అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య | farmer suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

Published Sat, May 13 2017 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య - Sakshi

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

నేలతలమరి(దేవనకొండ): అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని నేలతలమరిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన గొల్ల రామాంజనేయులు, గొల్ల గోవిందమ్మల రెండో కుమారుడు గొల్ల నెట్టెకంటి చంద్రశేఖర్‌(33) శనివారం పొలం వద్దనున్న లింగమయ్య వాగు వద్ద పురుగుమందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో గత ఐదేళ్లుగా పత్తి, వేరుశనగ పంటలను సాగుచేస్తున్నాడు. వరుసగా ఐదేళ్ల నుంచి పంట దిగుబడులు సరిగా రాకపోవడంతో అప్పుల భారం రూ.6 లక్షలకు చేరుకుంది.
 
దేవనకొండ సొసైటీలో రూ.2.50 లక్షలు.. మిగిలిన మొత్తం ప్రయివేట్‌ వ్యక్తుల వద్ద తీసుకున్నాడు. ఈ మొత్తం ఎలా తీర్చాలో తెలియక గతంలో రెండు సార్లు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో మనస్తాపం చెందిన రైతు గొల్ల చంద్రశేఖర్‌ శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయాని ఫోన్‌ ద్వారా తన మామకు తెలియజేశాడు. వెంటనే పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చంద్రశేఖర్‌ మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, నలుగురు ఆడ పిల్లలు కాగా.. అందరూ ఐదేళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. దేవనకొండ ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 
గ్రామంలో గత మూడేళ్లుగా వరుస రైతు ఆత్మహత్యలే 
నేలతలమరి గ్రామంలో గత మూడేళ్ల నుంచి అప్పుల బాధ తాళలేక నలుగురు రైతులు మృతిచెందారు. శనివారం పురుగుమందు తాగిమృతి చెందిన గొల్ల చంద్రశేఖర్‌తో కలిపి ఆ సంఖ్య ఐదుకు చేరింది.  గ్రామంలో ఇప్పటివరకు రైతులు కౌలుట్ల, నేసే నాగరాజు, విశ్వనాథ్, వేణుగోపాల్‌రెడ్డి అనే రైతులు అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement