పెర్కిట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ కవిత
సాక్షి, పెర్కిట్(ఆర్మూర్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 60 సంవత్సారలలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం నేతృత్వంలో నాలుగున్నరేళ్లలో చేపట్టారని, దీంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచ్‌లు తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్మూర్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ఆర్మూర్ మండలం పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో కవిత ప్రసంగించారు. రాబోయే రోజుల్లో రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆయా సామాజికవర్గాల్లోని పేదలను ఆదుకుంటామన్నారు.
అలాగే, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వేయి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎలాంటి ఆధారం లేని ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వమే రూ.2 లక్షల రాయితీతో రుణాలను అందజేయనుందని చెప్పారు. మహిళా సంఘాలను సైతం పటిష్టం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పాలకులకు అప్పజెప్పడానికి కాంగ్రెస్, ఏపీ సీఎం చంద్రబాబుతో జత కట్టిందని విమర్శించారు. తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మళ్లీ మన రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నానడి, ఎన్నికల్లో మహాకూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు మధుశేఖర్, ఎల్‌ఎంబీ రాజేశ్వర్, కోటపాటి నర్సింహానాయుడు, రాజారాం యాదవ్, బెన్కి గంగా మోహన్, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన రాజారాం యాదవ్
ఆర్మూర్: కాంగ్రెస్ నాయకుడు రాజారాం యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో మంగళవారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన రాజారాం యాదవ్.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరడంతో ఆర్మూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దీంతో బీజేపీ, టీడీపీల పొత్తులో నాటి ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి, ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో రేవంత్‌రెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ ఆయనతో పాటే కాంగ్రెస్‌లో చేరాడు. కాంగ్రెస్, టీడీపీ జత కట్టిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపించారు. చివరకు ఎంపీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment