ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వేయబోయి రైతు మృతి
Published Wed, Aug 24 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
కొత్తగూడెం(సంగెం) : ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైరును సరిచేయడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై ఓ రైతు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని కొత్తగూడెంలో బుధవారం జరిగింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం సాంబయ్య(47) బుధవారం ఉదయం పత్తి పంటకు నీరుపెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేయగా నడవడం లేదు. దీంతో పక్క చేను రైతు వాసం సూరయ్యతో కలిసి గ్రామంలోని ఎస్‌ఎస్–2 ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వేయడానికి ఏబీ స్విచ్‌ను బంద్ చేస్తున్న క్రమంలో 11 కేవీ కండక్టర్ ఏబీ స్విచ్ రాడ్‌కు తగిలింది.
ఈ విషయాన్ని గమనించకపోవడంతో అతడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే అరుస్తూ పడిపోయాడు. సాంబయ్యతో వచ్చిన సూరయ్య వెంటనే చేతులు నలుస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులను పిలిచాడు. వారు వచ్చి 108కు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది వచ్చి సాంబయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాంబయ్య మృతిచెందాడని కుటుంబ సభ్యులు, తోటి రైతులు ఆరోపించా రు. మృతుడికి భార్య బుచ్చమ్మ, కుమారులు రాధాకృష్ణ, రామకృష్ణ ఉన్నారు. ఎస్సై వి.క్రాంతికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు హామీ
విద్యుదాఘాతంతో మృతిచెందిన రైతు వాసం సాంబయ్య కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి పరిహారంగా రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించడానికి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement