armur constituency
-
బెదిరింపుల రాజకీయం! సొంత పార్టీ వారిపైనే వేధింపుల పర్వం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజక వర్గంలో బెదిరింపుల రాజకీయం నడుస్తోంది!. సొంత పార్టీ వారిపైనే వేధింపుల పర్వం కొనసాగుతోంది. విపక్ష నాయకులను, కార్యకర్తలను బెదిరించడంతో పాటు ఆయా పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలవంతంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. తాజాగా సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులనే బెదిరింపులకు గురి చేస్తుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో వారు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగానే ఎమ్మెల్యేపై విరుచుకు పడుతున్నారు. జీవన్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. నిధులు తెచ్చుకోవడమే కారణమా? మాక్లూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్న ఆయన సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. మాక్లూర్ సొంత మండలం కావడంతో సహజంగానే ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు విఠల్‌రావుకు సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే, ప్రొటోకాల్ మేరకు ఆయన అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్‌లు హాజరవుతున్నారు. ఇది నచ్చని ఎమ్మెల్యే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ► ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాల పరిధిలోని నిజాంసాగర్ చివరి ఆయకట్టు వెయ్యి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మాదాపూర్ బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి ఎత్తిపోతల పథకం కోసం గతంలో ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను అడిగినప్పటికీ నిధులు మంజూరు చేయించలేదు. దీంతో శ్యాంరావు ఆధ్వర్యంలో పలువురు జెడ్పీ చైర్మన్‌ను ఆశ్రయించి రూ.5 లక్షల జెడ్పీ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద మరో రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకరించారు. దీంతో మండల ప్రజాపరిషత్ సమావేశంలో విఠల్‌రావును సన్మానించారు. మరోవైపు, కల్లెడ గ్రామంలోని పాఠశాలలో వంట గది నిర్మాణం కోసం టీఆర్ఎస్ నేత ప్రసాద్‌గౌడ్ జెడ్పీ చైర్మన్ ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే తమను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆయా గ్రామాల నాయకులు వాపోతున్నారు. ► ఇటీవల రైతుబంధు సంబురాల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమపై కేసులు పెట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కల్లెడ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు సమాచారం లేకుండా పంచాయతీకి చెందిన అన్ని ఫైళ్లను ఎంపీవో ద్వారా తీసుకెళ్లారు. ఇంకా మరికొందరు సర్పంచ్‌లను ఇదే విధంగా వేధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించాల్సి ఉండగా, సర్పంచ్ వేములపల్లి సుబ్బారావును ఎమ్మెల్యే బెదిరించడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని అక్కడి నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలను ఇప్పటివరకు భరించామని, ఇకపై సహించేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతున్నారు. బయట పడుతున్న వేధింపులు.. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనపై నేరుగా విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. వందల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఎలా సంపాదించావంటూ ప్రశ్నిస్తుండడం సామాన్యుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ పావని భర్త శ్యాంరావు ఇటీవల సోషల్ మీడియా వేదికగా జీవన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అదే మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్‌గౌడ్ కూడా ఎమ్మెల్యేపై విరుచుకు పడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో కమాండ్ చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వీరిలాగే మరికొందరు సర్పంచ్‌లు బహిరంగంగానే ఎమ్మెల్యే వేధింపుల గురించి వాపోతున్నారు. మరికొందరు లోలోన రగిలి పోతున్నారు. -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి.. ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, ఆర్మూర్: ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ హయాంలో అభివృద్ధి ఎంత వరకు సాధించారు? జవాబు: సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నాలుగున్నరేళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి? జ: వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు 52 వేల మంది లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో నెలకు ఐదు కోట్ల 91 లక్షల రూపాయల చొప్పున నాలుగున్నరేళ్లలో 250 కోట్లు చెల్లించాం. బీడీ కార్మికులకు జీవన భృతిని అందజేస్తున్నాం. 3,500 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో రూ.24 కోట్లు, 3,540 మంది యాదవులకు రూ.32 కోట్లతో గొర్రెలు పంపిణీ చేశాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? జ: మిషన్ కాకతీయలో భాగంగా 148 చెరువులకు రూ.51 కోట్లతో మరమ్మతులు చేపట్టి 14,350 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశాం. నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు రూ.38 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.15 కోట్లు, అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.105 కోట్లు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.148 కోట్లు, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.23 కోట్లు మంజూరు చేశాం. రూ.404 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ప్ర: ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలు ఏమిటి? జ: ఆర్మూర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పని చేస్తున్నా. అందులో భాగంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. ప్ర: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? జ: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాల్లోని ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకొని జరిగితే ప్రస్తుత ఎన్నికలు సంక్షేమ, అభివృద్ధి పథకాలే కేంద్రంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించనున్నాయి. నందిపేట మండలంలోని లక్కంపల్లి సెజ్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి రూ.109 కోట్లు, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ జాతీయ రహదారి అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు, లెదర్ పార్క్ అభివృద్ధికి రూ.పది కోట్లు మంజూరు చేయించాం. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 13 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించాం. 12,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాముల నిర్మాణానికి రూ.ఏడు కోట్లు, 40 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల నిర్మాణానికి రూ.117 కోట్లు, ఉమ్మెడ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి 144 కోట్లు, రూ.33 కోట్లతో సీసీ రోడ్లు, రూ.8.4 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాం. సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశాం. ఆలూర్, నందిపేట బైపాస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించా. -
అభివృద్ధి బాటలో ఆర్మూర్
సాక్షి, ఆర్మూర్: కాశ్మీర్–కన్యాకుమారిని కలిపే 44వ జాతీయ రహదారి, నిజామాబాద్–జగదల్పూర్ వరకు గల 63వ జాతీయ రహదారుల కూడలిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాకు ఆయువు పట్టుగా ఉంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఆర్మూర్ ప్రాంతంలో ఇటీవల పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే మార్గంలో భాగంగా రైల్వే స్టేషన్ సైతం ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగుతోంది. వ్యవసాయమే కాదు రాజకీయ చైతన్యం కూడా ఇక్కడ అధికంగానే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఆర్మూర్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గం అభివృద్ధికి మునుపెన్నడూ మంజూరు కానన్ని నిధులు మంజూరు చేయించారు. చేపట్టిన పనులు.. అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ ముందుంది. హేమాహేమీలైన నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గణాంకాల ప్రకారం రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు దశాబ్దాల నుంచి నెరవేరని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలను పూర్తి చేయించారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, ఆలూర్ బైపాస్‌రోడ్డు, నందిపేట బైపాస్ రోడ్డు, నందిపేట మండలం ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రజ లతాగునీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ పనులు చేపట్టడం ఆయన హయాంలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చాకచక్యంగా నిధులు రాబట్టుకుంటూ జీవోల జీవన్రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. పరిష్కారం కాని సమస్యలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన భూనిర్వాసితులకు సమైక్య పాలనలో అందాల్సిన నష్ట పరిహారం పూర్తిగా అందలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా వీరి సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశపడ్డ బాధితులకు మొండి చేయే ఎదురవుతోంది. మరో వైపు నియోజకవర్గం పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు కేటాయించినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గ స్వరూపం.. ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలతో 1952కు పూర్వమే ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009 నియోజకవర్గ పునర్విభజన కంటే ముందు ఆర్మూర్ నియోజకవర్గంలో 12 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజనలో ఆర్మూర్ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్మూర్ మండలంతో పాటు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలం, డిచ్పల్లి నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలాలను కలిపి ఆర్మూర్ నియోజకవర్గంగా మార్చారు. ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు కేవలం మూడు మండలాలతో జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గంగా ఆర్మూర్ రూపాంతరం చెందింది. భౌగోళికంగా మూడు మండలాలు పక్కపక్కనే ఉన్నా మూడు మండలాల గ్రామాలను కలుపుతూ అనువైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఈ నియోజకవర్గం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. మండలంలోని సుర్భిర్యాల్, కోమన్‌పల్లి, మగ్గిడి, ఖానాపూర్, అమ్దాపూర్, మంథని, దేగాం, ఆలూర్, మచ్చర్ల, మిర్ధాపల్లి, రాంపూర్లతో పాటు నందిపేట్ మండలంలోని నందిపేట్, అయిలాపూర్, వెల్మల్, కమ్ఠం, ఆంధ్రనగర్తో పాటు శివారు గ్రామాలు రైతు ఫారం, ఎన్టీఆర్ నగర్, జోదిపేట్, ఇంద్రనగర్, వెంకటేశ్వర కాలనీలు డిచ్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉండేవి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఒకే విధంగా ఉండేది కాదు. నియోజకవర్గ పునర్విభజనలో మూడు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలను పూర్తి స్థాయిలో ఏకం చేయడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన రైతు కుటుంబం వెంకట రాజన్న, రాజబాయి దంపతుల పెద్ద కుమారుడైన ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన చదువును కొనసాగిస్తూ ఇటీవల ఎల్ఎల్ఎం పరీక్షలు సైతం రాశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తన మేనమామ, మాజీ ఎంపీపీ యాల్ల రాములు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితంగా ఉంటూ 2001 నుంచి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. 2008 నాటి ఎర్రజొన్నల ఉద్యమంలో ఆయన ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతులకు రావాల్సిన రూ.11 కోట్ల బకాయిలను ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు సైతం పెద్దపీఠ వేస్తున్నారు. 2014 పోల్ గ్రాఫ్ మొత్తం ఓటర్లు 1,82,790 పోలైన ఓట్లు 1,34,575 జీవన్‌రెడ్డి 66,712 సురేశ్‌రెడ్డి 53,251 మెజారిటీ 13,461 2018 ఓటర్ల జాబితా.. మొత్తం ఓటర్లు 1,70,732 పురుషులు 80,325 మహిళలు 90,402 ఇతరులు 5 పోలింగ్ కేంద్రాలు 211 ప్రభావితం చేసే కులాలు: మున్నూరుకాపు, ఖత్రి, గురడి కాపు, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
సాక్షి, ఆర్మూర్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్‌కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్‌ను సృష్టించాలని వివిధ పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
తొలి రోజు ఒకటి
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు గాను తొలి రోజు ఆర్మూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియమించింది. ఈనెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన 20న ఉంటుంది. ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో 21న పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షల వరకు పరిమితి ఉంది. సాక్షి,నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తొలి ఘాట్టానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. సోమవారం ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల షెడ్యుల్‌ను అధికారికంగా విడుదల చేశారు. నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు గాను ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. ఆర్మూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులుకు ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మిగిలిన చోట్ల నామినేషన్లుదాఖలు కాలేవు. ఈనెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన 20న ఉంటుంది. ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో 21న పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలను డిసెం బర్ 11న ప్రకటిస్తారు. 19 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం తొమ్మిది నియోజవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియమించింది. ఈ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా.. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందుకో సం జిల్లాకు ఇద్దరు ఐఆర్ఎస్ ఉన్నతాధికా రులను అభ్యర్థుల వ్యయ పరిశీలకులుగా నియమించారు. ఆర్మూర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల వ్యయ పరిశీలకు లుగా 2002 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అ ధికారి జి.నంతకుమార్ నియమితులయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి షేక్ శంషేర్ అలం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బా ల్కొండ నియోజక వర్గాల వ్యయ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులు సోమవారం జిల్లాకు చే రుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావుతో సమావేశమయ్యారు. ఈ ఎన్నిక ల్లో అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షల పరిమి తి ఉంది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఈ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగనుంది. అభ్యర్థులు ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఈ ఖాతాల ద్వారానే ఖర్చు చేయడం, ఏ వస్తువులకు ఎంత ఖర్చు చేసేది, ర్యాలీలు, సభలు, వాహనాలు, రవాణా, ఫ్లెక్సీల ఖర్చు, స మావేశాలకు అయ్యే ఖర్చుల వివరాలపై నిఘా పెట్టనున్నారు. నేర చరిత్ర ఉన్న అ భ్యర్థులకు సంబంధించి అత్యధిక సర్క్యు లేషన్ కలిగిన వార్తా పత్రికలు, టీవి ఛానళ్ల లో ప్రకటించాల్సి ఉంటుందని, ఈ ప్రకట న ఖర్చును కూడా అభ్యర్థుల వ్యయంలో లెక్కించడం జరుగుతుందని అభ్యర్థులకు తెలిపామని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నా రు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి ఖర్చులు చేసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ప్రగతినగర్ : జిల్లాలో ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ పర్య టించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ తరుణ్‌జోషిలు సోమవారం ఏర్పాట్లను పరి శీలించారు. జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో ఉన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఇంటిని, విజయలక్ష్మి గార్డెన్ పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేయనున్నందున అందుకువసరమైన పనులకు సత్వరమే పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.అందుకు ఆర్ అండ్బీఅతిథి గృహాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి బస చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. అతిథి గృహంలో ఏర్పాట్లు చేయండి బాల్కొండ : ముఖ్యమంత్రి ఈనెల 7న రాత్రికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అతిథి గృహంలో బస చేసే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషితో కలిసి ఆయన ఎస్సారెస్పీ అతిథి గృహాన్ని పరిశీలించారు. వీఐపీ సూట్‌ను, ఇతర సూటులను పరిశీలించారు. ఏసీలు పని చేస్తున్నాయా లేదా అని ప్రాజెక్ట్ ఈఈ రామారావును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వీఐపీ బస చేయడానికి అతిథి గృహం అనువుగా ఉంటుందా.. లేదా అని ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతిథి గృహంలో ఉన్న పురాతన సోఫా సెట్లను తొలగించాలని సూచించారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. భద్రత దృష్ట్యా ఎస్పీ పోలీస్‌లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఎస్సారెస్పీలో బస చేసేది ఇం కా నిర్ణయం కాలేదన్నారు. అధికారులు మాత్రం సి ద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ యాది రెడ్డి, తహశీల్దర్ పండరీనాథ్, ఎంపీడీఓ కిషన్, ఆ ర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్న జావీద్భాయ్ మినీ స్టేడియాన్ని కలెక్టర్, ఎస్పీలు తనిఖీ చేశారు. సభాస్థలి ఏర్పాటు, మీడియా గ్యాలరీ, ప్రవేశమార్గాలు, ప్రజలు కూర్చునే స్థలాల గురించి ఆరా తీశారు. డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తహశీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ సునంద, ఆర్అండ్బీ ఎస్ఈ అంజయ్య, ఆర్ఐ రవీందర్‌తో తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. అంగడి బజార్లో వాహనాల పార్కిం గ్ను, బాలుర పాఠశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ సీఎం రోడ్డు మార్గం ద్వారా వస్తే ఆయా రహదారులలో మరమ్మత్తులు, ట్రాఫిక్ క్లియరెన్సు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం ప్రారంభించనున్న శిలాఫలకం, పైలాన్, కాకతీయ కళాతోరణ నిర్మాణ పనులను పరిశీలించారు. అంకాపూర్‌లో రైతులతో సీఎం ముఖాముఖి ఆర్మూర్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తరుణ్ జోషి సోమవారం పరిశీలించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని సీ ఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఖరారు చేశారు. దీంతో ఎస్పీ మండపా న్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే శారు. సభా స్థలి, రైతులు, అధికారులు, మీ డియా విభాగాలు కూర్చునేందుకు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రత చర్యలపై సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో పాటు వచ్చే వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. ముఖాముఖి సందర్భంగా గందరగోళం జరకుండా గ్రామస్తులను మాత్రమే అనుమతించాలన్నారు. వారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం వచ్చిపోయే మార్గంలో తీసుకునే చర్యలను గ్రామస్తులతో చర్చించారు. -
జిల్లాలో భారీగా పెరిగిన ఓటర్లు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: నూతన గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,53,288 గా నమోదైంది. మార్చి తొమ్మిది వరకు కొత్తగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను కలుపుకొని తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 48,523 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఫిబ్రవరిలో అధికారికంగా ఓటర్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 18,04,765గా నమోదైంది. ప్రస్తుతం కొత్త ఓటర్లతో సంఖ్య పెరిగిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 4,038 మంది, బోధన్ 4,289, జుక్కల్‌లో 3,083, బాన్సువాడలో 3,520, ఎల్లారెడ్డిలో 3,206, కామారెడ్డిలో 3,797, నిజామాబాద్ అర్బన్‌లో 14,511, నిజామాబాద్ రూరల్‌లో 7,189, బాల్కొండ నియోజకవర్గంలో 4,096 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.