పెళ్లి ఆపిన ఫేక్ కాల్
హసన్‌పర్తి(వరంగల్ జిల్లా): వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి.. బంధు మిత్రుల రాకతో అంతా కోలాహలం.. ఆదివారం ఉదయం 11.24 గంటలకు ముహూర్తం. శనివారం రాత్రి 10 గంటలకు వరుడికి ఫోన్ కాల్. 'నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి అంతకు ముందు మరో యువకుడిని ప్రేమించింది' అనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. ఇంకేముంది వరుడు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి జరగదనే సమాచారం వధువు ఇంటికి చేరవేశాడు.
దీంతో పెళ్లి ఆగిపోయింది. నగరంలోని నయీంనగర్‌కు చెందిన కోలా రఘు పరకాల డివిజన్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం హసన్‌పర్తికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈనెల 27న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కట్నకానుకల కింద వరుడికి రూ.20 లక్షల నగదుతో పాటు ఇతర లాంచనాలు ఇచ్చారు. ఏకైక కూతురు కావడంతో పెళ్లి ఘనంగా నిర్వహించాలనుకున్న వధువు తల్లిదండ్రులు భీమారంలోని పొద్దుటూరి గార్డెన్‌లో వేదిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో.. తనకు వచ్చిన ఫోన్‌కాల్‌తో పెళ్లి చేసుకోబోనని పెళ్లి కుమారుడు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో ఎవరో కావాలనే ఈ పెళ్లిని ఆపాలని కుట్ర పన్నుతున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరుడి ఇంటి ముందు వధువు బంధువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. అయితే, అప్పటికే వరుడు పరారు కావడంతో బాధితులు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వరుడి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్ చేయగా 15 రోజులు గడువు ఇవ్వాలని, ఆ తర్వాత ఏ విషయం చెపుతామని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.