మాది వజ్ర సంకల్పం
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకెళ్తాం.. కాంగ్రెస్‌ది శిఖండి పాత్ర.. విలన్ నంబర్ వన్
► అభివృద్ధిని అడ్డుకునేందుకే కేసులేస్తున్నారు
► ప్రతి పథకానికీ.. కార్యక్రమానికీ కేసులా?
► ఇప్పటికే 196 కేసులు.. లక్షలాది మంది ఉసురు పోసుకుంటున్నారు
► కేసులేస్తే ఓట్లు పడతాయా? వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా?
► ఇంతకాలం సీఎం హోదాలో గంభీరంగా ఉన్నా
► ఇక ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ వైఖరిని చౌరస్తాలో ఎండగడతా
► మళ్లీ పాత కేసీఆర్‌ను చూస్తారని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్
అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కేసుల పురాణం మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పిశాచిలా, భూతంలా తయారైందని నిప్పులు చెరిగారు. కొత్త రాష్ట్రాన్ని గొంతు నులిమేసేందుకు విషపూరిత వైఖరిని అవలంబిస్తోందని, తెలంగాణకు అప్పుడూ ఇప్పుడూ విలన్ నంబర్ వన్ కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. కేసుల రూపంలో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ఆ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను అభ్యుదయ రాష్ట్రంగా మార్చే దృష్టి నుంచి తమను మరల్చలేరని.. ఉక్కు, వజ్ర సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం వల్లే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టులతోపాటు వివిధ కార్యక్రమాలపై 196 కేసులు వేశారని చెప్పారు. ఒక జాతీయ పార్టీ ఇంత దివాలాకోరు రాజకీయం చేయటమేంటని ప్రశ్నించారు. ‘సాగునీరు, తాగునీరు, కరెంటు, అర్ధాకలితో అలమటించే కాంట్రాక్టు కార్మికుల పొట్ట నింపే కార్యక్రమాలను సైతం చిల్లర మల్లర రాజకీయాలకు వాడుకుంటారా? పనికిమాలిన రాజకీయ లబ్ధికి వాడుకుంటారా? ఇంత నీచాతినీచంగా దిగజారిందా మీ పార్టీ..’అని ప్రశ్నించారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఫలితాలు, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు.. వేటినీ వదలకుండా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందంటే.. తెల్లారే పిల్ వేయాలనే దుర్మార్గ సంస్కృతిని అనుసరిస్తోందన్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తూ పిల్ వేసి వారి ఉసురుపోసుకునే రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఇంతకాలం సీఎం హోదాలో ఉన్నందున గంభీరంగా వ్యవహరించానని, ఇకపై ఊరుకునేది లేదని.. త్వరలోనే రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజల మధ్యలో చౌరస్తాలో ఎండగడతానని, మళ్లీ పాత కేసీఆర్‌ను చూస్తారని అన్నారు. ప్రజలే వారికి సరైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
రెగ్యులరైజేషన్ కాదు.. అబ్జార్‌ప్షన్
వాస్తవానికి మేం కాంట్రాక్టు విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయలేదు. సంస్థలో విలీనం చేసుకున్నం. రాత్రనక, పగలనక కష్టపడే విద్యుత్ సిబ్బందిని గురించి కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా కోర్టు మానవతా దృక్పథంతో వ్యవహరించింది. కోర్టు స్ఫూర్తిని అభినందిస్తున్నా. వారికి గౌరవమైన వేతనం ఇవ్వమని చెప్పింది. దోపిడీ వ్యవస్థ కాంట్రాక్టర్లు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పటివరకు సంస్థ వీరికి నేరుగా జీతాలు చెల్లించలేదు. కాంట్రాక్టర్లు 15 శాతం కమీషన్ తీసుకొని.. నిర్బంధంగా ఉద్యోగుల జీతాల్లోనూ కోత పెట్టి దోపిడీకి గురి చేశారు. ఇప్పుడు ఆర్టిజాన్ పేరుతో విద్యుత్ సంస్థలే వీరికి జీతాలు చెల్లిస్తాయి. విద్యుత్ సంస్థల్లో రాత్రింబవళ్లు కష్టపడి కాంట్రాక్టర్ల దోపిడీ కింద నలిగిపోతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలోకి తీసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని న్యాయస్థానం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. స్కిల్డ్ విద్యుత్ సిబ్బందికి రూ.21,784 ఇవ్వాలని బోర్డు ప్రతిపాదిస్తే.. హైకోర్టు రూ.22 వేలు ఇవ్వాలని సూచించింది.
ఇలాగే అన్ని కేటగిరీలకు హైకోర్టు చేసిన సూచనలను గౌరవించి.. అంతకంటే ఒక రూ.వెయ్యి ఎక్కువే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేతనాల పెంపుతో విద్యుత్ సంస్థలపై రూ.28.70 కోట్ల అదనపు భారం పడుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం కుదరదని గతంలో ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందుకే రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి గౌరవిస్తాం. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరించి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
వాళ్లకు ఏ శిక్ష వేయాలో ప్రజలు ఆలోచించాలి
కాంగ్రెస్ చేస్తున్న ఈ దివాళాకోరు రాజకీయాల వల్ల రాష్ట్రంలో లక్ష కుటుంబాల వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు అయితే ఏకంగా గాంధీభవన్ ముందే ధర్నాలు చేశారు. అయినా బుద్ధి మార్చుకోకుండా కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నరు. మేం లక్ష కుటుంబాలకు మంచి చేస్తే రాజకీయ నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. హోంగార్డులను కూడా త్వరలోనే జనహితకు పిలిపించి మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తా. కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలో ఆ లక్ష కుటుంబాలు ఆలోచించాలి. కాంట్రాక్టు ఉద్యోగుల కడుపు నింపుతం. రెగ్యులరైజ్ చేస్తే కోర్టులు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నం. అన్ని శాఖలను సమీక్షించి ఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులున్నరో లెక్కగట్టి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తాం. విద్యుత్ ఉద్యోగుల విషయంలో కోర్టు తుది తీర్పు తర్వాత ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రధాన వాటాదారుగా ఉన్న కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. చట్టాలను పరిశీలిస్తున్నం.
న్యాయమూర్తులు కూడా చీవాట్లు పెట్టారు..
కష్టపడి 15, 16 ఏళ్లు అనేక అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలను భరించి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి తెలంగాణ సాధించున్నం. అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఆశాభంగానికి గురైన కాంగ్రెస్ నేతలకు టీఆర్‌ఎస్ చేపడుతున్న పటిష్ట కార్యక్రమాలు, ప్రజాప్రయోజన కార్యక్రమాలు నచ్చడం లేదు. అర్ధాకలితో అల్లాడుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల మా సానుకూల వైఖరిపై వారికి కన్నుకుట్టి, పుట్టగతులు లేకుండా పోతాయనే దుగ్దతో కేసులు వేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 196 కేసులు వేశారు. ఒక్క సాగునీటి రంగంపైనే 164 కేసులు వేశారు. ప్రభుత్వం ఉత్తర్వులు తీయాలె.. కాంగ్రెస్ పార్టీ కేసులు వేయాలె.. అనే రీతిలో సాగుతోంది. కాంగ్రెస్‌ది దివాళాకోరు రాజకీయ విధానం. సానుకూల వైఖరి లేకుండా కేవలం చిల్లర మల్లర రాజకీయాల కోసం నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలిస్తే కేసులు, సింగరేణి డిపెండెంట్ల మీద కేసులు, మిషన్ భగీరథ మీద కేసులు, హైదరాబాద్ అభివృద్ధి మీద కేసులు.. ఇలా అన్నీ కాంగ్రెస్ వాళ్లే వేస్తున్నారు.
20 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరు కేసులు వేశారు. అన్నీ వీగిపోయాయి. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయమూర్తులు కూడా చీవాట్లు పెట్టారు. బహిరంగంగా కామెంట్లు చేశారు. దీంతో ఏమీ చేయలేక గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రాజెక్టులపై కేసులేస్తే ఓట్లు పడుతాయా..? వీళ్లు తెలంగాణ బిడ్డలేనా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీళ్లు కావాలంటే ఎంత ఆరాటం కావాలె. వాస్తవానికి హోంగార్డులను కూడా రెగ్యులరైజ్ చేయాలనుకున్నం. కానీ, కాంగ్రెస్ వాళ్లు సింగరేణి డిపెండెంట్లపై కోర్టుకెళ్లంగనే మేం ఆలోచనలో పడ్డం.
మీ మొహానికి ఎప్పుడన్న అంత పరిహారం ఇచ్చిండ్రా?
జూన్‌కల్లా కాళేశ్వరం నుంచి నీళ్లిస్తమంటే కాంగ్రెసోళ్ల గుండెలు అవిసిపోతున్నాయి. కాళ్ల కింద భూమి కదులుతోంది. అందుకే 119 కేసులు వేసిండ్రు. మీ మొహానికి ఎప్పుడైనా ఎకరానికి రూ.6 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు పరిహారం ఇచ్చిండ్రా? నిర్వాసితుల ఇళ్లకు రూ.5.04 లక్షలు ఇచ్చిండ్రా? ఏదో 75 వేలు ఇచ్చి, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకునేటోళ్లు వాళ్లు. జీవో నం.123 మీద కూడా కేసు వేసిండు. చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందినా మళ్లీ కేసు వేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొండపోచమ్మ సాగర్ ఉంది. దానికి 4,400 ఎకరాల భూమి అవసరం. అయితే ఈ సాగర్ నిర్మిస్తే మునిగిపోయే గ్రామాలు నా గజ్వేల్ నియోజకవర్గంలోకే వస్తాయి. నేను వాళ్లను పిలిపించి మాట్లాడితే నాపై గౌరవంతో వాళ్లు ఒప్పుకొని 4,200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఇంకో 200 ఎకరాలు కాంగ్రెసోళ్లవే ఉన్నవి. వాళ్ల కార్యకర్తలు, ఆఫీసు బేరర్లు, ఎంపీపీలే ఉన్నరు. వాళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నరు. మీదీ ఓ రాజకీయ పార్టీనేనా? ఇంత దివాళా తీసిండ్రా? ఇంత భ్రష్టు పట్టిండ్రా?
ఇసుకపై పదేళ్లలో రూ.50 కోట్ల ఆదాయం తేలేదు..
అంత అసహనం ఎందుకు? చొక్కా చించుకోవడం ఎందుకు? చాలా టైం ఉంది కదా? ఎప్పుడో 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు? అంత మిడిసిపాటు, అంత కథ ఎందుకు? మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. సిగ్గు లేకుండా అన్ని పార్టీలను, సమైక్యవాద పార్టీలను కూడా కలుపుకుని అచ్చంపేటలో మహాకూటమి పెట్టిండ్రు. ఏమయింది. 20కి 20 కౌన్సిలర్లు టీఆర్‌ఎస్సే గెలిచింది. సిద్ధాంతాల్లేవు, సిగ్గుల్లేవు. పాలేరులో కూడా అట్టనే చేసిండ్రు. మా తుమ్మల నాగేశ్వరరావు 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిండు. ప్రజలు ఇంత చేస్తున్నా మీకు అర్థం కావట్లేదా? మాట్లాడేటప్పుడు సిగ్గుండాలె. పదేళ్లలో ఇసుకపై రూ.50 కోట్లు ఆదాయం తేలే. మాడేళల్లో రూ.వెయ్యి కోట్లు తెచ్చిన మా గురించి మాట్లాడతరా? ఇసుకపై రూ.1000 కోట్ల ఆదాయం తేవచ్చని మీ జీవితంలో ఊహించిండ్రా? కుక్కలు నక్కలు తిన్నట్టు తిన్నరు. అడ్డం, పొడుగు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల కోసం జేసీబీలు తవ్వుతుంటే వాళ్లకి గుండెలు తవ్వినట్టుంది. అందుకే ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నరు.
కరెంటు వద్దని ధర్నాలు చేస్తున్నరు
తెలంగాణకు గత 30 ఏళ్లుగా కరెంటు ఘోష ఏంటో తెలుసు. కరెంటు ఇయ్యకపోతే ధర్నాలు చేసినం. ఇప్పుడు 24 గంటలు కరెంటు వద్దని కూడా ధర్నాలు చేయడం చూస్తున్నం. అద్భుతం జరుగుతుంటే కళ్లు బైర్లు కమ్మి, ఏం చేయాలో అర్థం కాక చావు తెలివితో వ్యవహరిస్తున్నరు. దేశంలో ఇలాంటి అసహన వైఖరి ఎక్కడా లేదు. రాష్ట్రాన్ని అభ్యుదయ మార్గంలో తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని ఆపలేరు. ఇవి రాజకీయాలు కావు. ఒక్క ఎన్నిక గెలిచిండ్రా? మీ శాసనసభ్యుడు చనిపోయిన దగ్గర్నే మీరు గెలవలేదు. అందుకే పిచ్చివాళ్లయ్యారు. ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులు చిన్న బుచ్చుకోవద్దు
ఇప్పుడు రాష్ట్రంలో 9,326 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 6 వేల మెగావాట్ల డిమాండ్ ఉండేది. డిమాండ్ ఎంత పెరిగినా కరెంటోళ్లు కష్టపడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నరు. అందుకే వాళ్లకు మంచి చేయాలనుకున్నం. కానీ కాంగ్రెసోళ్లు అడ్డుకుంటున్నరు. అయినా మా బిడ్డల్లాగా కాపాడుకుంటం. మీరు మనసు చిన్నబుచ్చుకోకండి. ఇట్ల చేస్తే గెలవరు మీరు. గెలుపుకి సమీపంలోకి కూడా రారు. ఉన్న సీట్లు కూడా పోతయి. దీన్ని రాజకీయం అనరు. కిరికిరి అంటరు. మీరు ఏం చేసినా, మా పని ఆపలేరు. కొంత ఆలస్యం కలిగించగలరు తప్ప. మీరున్నప్పుడు ఏం జరిగిందో, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు స్పష్టంగా అర్థమయింది. ఇప్పటికైనా నిర్మాణాత్మక వైఖరితో వెళ్లండి.
నేరేళ్ల ఘటన అనుకోకుండా జరిగింది
దళితులను కొట్టమని ఏ ప్రభుత్వమైనా చెప్తదా? కేసీఆర్ ప్రభుత్వం అసలు చెప్తదా? అక్కడ దాష్టీకం. తొమ్మిదో పదో లారీలు తగలబెట్టిండ్రు. మా ఇష్టమొచ్చినట్టు చేస్తమన్నా చూస్తూ ఊరుకోవాల్నా? దళితులమని వాళ్లకేమైనా బోర్డులుంటయా? అనుకోకుండా జరిగిన సంఘటన అది. 10 మంది నిందితుల్లో ముగ్గురో నలుగురో దళితులున్నరు. దళితవాడపై పడి దాడి చేస్తే అనుకోవాలి. అయినా జరగకుండా ఉండాల్సింది. మీరాకుమార్ అయితే అందీ.. గీరాకుమార్ అయితే ఏంది? అమెకు ఇప్పుడంతా బొగ్గు తెలంగాణనే కనబడ్తది. ఆమెకు ఓట్లు పడితే బంగారు తెలంగాణ కనిపించేది.
జైరాం ఎన్నడన్నా సర్పంచ్‌గా గెలిచిండా?
పోలీసు వాహనాల కొనుగోలుపై జైరాం రమేశ్ చేసిన ఆరోపణలు ఇంత ఈడియాటిక్‌గా ఉంటాయా? ఒక్క డాక్యుమెంట్, ఒక్క సాక్ష్యం చూపెట్టిండ్రా? జైరాంరమేశ్ జీవితంలో ఎప్పుడయినా సర్పంచ్‌గా గెలిచిండా? ఆధారాలు లేకుంటే ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తావా?
డ్రగ్స్‌పై దిగ్విజయ్ కూతలు
డ్రగ్స్‌పై దిగ్విజయ్ సింగ్ జ్ఞానం, అర్థం, పర్థం లేకుండా మాట్లాడుతున్నరు. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. కల్తీ విత్తనాల మీద దృష్టి పెట్టాలని చెపితే పోలీసులు జరిపిన విచారణలో కల్తీ కారంపొడులు కూడా బయటపడినయ్. అట్లనే ముందుకెళ్తే ఈ డ్రగ్స్ బయటపడ్డయ్. వాస్తవానికి ఎన్‌సీబీ జాబితాలో మన రాష్ట్రం లేదు. హైదరాబాద్ లేదు. పంజాబ్, యూపీ, రాజస్థాన్‌లతో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ. అయినా, ఈ పబ్బులు, గబ్బులు తెచ్చింది కూడా కాంగ్రెస్సే. డ్రగ్స్ వ్యవహారాన్ని మొగ్గ దశలోనే తుంచాలని చెప్పా. అయినా ప్రభుత్వానికి సంబంధముందని దిగ్విజయ్ మాట్లాడిండు. ఆయనకేమైనా సంబంధం ఉండి బయటపడుతుందని భయపడి మాట్లాడిండేమో? ఎవరో బాహుబలి కోసం ఎదురుచూస్తున్నమని చెప్పినప్పుడే మీకు చేత కాదని ఒప్పుకున్నట్టు అయింది.