మహేశ్ మృతదేహం
- పొలం ఎండిపోవడంతో బలవన్మరణం
- నవాబుపేటలో విషాదం
మెదక్: పొలాన్ని కౌలుకు తీసుకొని వేలాది రూపాయల అప్పులు చేసి సాగుచేస్తే అది ఎండిపోవడంతో దిక్కుతోచని ఓ కౌలురైతు విషం తాగి ఆత్మహత్య హత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని నవాబుపేటలో బుధవారం వెలుగు చూసింది. మృతుడి భార్య, పట్టణ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నవాబుపేటకు చెందిన నింగి మహేష్(26)కు పట్టణ శివారులో అర ఎకరం పొలం ఉంది.
అలాగే ఓ రైతు వద్ద 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశాడు. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవటంతో సాగు చేసిన పంటంతా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో బతుకు భారమై ఈనెల 23న ఇంట్లో నుండి వెళ్లిన మహేష్ పట్టణ శివారులోని పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంతంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పశువుల కాపరులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పరిశీలించి నవాబుపేటకు చెందిన మహేష్‌గా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించింది. పొలం ఎండిపోవడంతో వారం రోజులుగా మహేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య లక్ష్మితోపాటు 3 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలున్నారు. అందరితో కలివిడిగా ఉండే కౌలు రైతు ఆత్మహత్య చేసుకోవటంతో నవాబుపేటవాసులు కన్నీరు పెట్టుకున్నారు.