
సంక్రాంతి సందడిలో నకిలీ కరెన్సీ చలామణి
జంగారెడ్డిగూడెం : నకిలీ కరెన్సీ ముఠాలు దానిని మార్చేందుకు కొత్తదారులు కనిపెడుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ మారుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠాలు చలామణి చేసే నకిలీ కరెన్సీ అసలు నోట్లను పోలి ఉండటంతో జనం గుర్తుపట్టలేకపోతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో నకిలీ కరెన్సీ ముఠాలు పేకాట, గుండాట నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ ముఠాలు తీసుకువచ్చిన నకిలీ నోట్లను పేకాట, గుండాట నిర్వాహకులకు అందజేస్తున్నారు. నెల క్రితమే వీటి నిర్వాహకులను గుర్తించి వారితో నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పేకాట, గుండాట నిర్వహిస్తారనేది గుర్తించి నకిలీ కరెన్సీ చలామణికి మార్గం సుగమం చేసుకున్నట్టు తెలిసింది. నాలుగైదు రోజు లుగా కొయ్యలగూడెం నుంచి ప్రతి రోజు లక్షలాది రూపాయల నకిలీ కరెన్సీ ఏజెన్సీ ప్రాంతానికి తరలుతోంది.
బుట్టాయగూడెం మండలంలో మారుమూల ప్రాంతమైన గుళ్లపూడిలో కోతాట (లోన బయట), గుండాట పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో ఒక రోజు వేసిన చోట మరొక రోజు పేకాట, గుండాట వేయరు. స్థలాలు మారుస్తూ అనుమానం రాకుండా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ప్రతి రో జు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వర కు నకిలీ కరెన్సీని తీసుకెళ్లి పేకాట, గుండా ట ఆడేందుకు వచ్చే వారికి ఆట ముసుగులో ఈ కరెన్సీని అంటగడుతున్నట్టు సమాచారం.
ఆటలో భాగంగా జూదరుల నుంచి అసలు కరెన్సీ తీసుకుని నిర్వాహకుల వద్ద ఉన్న నకిలీ కరెన్సీని వారికి ఇస్తున్నారు. పాకిస్తాన్‌లో ముద్రించిన ఈ నకిలీ కరెన్సీ ఒడిశా నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న ట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్చే ముఠాలపై పోలీసులు దాడి చేసి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.
ముంబై నుంచి కూడా ఈ ప్రాంతానికి నకిలీ నోట్లు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీలో అమాయకులను ఆసరాగా చేసుకుని పేకాట, గుండాటల్లో ఈ నకిలీ కరెన్సీ చలామణి చేసేస్తున్నారు. దీనిలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి పాత్రమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.