గోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం: కేసీఆర్
హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్, 13 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు శనివారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి గిరిజన తండాలు, ఆదివాసి గూడెంలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విభజన ముందు ఖమ్మం జిల్లాలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లా రాజకీయాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు.