పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి
Published Sun, Jul 31 2016 1:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఏటూరునాగారం : పిడుగుపాటుకు ఓ వ్యవసా య కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలోని ఓడవాడలో శనివారం జరిగింది. మండలంలోని తాళ్లగడ్డ మేడారం చెరువు శివారు ప్రాంతంలోని కర్ల సమ్మయ్య పొలంలో వరి నాట్లు వేసేందుకు ఓడవాడకు చెందిన మహిళలు వెళ్లారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వర్షం కురుస్తున్న సమయంలో పొలంలో పిడుగు పడింది. దీంతో అంబరికాని భద్రమ్మ(65) ఒంటిపై బొబ్బలు వచ్చి అక్కడికక్కడే మృతిచెందగా పక్కనే ఉన్న రెడ్డి సమ్మక్క, కర్ల సరోజన, రాందాస్ సమ్మక్క స్పృహ కోల్పోయారు. మిగతా కూలీలు భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఆమె మృతిచెందిందని నిర్ణయించుకొని పొలం నుంచి ఏటూరునాగారం ప్రధాన రోడ్డుకు ఎడ్లబండిలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి మృతదేహాన్ని టాటా ఏస్‌లో ఇంటికి తరలించారు. మిగతా ముగ్గురిని మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలికి కుమారులు కృష్ణ, మహేష్ ఉన్నారు.
Advertisement
Advertisement