నకిలీ విత్తనాల పాపం ప్రభుత్వానిదే..
* కాంగ్రెస్ రైతు భరోసాయాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు
రఘువీరారెడ్డి మండిపాటు
మేడికొండూరు: రాష్ట్రంలో నకిలీ విత్తనాల కంపెనీల ద్రోహం కన్నా ప్రభుత్వ ద్రోహం ఎక్కువగా కనబడుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మండలంలో శనివారం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాయాత్ర నిర్వహించారు. సరిపూడి, వెలవర్తిపాడు గ్రామాల్లో నకిలీ విత్తనాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం సరిపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విత్తన చట్టం అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. విత్తన చట్టం పరిధిలోని కంపెనీలకు లైసెన్సులు ఇచ్చి రైతులనెత్తిన చేతులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. నకిలీ విత్తనాలు వేసిన కౌలు రైతులకు రూ.50 వేలు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించాలని కోరారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్‌వలి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు, పక్కాల సూరిబాబు, సుధాకర్‌బాబు, లింగిశెట్టి ఈశ్వరరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.