సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్‌ల పునరభివృద్ధి అంశం మరోసారి వెనక్కి వెళ్లింది. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు సరికదా కనీసం ఆసక్తి కూడా చూపకపోవడం గమనార్హం. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లను విమానాశ్రయం తరహాలో పునరభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా నానుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌ఎస్‌డీసీ) రెండుసార్లు, గతంలో దక్షిణమధ్య రైల్వే రెండుసార్లు ఇన్వెస్టర్‌లను ఆహ్వానించాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు.
మొదట్లో కొన్ని కన్సార్టియంలు ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ బిడ్డింగ్ దశలో వెనుకంజ వేశాయి. ఇటీవల ఐఆర్‌ఎస్‌డీసీ మరోసారి బిడ్డింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఇన్వెస్టర్లు, కన్సార్టీయంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు రైల్వేస్టేషన్‌ల పునరభివృద్ధిలో కూడా ఇలాంటి అనాసక్తి వ్యక్తం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లను పెండింగ్ జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు.
ఎందుకీ అనాసక్తి.
►రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్‌ల రీడెవలప్‌మెంట్ ముందుకు వచి్చంది. ఐఆర్‌ఎస్‌డీసీ సైతం అదే లక్ష్యంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్‌లను ‘డిజైనింగ్, బిల్డింగ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్’ అనే పద్ధతిలో ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు.
►దక్షిణమధ్య రైల్వేలో మొదటి దశలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్‌ల రీ డెవలప్‌మెంట్ ద్వారా పెట్టుబడి సంస్థలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం లభిస్తుంది. పైగా రైల్వే సొంతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదు.
►కింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లను 45 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత నిర్మాణాలతో సహా స్టేషన్‌లను రైల్వేకు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఈ లీజు కాలపరిమితికి బడా కన్సార్టియంలు విముఖతను వ్యక్తం చేశాయి. లీజు గడువును పెంచాలని కోరాయి. కానీ రైల్వేశాఖ అంగీకరించకపోవడంతో రీ డెవలప్‌మెంట్ వాయిదా పడింది.
ఇప్పుడు కోవిడ్...
►మొదట్లో లీజు గడువు తక్కువగా ఉందనే కారణంతో ఇన్వెస్టర్‌ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంచుమించు గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు.
►ఒక్క ఢిల్లీ రైల్వేస్టేషన్‌ల రీడెవలప్‌మెంట్ మాత్ర మే పట్టాలెక్కింది. మిగతా చోట్ల అటకెక్కింది.
►సాధారణంగా 7 నుంచి 12 మంది ఇన్వెస్టర్లు లేదా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తే అనూహ్యమైన స్పందన ఉన్నట్లుగా భావిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లకు 2 నుంచి 3 సంస్థల కంటే ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం.
మూడంచెల్లో నిర్మాణం...
ఐఆర్‌ఎస్‌డీసీ ప్రతిపాదించినట్లుగా స్టేషన్‌లను పునరభివృద్ధి చేస్తే ఇప్పుడు ఉన్న స్టేషన్‌కు ఏ మాత్రం విఘాతం కలగకుండా కింద మూడు వరుసల్లో పార్కింగ్, పైన మూడు వరుసల్లో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన డోమ్ ఆకారంలో పై కప్పు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది పూర్తిగా ఎయిర్‌పోర్టు తరహాలో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment