
నిందితులు అమన్‌గుప్తా, చాంద్‌పాషా
హిమాయత్‌నగర్: ప్రముఖ యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సీఐ భీమ్‌రెడ్డి కథనం ప్రకారం...లక్నోకు చెందిన అర్పిత్‌జైన్ అదనపు డిగ్రీ కోసం ఎదురు చూసే విద్యార్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తుంటాడు.
అర్పిత్‌జైన్‌కు ఇంటర్నెట్ ద్వారా అమన్‌గుప్తా, కరీంనగర్ జిల్లాకు చెందిన చాంద్‌పాషా పరిచయం అయ్యారు. అతడితో ముఠా కట్టిన వీరిద్దరూ నగరంలో నకిలీ సర్టిఫికెట్ల విక్రయానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా అమన్‌గుప్తా, చాంద్‌పాషా కలిసి రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లో ‘ఇంటెలిజెంట్ మైండ్స్’ పేరిట స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. జాబ్ కోసం ఇంటర్నెట్‌లో దరఖాస్తు పెట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ చేస్తారు. అదనపు డిగ్రీ కావాలంటే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని చెప్తారు.
తమను కలిసిన వారికి బీఏ, బీకాం, ఎంకాం, ఎంసీఏ తదితర సర్టిఫికెట్లు మీకు నచ్చిన యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. పరీక్ష రాస్తే రూ.60 వేలు, రాయకపోతే రూ.70 వేలు అని చెప్పి.. ఆ మేరకు వసూలు చేస్తారు. అనంతరం వారి వివరాలు లక్నోలో ఉన్న అర్పిత్‌కు చేరవేస్తారు. అతడు వారు కోరిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్ ఖండ్, అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ తదితర వర్సిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాడు.
సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు మంగళవారం రాత్రి ‘ఇంటెలిజెంట్ మైండ్స్’ సంస్థపై దాడి చేయగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 10 సర్టిఫికెట్లు, బుందేల్‌ఖండ్ యూనివర్సిటీకి చెందిన మూడు సర్టిఫికెట్లు దొరికాయి. అమన్‌గుప్తా, చాంద్‌పాషాపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు అర్పిత్‌జైన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి చెప్పారు.