే. మాడేళల్లో రూ.వెయ్యి కోట్లు తెచ్చిన మా గురించి మాట్లాడతరా? ఇసుకపై రూ.1000 కోట్ల ఆదాయం తేవచ్చని మీ జీవితంలో ఊహించిండ్రా? కుక్కలు నక్కలు తిన్నట్టు తిన్నరు. అడ్డం, పొడుగు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల కోసం జేసీబీలు తవ్వుతుంటే వాళ్లకి గుండెలు తవ్వినట్టుంది. అందుకే ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నరు. కరెంటు వద్దని ధర్నాలు చేస్తున్నరు తెలంగాణకు గత 30 ఏళ్లుగా కరెంటు ఘోష ఏంటో తెలుసు. కరెంటు ఇయ్యకపోతే ధర్నాలు చేసినం. ఇప్పుడు 24 గంటలు కరెంటు వద్దని కూడా ధర్నాలు చేయడం చూస్తున్నం. అద్భుతం జరుగుతుంటే కళ్లు బైర్లు కమ్మి, ఏం చేయాలో అర్థం కాక చావు తెలివితో వ్యవహరిస్తున్నరు. దేశంలో ఇలాంటి అసహన వైఖరి ఎక్కడా లేదు. రాష్ట్రాన్ని అభ్యుదయ మార్గంలో తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని ఆపలేరు. ఇవి రాజకీయాలు కావు. ఒక్క ఎన్నిక గెలిచిండ్రా? మీ శాసనసభ్యుడు చనిపోయిన దగ్గర్నే మీరు గెలవలేదు. అందుకే పిచ్చివాళ్లయ్యారు. ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు చిన్న బుచ్చుకోవద్దు ఇప్పుడు రాష్ట్రంలో 9,326 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 6 వేల మెగావాట్ల డిమాండ్ ఉండేది. డిమాండ్ ఎంత పెరిగినా కరెంటోళ్లు కష్టపడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నరు. అందుకే వాళ్లకు మంచి చేయాలనుకున్నం. కానీ కాంగ్రెసోళ్లు అడ్డుకుంటున్నరు. అయినా మా బిడ్డల్లాగా కాపాడుకుంటం. మీరు మనసు చిన్నబుచ్చుకోకండి. ఇట్ల చేస్తే గెలవరు మీరు. గెలుపుకి సమీపంలోకి కూడా రారు. ఉన్న సీట్లు కూడా పోతయి. దీన్ని రాజకీయం అనరు. కిరికిరి అంటరు. మీరు ఏం చేసినా, మా పని ఆపలేరు. కొంత ఆలస్యం కలిగించగలరు తప్ప. మీరున్నప్పుడు ఏం జరిగిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు స్పష్టంగా అర్థమయింది. ఇప్పటికైనా నిర్మాణాత్మక వైఖరితో వెళ్లండి. నేరేళ్ల ఘటన అనుకోకుండా జరిగింది దళితులను కొట్టమని ఏ ప్రభుత్వమైనా చెప్తదా? కేసీఆర్ ప్రభుత్వం అసలు చెప్తదా? అక్కడ దాష్టీకం. తొమ్మిదో పదో లారీలు తగలబెట్టిండ్రు. మా ఇష్టమొచ్చినట్టు చేస్తమన్నా చూస్తూ ఊరుకోవాల్నా? దళితులమని వాళ్లకేమైనా బోర్డులుంటయా? అనుకోకుండా జరిగిన సంఘటన అది. 10 మంది నిందితుల్లో ముగ్గురో నలుగురో దళితులున్నరు. దళితవాడపై పడి దాడి చేస్తే అనుకోవాలి. అయినా జరగకుండా ఉండాల్సింది. మీరాకుమార్ అయితే అందీ.. గీరాకుమార్ అయితే ఏంది? అమెకు ఇప్పుడంతా బొగ్గు తెలంగాణనే కనబడ్తది. ఆమెకు ఓట్లు పడితే బంగారు తెలంగాణ కనిపించేది. జైరాం ఎన్నడన్నా సర్పంచ్‌గా గెలిచిండా? పోలీసు వాహనాల కొనుగోలుపై జైరాం రమేశ్ చేసిన ఆరోపణలు ఇంత ఈడియాటిక్గా ఉంటాయా? ఒక్క డాక్యుమెంట్, ఒక్క సాక్ష్యం చూపెట్టిండ్రా? జైరాంరమేశ్ జీవితంలో ఎప్పుడయినా సర్పంచ్‌గా గెలిచిండా? ఆధారాలు లేకుంటే ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తావా? డ్రగ్స్‌పై దిగ్విజయ్ కూతలు డ్రగ్స్‌పై దిగ్విజయ్ సింగ్ జ్ఞానం, అర్థం, పర్థం లేకుండా మాట్లాడుతున్నరు. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. కల్తీ విత్తనాల మీద దృష్టి పెట్టాలని చెపితే పోలీసులు జరిపిన విచారణలో కల్తీ కారంపొడులు కూడా బయటపడినయ్. అట్లనే ముందుకెళ్తే ఈ డ్రగ్స్ బయటపడ్డయ్. వాస్తవానికి ఎన్సీబీ జాబితాలో మన రాష్ట్రం లేదు. హైదరాబాద్ లేదు. పంజాబ్, యూపీ, రాజస్థాన్లతో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ. అయినా, ఈ పబ్బులు, గబ్బులు తెచ్చింది కూడా కాంగ్రెస్సే. డ్రగ్స్ వ్యవహారాన్ని మొగ్గ దశలోనే తుంచాలని చెప్పా. అయినా ప్రభుత్వానికి సంబంధముందని దిగ్విజయ్ మాట్లాడిండు. ఆయనకేమైనా సంబంధం ఉండి బయటపడుతుందని భయపడి మాట్లాడిండేమో? ఎవరో బాహుబలి కోసం ఎదురుచూస్తున్నమని చెప్పినప్పుడే మీకు చేత కాదని ఒప్పుకున్నట్టు అయింది. -
లింక్ చెరువులపై దృష్టి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. నాబార్డు ఆధ్వర్యంలో స్థానిక డీసీసీబీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ‘నీరే జీవనం’ శిక్షణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై నాబార్డు ప్రచురించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు 116 లింకు చెరువులను అభివృద్ధి చేయడంతోపాటు ఫీడర్ చానల్స్ మరమ్మతులు చేపట్టినట్టు వివరించారు. జిల్లాలో 8 అడుగుల లోతులో భూగర్భ జలాలు లభించాల్సి ఉండగా.. 70 అడుగులు లోతుకు వెళ్లినా కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ ధృక్పథంతో భూగర్భ జలాలను పెంపొందించే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 116 లింకు చెరువులు ఉన్నాయని, వాటిద్వారా జిల్లాలోని 550 చెరువుల్ని అనుసంధానించే ఫీడర్ చానల్స్ మరమ్మతులు చేయగలిగితే భూగర్భ జలాలను మరింత పెంపొందించే అవకాశం ఉందని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, చెరువు కుంటల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణ కోసం నాబార్డు చేపట్టిన నీరే జీవనం కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వాలంటే పూర్తిస్థాయి అవగాహనతో ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. నీటి రక్షణ చర్యలపై గ్రామస్థాయి ప్రణాళికను సిద్ధం చేశామని, ఆ సమాచారాన్ని నాబార్డు ద్వారా శిక్షణ పొందే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా అందిస్తామని చెప్పారు. భూగర్భ జలాలను పరిరక్షించుకోకపోతే 2050 నాటికి నీటికొరత తలెత్తి పశు, పక్ష్యాదులతోపాటు ప్రజలు సైతం ఇబ్బందిపడే ప్రమాదం ఉందన్నారు. నాబార్డు ఏజీఎం శ్రీరామప్రభు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు నాబార్డు సమగ్ర ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఇందిరా ప్రకాష్ పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య పరిగి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య అన్నారు. ఆదివారం పరిగిలోని పాలశీతలీకరణ కేంద్రంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. మండల నూతన అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా సమావేశం అనంతరం బీజేపీ మండల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా, ఉపాధ్యక్షులుగా శ్యాంసుందర్, కాసుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులుగా జనార్దన్‌రెడ్డి, నర్సింహులు, కార్యదర్శిగా మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ప్రగతికి తర్కం ప్రధానం
సందర్భం: మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవుతుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు. 1960లో విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిం చాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎలా విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి? దీనికి కార ణం ఏమిటిదని ఆలోచనలు మొదలయ్యాయి. కొన్ని దేశాల అభివృద్ధి ఎందుకంత మందకొండిగా ఉందని ఆర్థికవేత్తలు లారెన్స్ హరిసన్, షాంబెల్ హల్టింగ్సన్లు అనేక పరిశోధ నలు చేశారు. ఒకదేశం నాగరికత కూడా ఆ దేశ ఆర్థిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వీరు సూత్రీకరించారు. నాగరికత, సంస్కృతి అంటే ఏమిటో చాలా మందికి స్పష్టత ఉండదు. నాగరికత అంటే జాతీయత మాత్రమే కాదు. జాతి బృందాలు మాత్రమే కాదు. నాగరికత అంటే మతం కూడా కాదు. మూఢవిశ్వాసాలు అంతకంటే కాదు. జాతీయత, రంగు, ప్రదేశము, మతము యొక్క సమగ్ర రూపమే సంస్కృతి. ఒక దేశం ఆర్థిక ఎదుగుదలకూ లేదా వైఫల్యానికీ ఆ దేశ సంస్కృతే కారణభూతమౌతుంది. సంస్కృతి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిత్యం పరిభ్ర మిస్తూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. ఇంగ్లాండు, ఐర్లాండ్‌లు ఒక దేశంలోని భాగాలు, ఐర్లాండ్ ప్రగతిలో మందకొడి తనాన్ని ఇంగ్లాండ్ తరుచుగా హేళన చేసేది. ఐర్లాండ్‌లో కరు వుకు కారణం అక్కడివారి సోమరితనమే అని సామెతలుగా బ్రిటిష్‌వాళ్లు చెప్పేవారు. ఐర్లాండు అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు అని కూడా వ్యాఖ్యా నించేవారు. కూర్చుని తింటే కరువులు ఎందుకు రావు అని ఆనాడు విన్స్టన్ చర్చిల్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ హయా ములో మనదేశ ప్రజలు కూడా కూర్చుని తినటం వల్లనే కరువులు వచ్చాయన్నారు. కానీ, 1970లో యూరప్‌లో అన్ని దేశాలకంటే ఐర్లాండ్ జీడీపీ బాగా పెరిగింది. అదే భారతదేశంలో 1973లో ఆహార కరువు వచ్చింది. నాగరికత ప్రభావం కూడా ఎప్పుడూ స్థిరం గా ఉండదు. ఉదాహరణకు దక్షిణ కొరియా, ఆఫ్రికాలోని థానా ఆర్థిక పరిస్థితి 1960ల వరకు ఒకే రకంగా ఉండేది. కానీ థానా అభివృద్ధి మందకొడిగా ఉంది. సౌత్‌కొరియా ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉన్నదని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారంలో దక్షిణ కొరియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. గ్రీసుదేశాన్ని దాటిపోయింది. ఈ ఎదుగుదలకు ఆ దేశాల సంస్కృతి, నాగరికతే కారణమని పలువురు ఆర్థికవేత్తల వ్యాఖ్యానం. ప్రధానంగా బౌద్ధమతం, సౌత్‌కొరియా ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. జసాన్, సౌత్‌కొరియా, ఐర్లాండ్, శ్రీలంక దేశాలలో బౌద్ధమతం వలన విద్యావ్యాప్తి వేగంగా జరిగింది. ఇతర మతాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. బౌద్ధమతంలో గ్రంథాలు చదవటమే ప్రధానం. అధ్యయనం ముఖ్యమైనది. అందుకే జపాన్‌లో 16వ శతా బ్దంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించారు. మత గ్రంథాలు ప్రమాణం కాబట్టి ఆ గ్రంథాలను చదవటమే బౌద్ధ మతం విస్తృత ప్రచారానికి ప్రధాన కారణం. బౌద్ధమతానికి తర్కం ప్రధానం కాబట్టి ఆ దేశాల యొక్క అభివృద్ధికి అదే కారణమైందని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. జపాన్ దేశంలో అమెరికా కన్నా రెండున్నర రెట్లు అధికంగా పుస్తకాలు ముద్రించబడ్డాయి. జపాన్ అభివృద్ధి వెనుక అక్కడ నెలకొన్న బౌద్ధమతం, పుస్తకాలే కారణం. అంటే మతం, నాగరికత కూడా ఎలా అభివృద్ధికి దోహదపడతాయో జపాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు తెలియజేస్తున్నాయి. కొన్ని దేశాలను కర్మ సిద్ధాంతం కుంగదీసింది. కేవలం దైవానుగ్రహంపైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందని కొన్ని దేశాలు భావించాయి. మతమౌఢ్యాలు బలంగా వున్న దేశా లలో ప్రతి దానికి మతమౌఢ్యమే ప్రధానమనుకునే భావనలో ఉన్నారు. శాస్త్రీయ చింతన లేకుండా అభివృద్ధి అసాధ్యం. మనిషి ఆలోచనే ఆ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా గాని ప్రగతి సాధించాలంటే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు హేతుబద్ధంగా ఉండాలి. మౌఢ్యం సమాజాన్ని శాసిస్తోంది. రాజ్యాంగ నిర్మాణంలోనే సైంటిఫిక్ టెంపర్‌ను కలిగిం చాలని ఆనాడే నెహ్రూ చెప్పారు. మనిషి శ్రమ వెనుక ఆలోచనే ప్రధానం. ఆలోచనపైన సంస్కృతి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. 21వ శతాబ్దంలో మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవు తుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు. హేతుబద్ధత పెర గాలంటే అవగాహనాశక్తి పెరగాలి. అందుకే మన రాజ్యాంగంలో మొదటి వాక్యంలోనే దేశం భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయమవుతుందన్నారు. తరగతి గది అంటే గోడలు కావు. దాని వెనుక రేకెత్తించే ఆలోచనలున్నాయి. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య -
'రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధి'
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం శంకర్పల్లి మండలం జనవాడ, మోక్లతండా, కొండకల్ గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే గండిపేట నుంచి శంకర్పల్లి వరకు... రామంతాపూర్ నుంచి దేవరంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. -
అభివృద్ధికి దిక్సూచి..
బడ్జెట్‌పై ‘సాక్షి’తో మంత్రి ఈటల రాజేందర్ ► ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా ఉంటుంది ► తొలి ప్రాధాన్యం సంక్షేమానికే... ► గతానికి భిన్నంగా ప్రణాళిక వ్యయమే ఎక్కువ ► ఆదాయానికి ఢోకా లేదు.. రెవెన్యూ రాబడి ఆశించినట్టే ఉంది.. దుబారా ఖర్చులు తగ్గిస్తాం ► అర్హులైన నిరుపేదలందరికీ కల్యాణలక్ష్మి ► కాలేజీ విద్యార్థులకు సన్నబియ్యం పథకం సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లోనూ తమ ప్రభుత్వం సంక్షేమానికే తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వరుసగా మూడోసారి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, గతానికి భిన్నంగా ఈసారి ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దుబారా ఖర్చులను తగ్గించి అభివృద్ధికి దిక్సూచిగా నిధుల కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక పంథాలో 2016-17 బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండేళ్ల ఆదాయ వ్యయాలను మదించుకొని తయారు చేసుకున్నందున ఈసారి బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి ఈటల రాజేందర్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అందులో భాగంగానే కులమతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేశామని చెప్పారు. మైనారిటీ విద్యార్థులకు, పేద పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతామన్నారు. కాలేజీ విద్యార్థులకు సైతం సన్న బియ్యం పథకం విస్తరిస్తామని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ.. ఇది స్పష్టమైన బడ్జెట్: కొత్త రాష్ట్రం కావటంతో తొలి ఏడాది ఆదాయ వ్యయాల గణాంకాలేవీ అందుబాటులో లేవు. కేవలం అంచనాలు, తార్కిక ఆలోచనలతో బడ్జెట్ తయారు చేసుకున్నాం. అప్పటి పది నెలల బడ్జెట్, ఆదాయ వ్యయాలను ఆధారంగా చేసుకొని 2015-16లో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాలున్నాయి. అందుకే మరింత స్పష్టత వచ్చింది. ఈసారి బడ్జెట్ ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా ఉంటుంది. బడ్జెట్ తయారీలో ప్రభుత్వం కొత్త పంథా అనుసరించింది. కాలం చెల్లిన పద్దులను తొలగించి.. ఒకే తీరుగా ఉన్న పద్దులను విలీనం చేశాం. దీంతో దుబారా తగ్గుతుంది. అనవసరమైన కేటాయింపులు తొలగిపోతాయి. ఇది ఫలితాల సంవత్సరం తొలి ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దూరదృష్టితో ఎంచుకున్న పథకాలకు అనుగుణంగా బడ్జెట్ తయారైంది. రెండో ఏడాది ఆ పథకాలన్నింటినీ కార్యాచరణలో పెట్టాం. ఇది మూడో ఏడాది.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఫలాలను అందించే లక్ష్యం చేరువైంది. ఈ ఏడాది చివరినాటికే 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తాం. 2017 చివరికల్లా మిషన్ భగీరథ 95 శాతం పూర్తవుతుంది. గతేడాది 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తే... ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యం ఎంచుకున్నాం. అదే సమయంలో మిగతా పథకాల అమలుకు ఆటంకం లేకుండా తగినన్ని నిధులను సమీకరిస్తాం. మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ, కొత్త ఆసుపత్రుల నిర్మాణాలకు నిధులు సమకూర్చేందుకు హడ్కో, నాబార్డు, దేశ, విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఆదాయానికి ఢోకా లేదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఢోకా లేదు. గత ఏడాది బడ్జెట్లో అంతకు ముందుతో పోలిస్తే 30 శాతం రాబడి లక్ష్యం పెంచుకున్నాం. రెవెన్యూ రాబడి అంచనాలు ఆశించినట్లుగానే ఉన్నాయ. భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం ఇప్పుడిప్పుడు రావడం మొదలైంది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌తో పాటు రియల్ ఎస్టేట్ పుంజుకుంది. దేశ జీఎస్డీపీతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. కేంద్రం నుంచి నిధులొస్తాయి నిరుటితో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాం. కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులపై స్పష్టత వచ్చింది. ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి పెంచే విషయంలో కేంద్రం ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం కావటం, జీఎస్డీపీలో నిర్ణీత అప్పుల శాతానికి లోబడి ఉన్న రాష్ట్రానికి 3.5 శాతం ఎఫ్ఆర్బీఎం వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఈ రెండు నిబంధనలకు లోబడి ఉంది. సీఎంను చూసి ఎంతో నేర్చుకున్నాం ఆర్థికమంత్రిగా వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావటం ఆనందంగా ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో ఎంతో అధ్యయనం చేసేందుకు అవకాశముంది. అన్ని రంగాల్లో అపారమైన అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఎంతో నేర్చుకున్నాం. ఆయన సలహాలు, సూచనలు దార్శనికతకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. -
గోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం: కేసీఆర్
హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్, 13 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు శనివారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి గిరిజన తండాలు, ఆదివాసి గూడెంలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విభజన ముందు ఖమ్మం జిల్లాలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లా రాజకీయాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. -
అప్పు ప్లీజ్!
రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్లను కోరిన ప్రభుత్వం * వాటర్‌గ్రిడ్, 'ఇరిగేషన్ డెవలప్మెంట్' పేరిట రుణానికి అభ్యర్థన * ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని హామీ * వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల కోసమే నిధులు * బ్యాంకర్లతో రెండు రోజులపాటు చర్చించిన ఉన్నతాధికారులు * 'కన్సార్షియం'గా ఏర్పడి రుణం ఇస్తామన్న బ్యాంకర్లు * విధివిధానాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై చర్చలు * ఆర్బీఐ, అకౌంటెంట్ జనరల్ అనుమతిపై సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఒడిదుడుకుల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల సాయం కోరింది. భారీ అంచనాలతో తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధుల కోసం ‘రుణ’ మార్గం పట్టింది. ఏకంగా రూ. 25 వేల కోట్లు రుణం కావాలని రాష్ట్రంలోని బ్యాంకర్లను కోరింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు భారీగా నిధులు అవసరమని, అందుకోసమే అప్పు ఇవ్వాలని ప్రతిపాదించింది. మూడేళ్ల వ్యవధిలో నాలుగు లేదా ఐదు వాయిదాల్లో ఈ సొమ్ము అందించాలని... ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి వాయిదాను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాటర్‌గ్రిడ్‌కు తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ పేరిట... మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే రుణాన్ని తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అందించాలని సూచించింది. ఈ రెండు కార్పొరేషన్లకు ఇచ్చే రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని బ్యాంకర్లకు హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రెండ్రోజులపాటు రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. కన్సార్షియం తరఫున రుణం..: కార్పొరేషన్ల పేరుతో ఇచ్చే రుణం అయినప్పటికీ.. ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని మాటివ్వడంతో బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంత భారీ రుణాన్ని ఒకే బ్యాంకు ఇవ్వడం సాధ్యం కాదనే అంచనాతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు ప్రధాన బ్యాంకులు ఒక ‘కన్సార్షియం’గా ఏర్పడి రుణమిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ రుణం లభించినట్లేనని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రుణం ఇచ్చేందుకు ఉత్సుకత పెద్ద మొత్తం అయినప్పటికీ బ్యాంకులు సైతం తెలంగాణ సర్కారుకు రుణం ఇచ్చేందుకు ఉత్సుకత చూపుతున్నాయి. రాష్ట్ర అధికారులతో భేటీల అనంతరం బ్యాంకర్ల ప్రతినిధులు తమ యాజమాన్యాల నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. మరోవైపు కార్పొరేషన్లకు రుణం ఇచ్చేందుకు అవసరమైన విధి విధానాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్)లు తమకు అందించాలని ఆర్థిక శాఖతో సంప్రదింపులు ప్రారంభించారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంచిన డీపీఆర్‌లను ప్రభుత్వం బ్యాంకర్లకు సమర్పించింది. అదే తీరుగా ఏయే ప్రాజెక్టులకు రుణం తీసుకోవాలి, ఎంత మొత్తం అవసరమనే వివరాలతో మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తయారు చేయాలని నీటి పారుదల శాఖను ఆదేశించింది. వాటిని సైతం మరో రెండు రోజుల్లో బ్యాంకర్లకు అందించాలని సూచించింది. రిజర్వు బ్యాంకు, ఏజీల ఆమోదమే కీలకం అడిగినంత రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నా... రిజర్వు బ్యాంక్, అకౌంటెంట్ జనరల్‌ల నుంచి అనుమతి లభిస్తుందా, లేదా అనే సందేహం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలకు చిక్కకూడదనే ఉద్దేశంతోనే సర్కారు... కార్పొరేషన్ల పేరుతో రుణం తీసుకునే ఆలోచన చేసింది. కానీ ఎంచుకున్న కార్పొరేషన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు తగినట్లు తిరిగి లాభాలు వచ్చే మార్గాలేవీ లేవు. దీన్ని కారణంగా చూపుతూ బ్యాంకులిచ్చే అప్పునకు ఆర్బీఐ అనుమతి వస్తుందా, లేదా అన్నది అధికార వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ రుణం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తుందా, లేదా అనేది తేల్చాల్సిన అకౌంటెంట్ జనరల్ అభ్యంతరం చెబుతారేమోన్న సందేహమూ వ్యక్తమవుతోంది. అప్పు అనివార్యం బడ్జెట్లో పేర్కొన్న మేరకు రాబడి లేకపోవడంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. రైతుల రుణమాఫీ, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ నిధులకు సర్దుబాటు చేసేసరికి ఖజానాకు కటకట మొదలైంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న పథకాలకు నిధుల సర్దుబాటు గగనంగా మారింది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్ల చొప్పున ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. రూ. 42 వేల కోట్ల అంచనాతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకు, ఏఐఐబీ నుంచి భారీగా రుణం తీసుకోవాలని సర్కారు ప్రయత్నించింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి నుంచి అప్పు వచ్చే అవకాశాలు కనిపించకపోవటంతో స్థానికంగానే సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలోని బ్యాంకర్లను ఆశ్రయించింది. -
'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలి పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకొని ..అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టిసారించాలి
నెల్లూరు టౌన్: ఆర్టీసీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని, సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు మంత్రుల ఉపసంఘంతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన ఈయూ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీని పరిపాలనాపరంగా రెండుగా విభజించినందున కార్మికసంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్ కమిషనర్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 240 రోజులు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఒప్పందం ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు, అప్పులకు కార్మికులు బాధ్యులు కారని, ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోజురోజుకు నష్టాల్లోకి పోతున్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈడీని యూనియన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో13 జిల్లాలకు చెందిన యూనియన్ నాయుకులు పాల్గొన్నారు. -
నేడు నల్గొండలో కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దామరచర్లలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్‌తో పాటు, చౌటుప్పల్‌లో వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. -
మా పదవులన్నీ ప్రజల భిక్షే
అభివృద్ధి చేయకుంటే ఓట్లకు రాను తెలంగాణలో నిధులకు కొదవలేదు ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల హుజూరాబాద్ : ప్రజలు పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నామని, ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు కలిగిందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. స్థానిక నగరపంచాయతీ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైమాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎప్పుడుబడితే అప్పుడు ఓట్ల కోసం వారికి దండాలు పెట్టి, వారు వేసిన ఓట్లతో గెలవగానే మన పని పూర్తికాదని చెప్పారు. ఏ నమ్మకంతోనైతే వారు మనల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపై ఉందని అన్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక, పౌరసర ఫరాల శాఖ మంత్రిగా కుర్చీలో కూర్చున్నానంటే కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానమేనని అన్నారు. అందుకే గత 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ ఐదేళ్లలోనే చేసిచూపిస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయాన్ని మంజూరు చేయిస్తానని అన్నారు. అభివృద్ధి చేయకుంటే 2019లో ఓట్ల కోసం రానని మంత్రి తెలిపారు. గతంలో వలె అభివృద్ధి కోసం దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చే పరిస్థితి కాదన్నారు. మన డబ్బులను మన సంక్షేమం కోసమే ఖర్చు చేసుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో నిధులకు కొదవ లేదని వివరించారు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం తాను సేవలందించాల్సి ఉన్నందున, నియోజకవర్గంలో ఉన్న చిన్నచిన్న సమస్యలను కూడా తన మెడకు చుట్టడం సమంజసం కాదన్నారు. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపంచాయతీ చైర్మన్లు తమ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నిధుల విషయంలో తనను సంప్రదించాలని కోరారు. అధికార పార్టీలోనే ఉన్నామని, ఏంచేసినా చెల్లుతుందనే భావనను తొలగించుకోవాలన్నారు.ప్రతిపక్షాలు, విమర్శకుల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, చెట్టి శ్రీనివాస్, బర్మావత్ యాదగిరి, ఎంపటి రాధిక, అపరాజ ముత్యంరాజు, ప్రతాప తిరుమల్‌రెడ్డి, మోటపోతుల పద్మ, చింత శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, గందె రాధిక, మంద ఉమాదేవి, కొయ్యడ కమలాకర్‌గౌడ్, పోరెడ్డి రజిత, రాజేశ్వరి, ముక్క రమేశ్, సురేశ్, వెన్నంపల్లి కిషన్ పాల్గొన్నారు.