విద్యుత్ సబ్‌స్టేష్ ముట్టడి
-
అప్రకటిత కోతలపై రైతుల ఆగ్రహం
-
అంబారిపేటలో అన్నదాతల నిరసన
కథలాపూర్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితిలో ఉన్నామని ఆగ్రహించిన గంభీర్‌పూర్ గ్రామ రైతులు మంగళవారం అంబారిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. రాత్రివేళల్లో ఇళ్లకు కరెంట్ కోతలు విధించడంతో అంధకారంలో గడుపుతున్నామని ఆవేదన చెందారు. త్రీఫేజ్ సమయంలోనూ కరెంట్ సరిగా సరఫరా చేయడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు. సుమారు నెలరోజులుగా విద్యుత్ సమస్యలతో ఇక్కట్లపాలవుతున్నామని పేర్కొన్నారు. అప్రకటిత కోతలతో అవస్థలు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో అధికారులను సంప్రదిస్తే స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు కరెంట్ కోతలు విధిస్తే పంటలకు నీళ్లు అందక ఎండిపోతాయని రైతులు వాపోయారు. కరెంట్ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. అక్కడకు వచ్చిన ట్రాన్స్‌కో ఏఈ రవితో ఇదే విషయంపై వాదనకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.