అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తుగ్గలి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లంకాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి(60) కొన్నేళ్లుగా ఉన్న 20 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరుసగా నష్టాలు రావడం, అలాగే ముగ్గురు కుమార్తెలకు పెళ్లిల్లు చేయడంతో అప్పులు పెరిగిపోయాయి. దాదాపు రూ. 5 లక్షలకు పైగా అప్పు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలాన్ని సాగు చేయలేక కౌలుకు ఇచ్చాడు. గురువారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవమ్మ, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ జనార్దన్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.