ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టిసారించాలి
Published Sun, Jul 12 2015 8:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
నెల్లూరు టౌన్: ఆర్టీసీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని, సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు మంత్రుల ఉపసంఘంతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన ఈయూ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీని పరిపాలనాపరంగా రెండుగా విభజించినందున కార్మికసంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్ కమిషనర్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 240 రోజులు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఒప్పందం ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు, అప్పులకు కార్మికులు బాధ్యులు కారని, ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోజురోజుకు నష్టాల్లోకి పోతున్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈడీని యూనియన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో13 జిల్లాలకు చెందిన యూనియన్ నాయుకులు పాల్గొన్నారు.
Advertisement