
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
♦ డిగ్రీ, పీజీ పట్టాలు తయారు చేసిన ఘనులు
♦ ప్రధాన నిందితుడు సహా నలుగురి అరెస్టు
కీసర: డిగ్రీ, పీజీతో పాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను కీసర పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌ఓటీ టీం సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సంఘటన కీసర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. విలేకరుల సమావేశంలో సీఐ గురువారెడ్డి, ఎస్‌ఐ అనంతచారి, ఎస్‌ఓటీ ఎస్‌ఐ రాములు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిరుమల్‌నగర్ మండలం ఈతూర్ గ్రామానికి చెందిన రాములు పీజీ వరకు చదువుకొని నగరంలోని తిలక్‌నగర్‌లో విద్యాధర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యూకేషన్‌తో పాటు ఏపీ స్టేట్ ఓపెన్ స్కూల్ పేరిట ఇన్‌స్టిట్యూట్‌లను నిర్వహిస్తున్నాడు.
2013లో యూపీలోని సోభిత్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ నుంచి వన్ సిట్టింగ్ డిగ్రీ ఎగ్జామ్ పేరిట అనుమతి తీసుకున్నట్లు పత్రాలు సృష్టించి పెద్దఎత్తున నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు గాలం వేశాడు. డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి పలువురి నుంచి రూ. 45 వేల చొప్పున ఫీజు తీసుకొని చేర్చుకున్నాడు. అభ్యర్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ, ఎస్‌కేడీ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ, షోబిత్ యూనివర్సిటీఆఫ్ మీరట్ ఉత్తరప్రదేశ్ పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చాడు.
సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు కీసర మండలం నాగారం గ్రామంలోని వెస్ట్ గాంధీ నగర్‌లో రాములు నివసిస్తున్న ఇంటిపై బుధవారం మెరుపు దాడిచేశారు. వివిధ యూనివర్సిటీల పేరుతో ఉన్న 45 నకిలీ డీగ్రీ, పీజీ సర్టిఫికెట్లతోపాటు వివిధ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను, 7 సెల్‌ఫోన్లు, రూ. 30,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాములుతో పాటు, నకిలీ సర్టిఫికెట్ల తయారీలో అతడికి సహకరిస్తున్న కొప్పుల ప్రశాంత్, దేశం నాగరాజు, కృష్ణమోహన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాసభ్యులు వంశీకృష్ణ, అనంత క్షవీర్, మనోజ్‌కుమార్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలిం చినట్లు సీఐ గురువారెడ్డి పేర్కొ న్నారు.