నిబంధనలు తూచ్! | Fancy numbers in the district capital Craze | Sakshi
Sakshi News home page

నిబంధనలు తూచ్!

Published Wed, Nov 2 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

నిబంధనలు తూచ్!

నిబంధనలు తూచ్!

రాజధాని జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
వీఐపీలు, రాజకీయ నేతలకు తక్కువ ధరకే కేటాయింపు
పోటీకి ఎవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్న వైనం
9999 నంబర్‌ను  రూ. 50 వేలకే దక్కించుకున్న తారకరత్న


గుంటూరు :  అక్కడ సామాన్యులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి... ఉన్నతాధికారులు, వీఐపీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం నిబంధనలు అడ్డురావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నంబర్లను లక్షల్లో వేలం ద్వారా దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఫ్యాన్సీ నంబర్లకు వేలం లేకుండా అసలు ధరకే ఇవ్వాలంటూ ఆర్టీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండడంతో అడ్డుచెప్పలేక మిన్నకుండిపోతున్నారు.

 గుంటూరు డీటీసీ కార్యాలయంతోపాటు నరసరావుపేటలోని ఆర్టీవో కార్యాలయం, తెనాలి, పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాల్లో మాత్రం ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. జిల్లాలో నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న నేపథ్యంలో  జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఇక్కడే తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక మోస్తరు ఫ్యాన్సీ నంబరుకు సైతం పోటీ అధికంగా ఉండడంతో లక్షలు వెచ్చించి వేలం  ద్వారా దక్కించుకుంటున్నారు. ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెంబరును ఆన్‌లైన్ ద్వారా నిబంధనల ప్రకారం కేటాయిస్తామని చెబుతున్న ఆర్టీఏ అధికారులు పలుకుబడి ఉన్నవారికి మాత్రం నిబంధనలు పక్కన బెట్టి నిర్ణయించిన ధరకే  కేటాయిస్తున్నారు.

నిర్ణయించిన ధరకే ఫ్యాన్సీ నంబర్
గుంటూరులో కొన్ని నెలలుగా పోటీ ఎక్కువగా ఉన్న ఫ్యాన్సీ నంబర్లు సైతం నిర్ణయించిన ధరకే పోతున్నాయి తప్ప, అధిక ధరలకు ఎవరూ తీసుకోవడం లేదు. ఖర్చుపెట్టేందుకు ఆసక్తికనబర్చడం లేదనుకుంటే పొరబడినట్లే. ఫ్యాన్సీ నంబర్ల మీద కన్నేసిన ఉన్నతాధికారులు, అధికారపార్టీ నేతలు, వారి బంధువులు తమ పలుకుబడి ఉపయోగించి ఎవరినీ పాటకు రాకుండా బెదిరిస్తూ నిర్ణయించిన ధరకే తమకు కావాల్సిన నంబరును దక్కించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి తన వాహనానికి ఫ్యాన్సీ నంబ రును కేటాయించాలంటూ ఆర్టీఏ అధికారులకు హుకుం జారీ చేయడంతోపాటు, తన కార్యాలయ పరిపాలన అధికారిని అక్కడ ఉంచి ఎవరూ పోటీకి రాకుండా చేసి తక్కువధరకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన ఓ నాయకుడు సైతం ఫ్యాన్సీ నంబరును నిర్ణయించిన ధరకే దక్కించుకున్నాడు.  జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రాకపోవడం చూస్తుంటే అధికారులు ఏస్థాయిలో నిబంధనలకు పాతర వేస్తున్నారో అర్ధమవుతోంది.

9999 నంబరును రూ. 50 వేలకు దక్కించుకున్న తారకరత్న
ముఖ్యమంత్రి బంధువు, హీరో నందమూరి తారకరత్న తన వాహనానికి నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో ఏపీ07 సీడబ్ల్యూ 9999 నంబరును కేవలం రూ. 50వేలకు దక్కించుకున్నారు.  స్థాని కంగా నివాసం ఉండనప్పటికీ ఓ బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్ని ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్సు ప్రూఫ్‌గా చూపించి నంబరును దక్కించుకున్నారు.  ఈ నంబరుకు మరికొందరు పోటీకి వచ్చినప్పటికీ అధికారులు నచ్చజెప్పి వారిని విరమించుకునేలా చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్డు 15 రోజుల తరువాత పోసులో పంపుతారు. తారకరత్నకు మాత్రం నిమిషాల్లో కార్డు తయారు చేయించి చేతికిచ్చి పంపి ఆర్టీఏ అధికారులు తమ స్వామిభక్తి చాటుకున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement