
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
నెల్లూరు(సెంట్రల్) ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి నారాయణ పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు మీద ఆశ పెట్టుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి దాదాపుగా 6,500 బోగస్ ఓట్లు తొలగించాక తిరిగి ఓటర్ల జాబితాలో దొంగ చిరునామాతో 2033 ఓట్లు ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణచైతన్య కళాశాల పేరుతో 255, నారాయణ మెడికల్ కళాశాల పేరుతో 365 ఓట్లు నమోదు అయ్యాయన్నారు.
ఒకరి పేరు మీద ఉండాల్సిన ఓట్లు వేరొకరి పేరుమీద ఉండడమే కాకుండా చిరునామా కూడా పూర్తిగా మార్చి ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాగాన్ని అడుగడుగునా ప్రభావితం చేస్తూ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొందరు మంత్రులు స్వయంగా ఆయా శాఖల్లో ఉన్న అధికారులను పిలిచి తన అభ్యర్థికి ఓటేయాలని చెపుతూ ఓటర్లను భయపెడుతున్నారన్నారు. అదే విధంగా అధికార పార్టీ నాయకులు ఓటర్లకు మొబైల్‌ఫోన్‌లు , నగదు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలపై అధికారులు దృష్టి సారించి దొంగ ఓట్లకు కళ్లెం వేయాలన్నారు.
అడ్డదారులను అడ్డుకుంటాం
– సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్
నెల్లూరు రూరల్ : తూర్పురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జిల్లా మంత్రి నారాయణ, అ పార్టీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్ ఎదుట టీడీపీ అక్రమాలకు నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నారాయణ మెడికల్ కళాశాలలో ఓటర్లకు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహన్‌రావు, రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, మూలంరమేష్, గోగుల శ్రీనివాసులు, నరహరి, సతీష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.