ఎదురుచూపు ! | Family members waiting for Maoist encounter bodies | Sakshi
Sakshi News home page

ఎదురుచూపు !

Published Tue, Oct 25 2016 11:41 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

ఎదురుచూపు ! - Sakshi

ఎదురుచూపు !

మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వస్థలమైన ఉద్దానం ప్రాంతానికి తరలించడం మరింత జాప్యమయ్యే అవకాశం కనబడుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మల్కన్‌గిరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య మంగళవారం నాటికి 28కి చేరింది. వారిలో ముగ్గురు జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందినవారు ఉన్న విషయం విదితమే.. సెంట్రల్ రీజనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న అలియాస్ సురేష్, అతని భార్య బొడ్డు కుందనాలు అలియాస్ సునీత అలియాస్ మమత, మరో సభ్యుడు మెట్టూరి జోగారావు అలియాస్ కోటీశ్వరరావు మృతదేహాలను అధికారికంగా గుర్తించాల్సి ఉంది.

 ప్రస్తుతం వారి మృతదేహాలు ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాకేంద్రంలో భద్రపరిచారు. ఆయా మావోయిస్టుల మృతదేహాలను గుర్తు పట్టడానికి, అలాగే పోస్టుమార్టం తర్వాత వాటిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మావోయిస్టుల కుటుంబసభ్యులు కొందరు మల్కన్‌గిరికి మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో మృతదేహాల పోస్టుమార్టం కోర్టు ఇచ్చే ఆదేశాలతో ముడిపడి ఉంది. దీంతో పోస్టుమార్టం ప్రక్రియ జాప్యమయ్యే అవకాశం ఉంది. నారాయణరావు, అతని భార్య కుందనాలు, జోగారావు మృతదేహాల రాక కోసం వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం, మందస మండలం నల్లబొడ్లూరు గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ఒడిశాలో జరిగిన జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో నష్టపోయినప్పుడు అందుకు ప్రతిగా నక్సలైట్లు దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా మందుపాతర పేల్చారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తర్వాత 2006లో భామిని మండలం గణసర వద్ద డీఎస్పీ లక్ష్యంగా ప్రధాన రహదారిలోనే మందుపాతరను పేల్చారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కూడా ఇలాంటి ప్రమాదం ఉంచి ఉండటంతో జిల్లాలో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులందరికీ భద్రత పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీని పోలీసులు మంగళవారం కూడా కొనసాగించారు.
 
 ఆది నుంచి ఉద్యమ పంథా....
 పుష్కర కాలం క్రితం మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించక పూర్వం జిల్లాలో సీపీఐఎంఎల్ (పీపుల్స్‌వార్) ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య నాయత్వంలో జిల్లాలో 1980 సంవత్సరం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టింది. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగానున్న రాడికల్ స్టూడెంట్స్‌యూనియన్, రాడికల్ యూత్ లీగ్‌ల్లో అనేక మంది జిల్లా యువత పనిచేసింది. వారే తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. పీపుల్స్‌వార్‌పై ప్రభుత్వం నిర్భందం పెంచడంతో వారంతా ఎక్కువ కాలం అజ్ఞాతంలోనే గడిపారు. మరోవైపు అదేసమయంలో దాడులు ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి.
 
 ఈ నేపథ్యంలో వరుసగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో పలువురు జిల్లాకు చెందిన మావోయిస్టులు మృతువాత పడ్డారు. తాజాగా జరిగిన మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జిల్లావాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకే దేశంలో ఎక్కడ మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగినా ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడుతోంది. చాలా ఎన్‌కౌంటర్లలో హతులైనవారు ఈ ప్రాంతానికి చెందినవారు, లేదంటే ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నవారు కావడం విశేషం.

 - రట్టి ఎన్‌కౌంటర్: మందస మండలం రట్టి కొండల్లో 1991-92 ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలో జరిగిన తొలి ఎన్‌కౌంటర్ కూడా ఇదే.

 - రంగ్‌మొటియా ఎన్‌కౌంటర్: మందస మండలంలోని కళింగదళ్ ప్రాంతంలోని రంగ్‌మొటియా కొండల్లో 1991-92 సమయంలోనే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నక్సలైట్లు, మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు.
 
 - బెండికొండ ఎన్‌కౌంటర్: వజ్రపుకొత్తూరు మండలంలోని బెండికొండ వద్ద 1992-93 ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ ఎరుపల్లి శాంతమూర్తి హతమయ్యాడు.

 - కొప్పరడంగీ ఎన్‌కౌంటర్: ఒడిశా సరిహద్దులోనున్న విజయనగరం జిల్లా కొప్పరడంగీ ప్రాంతంలో 1998 ఆగస్టు 9న ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 21 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి గంటి రమేష్ (రాజన్న), ముఖ్య నాయకులు దూర్వాసులు, అంబటి ఎర్రన్న, భూమన్న ఉన్నారు. వీరంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. అంతేకాదు రాష్ట్రంలోనే తొలిసారిగా జరిగిన పెద్ద ఎన్‌కౌంటర్ కూడా ఇదే.

 - గొట్లభద్ర ఎన్‌కౌంటర్: మెళియాపుట్టి మండలంలోని గొట్లభద్ర ప్రాంతంలో 1999లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జిల్లా అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షుడు కూనె కోదండరావు భార్య చిట్టెక్క, కుమార్తెతో పాటు మరో ముగ్గురు దళసభ్యులు మృతి చెందారు.

 - ముఖలింగాపురం ఎన్‌కౌంటర్: టెక్కలి సమీపంలోని ముఖలింగాపురం వద్ద 2000 సంవత్సరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు, ఒక పౌరుడు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతులంతా జిల్లాకు చెందినవారే.
 
 - చంద్రగిరి ఎన్‌కౌంటర్: మెళియాపుట్టి మండలంలోని చంద్రగిరి వద్ద 2000-01 సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు నక్సలైట్లు జిల్లాకు చెందినవారు.
 
 - గుమ్మలక్ష్మీపురం ఎన్‌కౌంటర్: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో 2012లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు జగబంధుతో పాటు ఆయన అనుచరుడొకరు మృతి చెందారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇదే ఆఖరి ఎన్‌కౌంటర్.  
 
 ఈ ఘటనలే గాకుండా ఏవోబీ, నల్లమల, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌ల్లో జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టులు మృతి చెందారు.  
 
  మావోయిస్టుల మృతదేహాలను రప్పించడానికి ప్రయత్నాలు
 
   ఉద్దానం నుంచి మల్కన్‌గిరికి వెళ్లిన బంధుమిత్రులు
 
  జిల్లాలో  కొనసాగుతున్న పోలీసు తనిఖీలు
 
   ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement