నకిలీ కరెన్సీ చలామణి ముఠా గుట్టురట్టు
– ఆరుగురు అరెస్టు - రూ.27.32 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
హిందూపురం అర్బన్: నకిలీ కరెన్సీ తయారుచేసి చలామణి చేసే ముఠా గుట్టు రట్టయ్యింది. ముఠాలోని ఆరుగురిని హిందూపురం పోలీసులు అరెçస్టు చేసి వారి వద్ద నుంచి రూ.27.32 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం çహిందూపురం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.
నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ఇలా...
బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన ముబారక్ పరిగిమండలం కొడిగేపల్లిలోని తన అక్కబావల వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. ఇతడికి బాపూజీనగర్‌లోని హెచ్.శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడింది. రైస్‌పుల్లింగ్ చేసి దెబ్బతిన్నానని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పాలని శ్రీనివాసులు కోరగా.. బెంగళూరులో ఏదైనా పని ఇస్తానని ముబారక్ చెప్పాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించడానికి వైఎన్ హోసకోటెకు చెందిన తనస్నేహితుడు సంగం శ్రీనివాసులుతో కలిసి దొంగనోట్లు చలామణి చేయాలని నిర్ణయించుకున్నట్లు ముబారక్ చెప్పగా, తనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానముందని తానూ భాగస్వామినవుతానని శ్రీనివాసులు కోరాడు. ఈ మేరకు అందరూ కలిసి హిందూపురంలో ఒక కంప్యూటర్ షాపులో అత్యాధునిక స్కానర్, ప్రింటర్ కొనుగోలు చేసి వాటిని వైఎన్ హోసకోటేలోని సంగం శ్రీనివాసులు ఇంటిలో నకిలీ నోట్లు తయారు చేయడం మొదలు పెట్టారు. మొదట రూ.40వేలు తయారుచేసి హిందూపురం, పాలసముద్రం, పెనుకొండ, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాల్లో చలామణి చేశారు. వీటిని ఎవరూ దొంగనొట్లుగా గుర్తించలేకపోవడంతో త్వరగా చలామణి అయిపోయింది. దీంతో ఇక భయంలేదని ఎంతమొత్తంలోనైనా చలామణి చేసేవచ్చు అని రూ. 100, రూ.500, రూ.2వేల నోట్లను తయారు చేశారు. ఇలా దాదాపు రూ.27లక్షలకు పైగా సిద్ధం చేశారు.
ముఠా సభ్యులు అలా దొరికిపోయారు..
పెద్ద ఎత్తున తయారుచేసిన నోట్ల మొత్తాన్ని అందరూ పంచుకుని చలామణికి సిద్ధమైపోయారు. ఇందులోభాగంగా హిందూపురంలోని నేతాజీ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ వి.ఈశ్వర్, రొద్దం మండలం తురకలాపల్లికి చెందిన హనుమంతరెడ్డితో పాటు రాజేష్‌కు రూ.4600 నోట్లు ఇచ్చి పంపించారు. అయితే రాజేష్ ఓ టీ స్టాల్ వద్ద దొరికిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో సీఐ రాజగోపాల్, ఎస్సైలు ఆంజినేయులు, జమాల్‌బాషా, శ్రీధర్, శరత్‌చంద్ర సిబ్బందితో నాలుగు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొడిగేపల్లి సమీపంలోని నాగులకట్ట వద్ద ఈ ముఠా ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. ఇందులో సంగం శ్రీనివాసులు వద్ద రూ.15.27 లక్షలు, ముబారక్ వద్ద రూ.4 లక్షలు, హెచ్.శ్రీనివాసులు వద్ద రూ.4 లక్షలు, వి.ఈశ్వర్ వద్ద రూ.2 లక్షలు, హనుమంతరెడ్డి వద్ద రూ.2 లక్షలు, రాజేష్ వద్ద రూ.4600 మొత్తం రూ.27,32,400 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రింటర్, స్కానర్, గ్లిట్టర్‌పెన్స్, నగదు ముద్రించిన కాగితాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.