బాయికాడి ఎల్లయ్య మృతదేహం
- చికిత్స పొందుతూ మృతి చెందిన అన్నదాత
- వారం క్రితం విద్యుత్ షాక్‌కు గురైన రైతు
- ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
- రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు అంగీకారం
మెదక్: కరెంట్ షాక్‌కు గురై వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయిన ఓ రైతు కన్ను మూశాడు. ఆందోళనకు గురైన మృతుడి కుటుంబీకులు మెదక్ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని వాడి గ్రామానికి చెందిన బాయికాడి ఎల్లయ్య(45) పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వైర్ పోయి వారం రోజుల క్రితం కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటకు నీళ్లు పెట్టేందుకు ఎల్లయ్య ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్‌వైర్ వేస్తున్న క్రమంలో కరెంట్‌షాక్ తగిలి శరీరమంతా కాలిపోయింది.
హుటాహుటిన కుటుంబీకులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన స్థానిక వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా శరీరమంతా కాలిపోవడంతో రైతు ఎల్లయ్య కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో ఎల్లయ్య చేతులను వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు.
దీంతో ఆయన ఆదివారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే స్థానికంగా ట్రాన్స్‌కో అధికారులు లేకపోవడంతోనే ఎల్లయ్య ప్రాణం పోయిందని ఆగ్రహించిన వాడి గ్రామస్తులు, మృతుడి కుటుంబీకులు సోమవారం మెదక్ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు.
మృతుడి కుటుంబానికి రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సాయీశ్వర్‌గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. దీంతో దిగివచ్చిన ట్రాన్స్‌కో డీఈ వెంకటరత్నం బాధిత కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీనివ్వడంతో వారు శాంతించారు. ఈ ఆందోళనలో మృతుడి కుటుంబీకులతోపాటు నాయకులు కిష్టయ్య, సత్యనారాయణ, తార్యనాయక్ తదితరులు ఉన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.