
మూకుమ్మడిగా విషం సేవించి, తాడుతో..
ఒకరి తరువాత మరొకరికి ముగ్గురు కొడులకూ మాయదారి రోగం వచ్చింది. ఒకరికి మించి మరొకరికి రోగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాన్ని వారు తట్టుకోలేకపోయారు. కళ్లెదుటే చెట్టంత ఎదిగిన బిడ్డలు రోగగ్రస్తులు కావడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న బిడ్డలు అనారోగ్యంతో తన ముందే కళ్లు మూస్తే ఇక తాను బతికుండి ఏం ప్రయోజనం అనుకుందో ఏమో ముగ్గురు కొడుకులతో కలిసి ఆ తల్లి ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృత్యువు దరి చేరేటప్పుడు విడిపోతే ఎలాగనుకున్నారో ఏమో నలుగురూ విడిపోకుండా తాడుతో కట్టుకొని, పురుగుల మందు సేవించి ఉప్పుటేరులో దూకి బుధవారం రాత్రి ఉసురు తీసుకున్నారు. గురువారం ఉదయం మత్స్యకారులు ఉప్పుటేరులో చేపలు పట్టేందుకు వల వేయగా మృతదేహాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..
పిఠాపురం/ కొత్తపల్లి :
కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. ముగ్గురు కొడుకులు ప్రభు ప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18). పెద్దవారిద్దరూ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సాయపడుతున్నారు. ప్రేమసాగర్ పదోతరగతి చదువుతుండగా ఆరోగ్యం బాగోలేక చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఆఖరి వాడితో మొదలైంది
నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ప్రేమసాగర్ అస్వస్థతకు గురికాగా కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. కొంత కాలం వరకు డయాలసిస్ చేయించాలని వారు అనడంతో ఆమేరకు నాలుగేళ్లుగా వైద్యం చేయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మిగిలిన ఇద్దరు కుమారులు ప్రభు ప్రకాష్, అనిల్ కుమార్ కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చూపించగా పరీక్షలు చేసిన వైద్యులు వారి కిడ్నీలు కూడా పాడయ్యాయని, ఆపరేషన్ చేయించక తప్పదని చెప్పారు.
ఉన్న కిడ్నీ ఇచ్చైనా కాపాడుకోవాలనుకున్నా...!
చిన్న కుమారుడికి కిడ్నీలు పాడయ్యాయని, రెండు కిడ్నీలు మార్చాలన్న వైద్యుల సూచనలతో తన కిడ్నీ ఇచ్చైనా వాడిని కాపాడాలని తండ్రి రాము వైద్యులను వేడుకున్నట్టు బంధువులు తెలిపారు. ఒకరికి తన కిడ్నీ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో మరో ఇద్దరు కుమారులకు అదే పరిస్థితి ఎదురవ్వడంతో వారిని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లిదండ్రులకు తోచలేదు. తల్లిదండ్రులిద్దరు చెరో కిడ్నీ ఇచ్చినప్పటికీ మరొకరికి కిడ్నీ ఇచ్చే వారు లేక పోవడంతో ఇక తమకు దిక్కెవరని రోదించే వారని స్థానికులు చెబుతున్నారు.
శోకసంద్రంగా అమరవిల్లి
తల్లి, ముగ్గురు కుమారులు మరణించడంతో అమరవిల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. అందరితో కలిసిమెలిసి ఉండే ఆకుటుంబ సభ్యులు ఇప్పుడు లేరన్న చేదు నిజాన్ని ఆగ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్న కొడుకులు, కట్టుకున్న భార్య లేకుండా నేనెందుకు బతకాలంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న రాముని ఆపడం ఎవరితరమూ కావడం లేదు. ఈ సంఘటనతో షాక్‌గురై రాము స్పృహ తప్పడంతో స్థానిక డాక్టర్ వైద్యసేవలందిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కొత్తపల్లి ఎస్సై చైతన్యకుమార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ ఎస్. వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్ రాజు, పిఠాపురం సీఐ ఎండీ ఉమర్ అక్కడకు చేరుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి.
మాయదారి రోగమే ముంచిందా..?
భూలక్ష్మి సోదరులు కిడ్నీసమస్యతోనే మృతి చెందారు. అదే రోగం తన ముగ్గురు కుమారులకు సోకడంతో ఇది వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో ఆమె తన కడుపున పుట్టడం వల్లే ముగ్గురు కొడుకులకు ఈరోగం వచ్చిందని భావించి ఇంత దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఆరోగ్యశ్రీ ఆదుకోదని..!
ఈ కిడ్నీ సమస్యకు ఆరోగ్యశ్రీ పథకంలో కొంత వరకే వైద్యం చేయగలమని, మిగిలిన ఖర్చులు మీరే పెట్టుకోవాలని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. ముగ్గురు కుమారులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం తమ శక్తికి మించిందని ఆకుటుంబ సభ్యులు బాధపడేవారని మృతుల బంధువులు తెలిపారు.