
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ
సంధ్య హత్య కేసులో స్నేహితుడే నిందితుడు
కాణిపాకంలో ఉరేసుకున్న కిరణ్
తిరుపతి క్రైం/ కాణిపాకం: ఫేస్బుక్ పరిచయం ఆ యువతికి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.. ఫేస్ బుక్ద్వారా పరియచమైన యువకుడు ఓ యువతిని దారుణంగా హత్య చేసి చివరకు భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు .. రెండు రోజుల క్రితం నగరంలోని దొడ్డాపురం వీధిలో ఏన్న ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో దారుణ హత్యకు గురైన సంధ్య కేసులో అనుమానితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాణిపాకంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభాష్‌నగర్‌కు చెందిన దొరసామిరెడ్డి లీలావతి దంపతుల కుమార్తె సంధ్య(19) దొడ్డాపురం వీధిలోని డెంటల్ ఆస్పత్రిలో హత్యకు గురైంది. ఆమె మెడకు చున్నీ వేసి హత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం డెంటల్ ఆసుపత్రి డాక్టర్ కె.వి కిశోర్ కుమార్‌రెడ్డి క్లినిక్ వచ్చి చూడగా లోపల సంధ్య మృతదేహం పడివుంది. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు ఘటనను పరిశీలించి హత్య కేసును నమోదు చేశారు.
ఫేస్ బుక్‌లో పరిచయమైన కిరణ్‌కుమార్‌రెడ్డి
కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపురం జిల్లా గుడిబల్ల తాలూకా ఎల్లోడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, సునందమ్మ దంపతుల కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి(25) బెంగళూరులో మెడికల్ రెప్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ద్వారా సంధ్య(19)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు మార్చుకునే స్థారుుకి పెరిగింది. కొద్ది రోజులకు కిరణ్ కుమార్‌రెడ్డి తిరుపతి వచ్చి సంధ్యతో నేరుగా మాట్లాడి వెళ్లేవాడు. ఇలా తరచూ బెంగళూరు నుంచి నగరానికి వచ్చి ఆమెతో గడిపేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం సంధ్య పనిచేస్తున్న దంతవైద్య శాలకు ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చి తాగారు. అనంతరం సంధ్య క్యారేజీ కొంత తిని బాగానే గడిపారు. ఇంతలో ఏమైందో ఏమో గాని సంధ్యను ఆమె చున్నీతోనే బిగించి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. మరుసటి రోజు సంధ్య దారుణ హత్యకు గురైనట్లు హత్య కేసులో కీలక నిందితుడు కిరణ్‌కుమార్‌రెడ్డిగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డారుు. దీన్ని చూసి భయాందోళనకు గురై గురువారం తన ద్విచక్ర వాహనంలో బెంగళూరు నుంచి పాకాలకు ఉదయం 10 గంటలకు చేరుకున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం ఉదయం 10 గంటలకు లాడ్జి వాళ్లతో మాట్లాడాడు.
ఉదయం 10 గంటలకు లాడ్జి ఖాళీ చేయాల్సివుండడంతో లాడ్జి సిబ్బంది రూము తలుపులు తట్టినా కూడా తీయలేదు. కిటికీలోనుంచి చూడగా లోపల కిరణ్ కుమార్‌రెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. అతని చిరునామా తెలుసుకుని, అలానే తిరుపతి సంధ్య హత్య కేసులో నిందితునిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాంకిశోర్ పరిశీలించి మృతుడు కిరణ్‌కుమార్ రెడ్డిగా గుర్తించారు. ఫేస్బుక్లో ఇద్దరికి సంబంధించిన ఫొటోలు అందుబాటులో ఉండడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. పెళ్లికి సంధ్య నిరాకరించడంతోనే హత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాణిపాకం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.