అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి: ఎంపీ కవిత | bless to TRS we give development in telangana | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి: ఎంపీ కవిత

Published Thu, Dec 6 2018 4:28 PM | Last Updated on Thu, Dec 6 2018 4:29 PM

bless to TRS we give development in telangana  - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం తో పాటు జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశామని, జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మరోమారు ఆశీర్వదించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.  చేసిన పనులను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించామని, తిరిగి అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ పథకాలను కూడా చెప్పామని అన్నారు. 2014 ఎన్నికల మాదిరిగానే జిల్లాలో తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తాతో కలి సి కవిత మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆసరా పెన్షన్‌ అర్హతను 58 ఏళ్లకు కుదించుతామని, పింఛను మొత్తాన్ని రూ.2016కు పెం చుతామని అన్నారు. 2018 వరకు పీఎఫ్‌ కార్డున్న బీడీ కార్మికులందరికి పింఛన్లు ఇస్తామన్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రైతుబంధు పథకం కింద ఇచ్చే మొత్తా న్ని రూ.10 వేలకు పెంచుతామని, ఎస్సీ, ఎస్టీలకు రూ.రెండు లక్షల మొత్తాన్ని వివిధ సబ్సిడీల కింద అందజేస్తామన్నారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా బీసీలకు రుణాలు, రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు, మైనారిటీలకు రుణాలు వంటి పథకాలను వివరించారు.

కాళేశ్వరం నీళ్లు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కవిత పేర్కొన్నారు. తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఆలోచనను చంద్రబాబు విరమించుకోవాలని సూచించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని కవిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని విమర్శించారు. నగరంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలుగుతున్నారని పేర్కొన్నారు. 

సంక్షేమ పథకాలతో చేరువయ్యాం.. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకెంతో చేరువయ్యామని, ఆయా సంక్షేమ పథకాల వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లాలో 3.67 లక్షల మంది ఆసరా లబ్ధిదారులకు రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా రూ.39.55 కోట్లు అందచేశామని, ఈ నాలుగేళ్లలో సుమారు రూ.1,300 కోట్లు ఆసరా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద 26,962 మంది లబ్ధిపొందారని, రూ.176.46 కోట్లు అందజేశామన్నారు.

23 వేల మంది గొల్ల, కురుమ లబ్ధిదారులకు రూ.246.21 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశామని, 1.45 లక్షల మంది రైతులకు బీమా ప్రీమియం రూ.2,271 చొప్పున రూ.33.03 కోట్లు చెల్లించామని చెప్పారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గాల్లో ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ. 9.76 కోట్లు ప్రభుత్వమే చెల్లించిందన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు 4.70 లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. దీంతో 15,695 మంది రైతులు లబ్ధిపొందారని వివరించారు. రూ.43 వేల కోట్లు వెచ్చించి  6,661 మంది రైతుల వద్ద శనగలను కొనుగోలు చేశామని, రూ.17 కోట్లు విలువైన కందులు, రూ.1.61 కోట్ల విలువైన ఉలువలు కొనుగోలు చేయడం ద్వారా 1.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు.

రూ. 71.50 కోట్లతో గోదాములను నిర్మించి 1.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం పెంచామన్నారు. వేల్పూర్‌లో స్పైస్‌పార్క్‌ కోసం రూ.40 కోట్లు మంజూరు చేశామని, లక్కంపల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ కోసం రూ.109 కోట్లు, ఆర్మూర్‌లోని లెదర్‌ పార్క్‌ కోసం రూ.10 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రైతుల భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి మూడు లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని, 12,558 మంది మత్స్యకారులకు రూ.60 కోట్లతో వివిధ పథకాలను అమలు చేశామన్నారు. 14,225 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ.774.31 కోట్లు ఖర్చు చేశామన్నారు. 98,302 మంది కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రయోజనం పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.30.02 కోట్లు వెచ్చించిందని అన్నారు. 

రూ.541 కోట్లతో రైల్వేలైను పూర్తి.. 

నిజామాబాద్‌ – కరీంనగర్‌ – పెద్దపల్లి రైల్వేలైన్‌ కోసం రూ.541 కోట్లు మంజూరు చేయించి, పనులు పూర్తి చేశామని అన్నారు. విద్యారంగానికి రూ.896.27 కోట్లు, వైద్యం, ఆరోగ్య రంగాలకు రూ. 143.41 కోట్లు, ఆలయాల పునరుద్ధరణ కోసం రూ.20.24 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 101 ఈద్గాలు, మజీద్, శ్మశానాలు, 30 ఉర్దూ ఘర్, షాదీఖానాల కోసం రూ.13.88 కోట్లు వ్యయం చేశామన్నారు. క్రిస్టియన్‌ మైనారిటీలకు 79 చర్చిల ఆధునీకరణ, సౌకర్యాల కోసం రూ.7.89 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ. 353.56 కోట్లు, ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ.956.45 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.147.72 కోట్లు వెచ్చించామని అన్నారు. 9,478 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.56.92 కోట్లను అందజేశామని వివరించారు. విలేకరుల సమావేశంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి రంగానికి పెద్ద పీట

జిల్లాలో సాగునీటి రంగం అభివృద్ధి కోసం పలు పనులు చేపట్టామని కవిత వివరించారు. మిషన్‌ కాకతీయ, నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ఆధునీకరణ, అలీసాగర్, అర్గుల్, చౌట్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్, కాళేశ్వరం ప్యాకేజీ 21, ఎస్సారెస్సీ  పునరుజ్జీవన పథకం, ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనుల కోసం రూ.4,956 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.2,641 కోట్లు ఖర్చు చేశామని, 2.25 లక్షల మంది రైతులకు రూ.972.43 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.493.96 కోట్ల పెట్టుబడి సహాయం అందజేశామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, 192 గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణం కోసం రూ. 27.81కోట్లు ఖర్చు చేశామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం కొత్తగా 164 సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేశామని, ఇందుకోసం రూ.154.54 కోట్లు వెచ్చించామన్నారు.

నగరంలో ఐటీ హబ్‌.. 

నిజామాబాద్‌లో ఐటీ హబ్, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం రూ.35 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ఈ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. టీ–ప్రైడ్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలకు రూ.38.36 కోట్లు సబ్సిడీ అందించామని, టీఎస్‌ ఐ–పాస్‌ ద్వారా 292 పరిశ్రమలకు రూ.2,413 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. కొత్తగా 12,249 మందికి ఉపాధి లభించిందన్నారు. నిజాంషుగర్స్‌ రవాణా సబ్సిడీని 2.4 కోట్లను అందజేశామని, చెరుకు రైతులకు రూ. ఎనిమిది కోట్ల వ్యత్యాస ధరను ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరాభివృద్ధి కోసం రూ. 744 కోట్లు, బోధన్‌ పట్టణానికి రూ.63.55 కోట్లు, కొత్తగా ఏర్పడిన భీంగల్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేశారని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement