సాక్షి, ఆర్మూర్: కాశ్మీర్–కన్యాకుమారిని కలిపే 44వ జాతీయ రహదారి, నిజామాబాద్–జగదల్‌పూర్ వరకు గల 63వ జాతీయ రహదారుల కూడలిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాకు ఆయువు పట్టుగా ఉంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఆర్మూర్ ప్రాంతంలో ఇటీవల పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే మార్గంలో భాగంగా రైల్వే స్టేషన్ సైతం ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగుతోంది. వ్యవసాయమే కాదు రాజకీయ చైతన్యం కూడా ఇక్కడ అధికంగానే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఆర్మూర్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గం అభివృద్ధికి మునుపెన్నడూ మంజూరు కానన్ని నిధులు మంజూరు చేయించారు.
చేపట్టిన పనులు..
అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ ముందుంది. హేమాహేమీలైన నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గణాంకాల ప్రకారం రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు దశాబ్దాల నుంచి నెరవేరని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలను పూర్తి చేయించారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, ఆలూర్ బైపాస్‌రోడ్డు, నందిపేట బైపాస్ రోడ్డు, నందిపేట మండలం ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రజ లతాగునీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ పనులు చేపట్టడం ఆయన హయాంలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చాకచక్యంగా నిధులు రాబట్టుకుంటూ జీవోల జీవన్‌రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు.
పరిష్కారం కాని సమస్యలు
ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన భూనిర్వాసితులకు సమైక్య పాలనలో అందాల్సిన నష్ట పరిహారం పూర్తిగా అందలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా వీరి సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశపడ్డ బాధితులకు మొండి చేయే ఎదురవుతోంది. మరో వైపు నియోజకవర్గం పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు కేటాయించినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు.
నియోజకవర్గ స్వరూపం..
ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలతో 1952కు పూర్వమే ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009 నియోజకవర్గ పునర్విభజన కంటే ముందు ఆర్మూర్ నియోజకవర్గంలో 12 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజనలో ఆర్మూర్ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్మూర్ మండలంతో పాటు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలం, డిచ్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలాలను కలిపి ఆర్మూర్ నియోజకవర్గంగా మార్చారు. ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు కేవలం మూడు మండలాలతో జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గంగా ఆర్మూర్ రూపాంతరం చెందింది. భౌగోళికంగా మూడు మండలాలు పక్కపక్కనే ఉన్నా మూడు మండలాల గ్రామాలను కలుపుతూ అనువైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఈ నియోజకవర్గం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. మండలంలోని సుర్భిర్యాల్, కోమన్‌పల్లి, మగ్గిడి, ఖానాపూర్, అమ్దాపూర్, మంథని, దేగాం, ఆలూర్, మచ్చర్ల, మిర్ధాపల్లి, రాంపూర్‌లతో పాటు నందిపేట్ మండలంలోని నందిపేట్, అయిలాపూర్, వెల్మల్, కమ్‌ఠం, ఆంధ్రనగర్‌తో పాటు శివారు గ్రామాలు రైతు ఫారం, ఎన్‌టీఆర్ నగర్, జోదిపేట్, ఇంద్రనగర్, వెంకటేశ్వర కాలనీలు డిచ్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఉండేవి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఒకే విధంగా ఉండేది కాదు. నియోజకవర్గ పునర్విభజనలో మూడు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలను పూర్తి స్థాయిలో ఏకం చేయడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు
వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన రైతు కుటుంబం వెంకట రాజన్న, రాజబాయి దంపతుల పెద్ద కుమారుడైన ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ చదివారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన చదువును కొనసాగిస్తూ ఇటీవల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు సైతం రాశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తన మేనమామ, మాజీ ఎంపీపీ యాల్ల రాములు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితంగా ఉంటూ 2001 నుంచి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. 2008 నాటి ఎర్రజొన్నల ఉద్యమంలో ఆయన ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతులకు రావాల్సిన రూ.11 కోట్ల బకాయిలను ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు సైతం పెద్దపీఠ వేస్తున్నారు.
2014 పోల్ గ్రాఫ్
మొత్తం ఓటర్లు | 1,82,790 |
పోలైన ఓట్లు | 1,34,575 |
జీవన్‌రెడ్డి | 66,712 |
సురేశ్‌రెడ్డి | 53,251 |
మెజారిటీ | 13,461 |
2018 ఓటర్ల జాబితా..
మొత్తం ఓటర్లు | 1,70,732 |
పురుషులు | 80,325 |
మహిళలు | 90,402 |
ఇతరులు | 5 |
పోలింగ్ కేంద్రాలు | 211 |
ప్రభావితం చేసే కులాలు: మున్నూరుకాపు, ఖత్రి, గురడి కాపు, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు
Comments
Please login to add a commentAdd a comment